ఎయిరిండియా.. 470 కొత్త విమానాలు

టాటా గ్రూపు అధీనంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా మరిన్ని గమ్యస్థానాలకు చేరేంద]ుకు, సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 470 విమానాల కొనుగోలుకు మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది.

Updated : 15 Feb 2023 03:09 IST

ఎయిర్‌బస్‌ నుంచి 250 .. బోయింగ్‌ నుంచి 220
విలువ రూ.6.40 లక్షల కోట్లు

దిల్లీ: టాటా గ్రూపు అధీనంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా మరిన్ని గమ్యస్థానాలకు చేరేంద]ుకు, సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 470 విమానాల కొనుగోలుకు మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో  ఫ్రాన్స్‌ సంస్థ ఎయిర్‌బస్‌ నుంచి 250 విమానాలు, అమెరికా సంస్థ బోయింగ్‌ నుంచి 220 విమానాలు సరఫరా అవుతాయి. ఈమొత్తం ఆర్డరు విలువ 80 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6.40 లక్షల కోట్లు) ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఎయిర్‌బస్‌ నుంచి 40 వైడ్‌బాడీ (పెద్ద) ఏ 350 విమానాలు, 210 నారో బాడీ (చిన్న) ఏ320/321 నియో విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు. దృశ్యమాధ్యమ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ ప్రెసిడెంట్‌ ఎమాన్యువల్‌ మాక్రాన్‌, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పీయూష్‌ గోయల్‌, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా, ఎయిరిండియా సీఈఓ విల్సన్‌ క్యాంప్‌బెల్‌, ఎయిర్‌బస్‌ సీఈఓ గిలామే ఫారే  పాల్గొన్నారు. 16 గంటలకు పైగా ప్రయాణించే అల్ట్రా- లాంగ్‌ హాల్‌ విమానాల కోసం వైడ్‌ బాడీ విమానాలను ఉపయోగిస్తామని చంద్రశేఖరన్‌ తెలిపారు.

బోయింగ్‌ నుంచి పెద్ద విమానాలైన 20 బోయింగ్‌ 787ఎస్‌; 10 బోయింగ్‌ 777-9ఎస్‌తో పాటు సింగిల్‌ యాసిల్‌ బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు 190 కొనుగోలు చేసేందుకూ ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పంద విలువ 34 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.80 లక్షల కోట్లు). మరో 70 విమానాలు కొనుగోలు చేసే హక్కునూ ఎయిరిండియా పొందింది. అప్పుడు మొత్తం విలువ 45.9 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3.76 లక్షల కోట్లు). విలువ పరంగా బోయింగ్‌కు లభించిన మూడో అతిపెద్ద ఆర్డరు ఇది కాగా, విమానాల సంఖ్యా పరంగా రెండోది. ఇందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 14.7 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. బోయింగ్‌, ఎయిరిండియా ఒప్పందం ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

* ఎయిర్‌బస్‌ ఏ350 విమానాలకు రోల్స్‌రాయిస్‌ ఇంజిన్లు, బోయింగ్‌ 777/787ఎస్‌ విమానాలకు జీఈ ఏరోస్పేస్‌ ఇంజిన్లు, సింగిల్‌ యాసిల్‌ విమానాలన్నింటికీ జీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌ ఇంజిన్లు వినియోగిస్తామని ఎయిరిండియా తెలిపింది.

* కొత్త ఆర్డర్లకు సంబంధించి తొలి విమానం ఈ ఏడాది ఆఖరులో చేరుతుందని, అధిక విమానాలు 2025 మధ్య నుంచి వస్తాయని ఎయిరిండియా పేర్కొంది. ప్రస్తుత అవసరాల కోసం 11 బోయింగ్‌ 777 విమానాలు, ఏ320 విమానాలు 25 లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. కొత్త విమానాల కోసం ఎయిరిండియా ఆర్డరు పెట్టడం 17 ఏళ్ల తరవాత ఇప్పుడే.  


15 ఏళ్లలో 2000 విమానాలు అవసరం: ప్రధాని మోదీ

ఎయిర్‌బస్‌, బోయింగ్‌ - ఎయిరిండియా ఒప్పందం చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌, ఫ్రాన్స్‌, అమెరికాల మధ్య ఉన్న బలమైన బంధానికి, భారత పౌర విమానయాన రంగ విజయాలు, ఆశయాలకు ఇది నిదర్శనమని అన్నారు. విమానయాన రంగంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విపణిగా ఎదగనున్న భారత్‌కు, వచ్చే 15 ఏళ్లలో 2,000కి పైగా విమానాలు అవసరం అవుతాయని ప్రధాని తెలిపారు. ‘జాతీయ మౌలిక సదుపాయాల విధానంలో విమానయాన రంగాన్ని బలోపేతం చేయడం ముఖ్యమైన అంశమ’ని వివరించారు. గత 8 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 147కు పెరిగిందని ప్రధాని గుర్తు చేశారు.


చివరిసారి 2005లో 111 విమానాలకు (బోయింగ్‌ నుంచి 68, ఎయిర్‌బస్‌ నుంచి 43) ఎయిరిండియా ఆర్డరు పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని