సంక్షిప్త వార్తలు (6)

సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బకాయిల కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.33,111 కోట్లను వచ్చే ఏప్రిల్‌- జూన్‌లో చెల్లించాల్సి ఉందని పార్లమెంటరీ కమిటీ నివేదిక పేర్కొంది.

Updated : 22 Mar 2023 04:55 IST

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏజీఆర్‌ బకాయిలు రూ.33,111 కోట్లు

దిల్లీ: సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బకాయిల కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.33,111 కోట్లను వచ్చే ఏప్రిల్‌- జూన్‌లో చెల్లించాల్సి ఉందని పార్లమెంటరీ కమిటీ నివేదిక పేర్కొంది. కమ్యూనికేషన్స్‌, ఐటీ స్టాండింగ్‌ కమిటీకి సమర్పించిన నివేదిక ప్రకారం.. 2023-24కు టెలికాం విభాగం రూ.39,725.07 కోట్లు కోరగా, బడ్జెట్‌లో రూ.66,691.81 కోట్లు కేటాయించారు. 2023-24కు బడ్జెట్‌ అంచనా కింద డాట్‌కు ఆర్థిక శాఖ రూ.1,08,153.25 కోట్లు ప్రకటించింది. రెవెన్యూ విభాగం కింద రూ.41,461.43 కోట్లు, మూలధన ఖాతాలో రూ.66,691.82 కోట్లు కేటాయింపులు చేసింది. ప్రస్తుత ఆర్థికంలో బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు ప్రభుత్వం రూ.44,720 కోట్ల మూలధనం కేటాయించింది. అనంతరం దీన్ని రూ.33,269.01 కోట్లకు సవరించారు. ఇందులో 2022 డిసెంబరు వరకు రూ.23,873.44 కోట్లు ఖర్చు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ స్థితి క్రమంగా మెరుగుపడుతోందని, 2026-27కు లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని పార్లమెంటరీ కమిటీకి టెలికాం విభాగం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల నుంచి రూ.17,161 కోట్లు, 2023-24లో రూ.21,908 కోట్ల ఆదాయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ అంచనా వేస్తోంది.


తనిష్క్‌ ఉగాది ఆఫర్లు

ప్రత్యేక కలెక్షన్‌ ‘వర్ధిని’

హైదరాబాద్‌: ఉగాది పండగను పురస్కరించుకుని ‘వర్ధిని’ పేరుతో ప్రత్యేక ఆభరణాల కలెక్షన్‌ను టాటా గ్రూప్‌ సంస్థ తనిష్క్‌ విడుదల చేసింది. స్వశక్తితో అభివృద్ధి చెందుతున్న, విభిన్న ఆలోచనలు కలిగిన మహిళల కోసం ఈ ఆభరణాల కలెక్షన్‌ను తీర్చిదిద్దినట్లు సంస్థ వెల్లడించింది. వర్ధిని కలెక్షన్‌లో నెక్లెస్‌లు, చెవి రింగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ఉన్నాయి. పండగ ఆఫర్లలో భాగంగా ప్రతి ఆభరణం కొనుగోలుపై ఉచితంగా బంగారు నాణేన్ని అందిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులు తమ పాత బంగారం మార్పిడిపై 0% తరుగు ఆఫర్‌నూ పొందొచ్చు. ఈ పరిమిత కాల ఆఫర్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని విక్రయశాలల్లో వినియోగదారులు పొందొచ్చని వివరించింది.


ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఐపీఓ

దిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రమోటర్‌గా ఉన్న ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు సెబీ నుంచి అనుమతి లభించింది. తాజా షేర్ల జారీ ద్వారా       రూ.500 కోట్ల నిధుల్ని సమీకరించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో 14,12,99,422 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, వాటాదార్లు విక్రయించనున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 8,90,15,734 ఈక్విటీ షేర్లను, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1,30,56,415 షేర్లను విక్రయించబోతున్నాయి. కార్మెల్‌ పాయింట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇండియా 3,92,27,273 ఈక్విటీ షేర్లను విక్రయించబోతోంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు ఇండియాఫస్ట్‌ లైఫ్‌లో 65% వాటా ఉండగా, వార్‌బర్గ్‌ పిన్‌కస్‌ అనుబంధ సంస్థ అయిన కార్మెల్‌ పాయింట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇండియాకు 26 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 9 శాతం వాటాలున్నాయి. ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ లేదా రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.100 కోట్ల నిధుల్ని సమీకరించే యోచనలోనూ ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఉంది. ఇది పూర్తయితే, ఐపీఓ పరిమాణం ఆ మేరకు తగ్గే అవకాశం ఉంది. ఐపీఓ ధర, ఇష్యూ తేదీ వంటి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో షేర్లను నమోదు చేయనున్నారు.


వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 31,000 మంది పైలెట్లు అవసరం: బోయింగ్‌

ముంబయి: వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 31,000 మంది పైలెట్లు, 26,000 మంది మెకానిక్‌ల అవసరం ఉంటుందని అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ పేర్కొంది. ఇటీవల దేశీయ విమానయాన సంస్థలు భారీగా విమాన ఆర్డర్లు పెట్టిన నేపథ్యంలో సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయంగా చూస్తే దక్షిణాసియా ప్రాంతం వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన విపణిగా కొనసాగే అవకాశం ఉందని బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్తే తెలిపారు. భారత విమాన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుంటే, విమానాశ్రయాల సహా మౌలిక సదుపాయాల అభివృద్ధి చాలా అవసరమని వెల్లడించారు. గత నెలలో బోయింగ్‌, ఎయిర్‌బస్‌లకు 470 విమానాల ఆర్డరును టాటా గ్రూప్‌ సంస్థ ఎయిరిండియా పెట్టిన విషయాన్ని సలీల్‌ గుర్తు చేశారు. కరోనా సంక్షోభం తర్వాత విమాన ప్రయాణికుల గిరాకీ శరవేగంగా పుంజుకోవడం ప్రపంచాన్ని ఆశ్యర్యపరిచిందని అన్నారు.


నాట్కో షేర్ల బైబ్యాక్‌ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: నాట్కో ఫార్మా ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజున ఎన్‌ఎస్‌ఈలో 55,000 షేర్లను కొనుగోలు చేశారు. ఒక్కో షేరు సగటు కొనుగోలు ధర రూ.539.69. బీఎస్‌ఈలో షేర్లు కొనుగోలు చేయలేదు. బైబ్యాక్‌ ప్రక్రియ ఆరు నెలల వరకు లేదా, ఇందుకోసం కేటాయించిన నిధులు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ‘ఓపెన్‌ మార్కెట్‌’ పద్ధతిలో స్టాక్‌మార్కెట్ల ద్వారా ఒక్కో షేరును గరిష్ఠంగా రూ.700 ధర వరకు కొనుగోలు చేయాలని నాట్కో ఫార్మా నిర్ణయించి,  రూ.210 కోట్లు కేటాయించింది.


ముడి చమురుపై పన్ను తగ్గింపు

దిల్లీ: ఓఎన్‌జీసీ లాంటి కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై పన్ను ప్రస్తుతం టన్నుకు రూ.4,400గా ఉండగా, రూ.900 తగ్గించి రూ.3,500కు ప్రభుత్వం సవరించింది. డీజిల్‌ ఎగుమతిపై అదాటు లాభాల (విండ్‌ఫాల్‌) పన్ను లీటరుకు 50 పైసలు ఉండగా, దీన్ని రూపాయికి   పెంచింది. విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ఎగుమతులపై పన్నేమీ లేదు. కొత్త పన్ను రేట్లు ఈనెల 21 నుంచి అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి 15 రోజులకోసారి విండ్‌ఫాల్‌ పన్నులో ప్రభుత్వం మార్పులు చేస్తోంది. పెట్రోలు ఎగుమతులపై ఎటువంటి పన్ను విధించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని