సంక్షిప్త వార్తలు(6)

ప్రీమియం ప్యాకేజ్డ్‌ తాగు నీటి సీసాలను విక్రయించే ‘క్లియర్‌’ తన ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ను నియమించుకుంది.

Updated : 26 Mar 2023 09:34 IST

క్లియర్‌ ప్రీమియం వాటర్‌ ప్రచారకర్తగా హృతిక్‌ రోషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రీమియం ప్యాకేజ్డ్‌ తాగు నీటి సీసాలను విక్రయించే ‘క్లియర్‌’ తన ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ను నియమించుకుంది. జాతీయ స్థాయిలో క్లియర్‌ వాటర్‌కు ప్రచారాన్ని కల్పించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ సీఈఓ నయన్‌ షా తెలిపారు. ఆధునిక సాంకేతికతతో తాము నీటిని శుద్ధి చేసి అందిస్తున్నామని, దీనికోసం అధునాతన ప్లాంటును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విమాన సంస్థలు, ప్రముఖ హోటళ్లు తమ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు తెలిపారు.


రూ.348 కోట్లతో  లోటస్‌ సర్జికల్స్‌ కొనుగోలు
ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌

చెన్నై: గాయాలను మాన్పివేసే ఉత్పత్తుల తయారీ సంస్థ లోటస్‌ సర్జికల్స్‌ను రూ.348 కోట్లతో కొనుగోలు చేయబోతున్నట్లు ట్యూబ్‌   ఇన్వెస్ట్‌మెంట్స్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సంయుక్తంగా శనివారం ప్రకటించాయి. మురుగప్పా గ్రూప్‌నకు చెందిన ఇంజినీరింగ్‌ సంస్థ ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(టీఐఐ). ఈ సంస్థతో కలిసి అజీమ్‌ ప్రేమ్‌జీ పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌.. లోటస్‌ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనుంది. టీఐఐ రూ.233 కోట్ల పెట్టుబడితో 67 శాతం వాటా కొనుగోలు చేస్తుండగా, రూ.115 కోట్ల పెట్టుబడితో 33 శాతం వాటాను ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ దక్కించుకోనుంది.


అవలాన్‌ టెక్‌ ఐపీఓ 3న

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ తయారీ సేవల సంస్థ అవలాన్‌ టెక్నాలజీస్‌    రూ.865 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ ఏప్రిల్‌ 3న మొదలై 6న ముగుస్తుంది. యంకర్‌ ఇన్వెస్టర్లకు మార్చి 31నే బిడ్డింగ్‌ మొదలవుతుందని కంపెనీ ముసాయిదా పత్రాలను బట్టి తెలుస్తోంది. తాజా ఈక్విటీ షేర్ల ద్వారా రూ.320 కోట్లు; ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా రూ.545 కోట్లను సమీకరించనుంది. రూ.1,025 కోట్ల మేర సమీకరించాలని కంపెనీ అంతక్రితం భావించిన సంగతి తెలిసిందే. అయితే ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.160 కోట్లు సమీకరించడం ఇందుకు నేపథ్యం.


చైనాపై యాపిల్‌ సీఈఓ పొగడ్తల వర్షం

షాంఘై: వాణిజ్య యుద్ధం మొదలుకొని.. సాంకేతిక, భౌగోళిక-రాజకీయ విషయాల్లో అమెరికా, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ సమయంలో చైనాలో పర్యటించారు అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌. అలాగే డ్రాగన్‌ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతోన్న చైనా డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌లో పాల్గొనేందుకు టిమ్‌కుక్‌ చైనా వెళ్లారు. ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులు, ప్రముఖ సంస్థల సీఈఓలు దీనికి హాజరవుతున్నారు. ఈ క్రమంలో కుక్‌ మాట్లాడుతూ ‘చైనాలో వేగంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇవి మరింత వేగవంతమవుతాయని విశ్వసిస్తున్నా’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలికి తరలించాలని యాపిల్‌ భావిస్తున్న వేళ కుక్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల చైనా అనుసరించిన కొవిడ్‌ జీరో వ్యూహం కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్‌ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాల మధ్య ఆయన చైనాలో పర్యటిస్తున్నారు.  


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎఫ్‌ఓగా శ్రీకాంత్‌

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా శ్రీకాంత్‌ వెంకటాచారిని నియమించారు. జూన్‌ 1 నుంచి ఈయన నియామకం అమల్లోకి వస్తుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం సీఎఫ్‌ఓగా ఉన్న అలోక్‌ అగర్వాల్‌(65) నుంచి శ్రీకాంత్‌ బాధ్యతలు తీసుకుంటారు. 1993లో ఆర్‌ఐఎల్‌ చేరిన అలోక్‌ 2005 నుంచి సీఎఫ్‌ఓగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన్ను ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌, ఎండీ ముకేశ్‌ అంబానీకి సీనియర్‌ సలహాదారుగా ఎంపిక చేశారు. శ్రీకాంత్‌ వెంకటాచారి (57) ప్రస్తుతం సంయుక్త సీఎఫ్‌ఓగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా అలోక్‌తో కలిసి పని చేస్తున్న శ్రీకాంత్‌ ఆర్‌ఐఎల్‌లో 14 ఏళ్లుగా ఉన్నారు. దీనికి ముందు ఆయన సిటీ గ్రూప్‌లో రెండు దశాబ్దాలు ట్రేడింగ్‌, డెరివేటివ్స్‌ విభాగంలో పని చేసి మార్కెట్స్‌ హెడ్‌ స్థాయికి చేరుకున్నారు.

5జీ కోసం లక్ష టవర్ల ఏర్పాటు.. జియో: రిలయన్స్‌ జియో తన 5జీ సేవలను వేగంగా విస్తరించడంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. పోటీ సంస్థల కంటే ఇవి 5 రెట్లు ఎక్కువని తెలుస్తోంది. జియో 700 మెగాహెర్ట్జ్‌, 3,500 మెగాహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీలో ఇప్పటికే 99,897 బేస్‌ ట్రాన్సీవర్‌ స్టేషన్ల (బీటీఎస్‌)ను ఏర్పాటు చేసిందని టెలికాం విభాగం (డాట్‌) వెల్లడించింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని