మౌలిక వసతులకు రూ.10 లక్షల కోట్లు

దేశంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులను ఏకంగా 33% పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చింది.

Published : 02 Feb 2023 03:28 IST

33 శాతం పెరిగిన కేటాయింపులు

దిల్లీ: దేశంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులను ఏకంగా 33% పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చింది. జీడీపీలో ఈ కేటాయింపులు 3.3 శాతానికి సమానం. 2019-20తో పోలిస్తే 3 రెట్లు అధికమని ఆర్థిక మంత్రి సీతారామన్‌ తెలిపారు. మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ‘మౌలిక వసతుల ఆర్థిక సెక్రటేరియట్‌’ సహాయపడనుందని పేర్కొన్నారు. ‘కరోనా సమయంలో స్తబ్దుగా మారిన ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. ఆ పెట్టుబడులు, ఉద్యోగ సృష్టి చక్రానికి మరింత వేగం అందించడమే బడ్జెట్‌ లక్ష్యమ’ని వివరించారు.

* నౌకాశ్రయాలు, బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఆహారధాన్యాల రంగాల్లో తొలి నుంచి చివరి దశ వరకు అనుసంధానం చేసే 100 కీలక రవాణా మౌలిక వసతుల ప్రాజెక్టులను గుర్తించినట్లు సీతారామన్‌ పేర్కొన్నారు. వీటికి ప్రైవేటు వనరుల నుంచి రూ.15,000 కోట్లు సహా మొత్తం రూ.75,000 కోట్ల పెట్టుబడులు కేటాయించామని అన్నారు.
* అమృత్‌ కాల్‌కు సరిపోయేలా.. వర్గీకరణ, ఆర్థిక వ్యవస్థను సిఫారసు చేసేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ‘హార్మనైజ్డ్‌ మాస్టర్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ను సమీక్షిస్తుంది.
* జాతీయ రహదారుల రంగానికి రూ.2.7 లక్షల కోట్లను 2023-24 బడ్జెట్‌లో కేటాయించారు. 2022-23లో వీటికి రూ.1.99 లక్షల కోట్లను కేటాయించి.. తర్వాత రూ.2.17 లక్షల కోట్లకు సవరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని