ప్రీమియం హోటళ్లకు కళ

ప్రీమియం హోటళ్లు కళకళలాడనున్నాయి. ముఖ్యంగా ఆదాయం విషయంలో రాణించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15-20% మేర వృద్ధి చెందనున్నట్లు క్రిసిల్‌ తన నివేదికలో పేర్కొంది.

Published : 26 Mar 2023 01:40 IST

80% పెరగనున్న ఆదాయం: క్రిసిల్‌ నివేదిక అంచనా

ముంబయి: ప్రీమియం హోటళ్లు కళకళలాడనున్నాయి. ముఖ్యంగా ఆదాయం విషయంలో రాణించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15-20% మేర వృద్ధి చెందనున్నట్లు క్రిసిల్‌ తన నివేదికలో పేర్కొంది. విహార, కార్పొరేట్‌, ఎమ్‌ఐసీఈ (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్‌లు, ప్రదర్శనలు), అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడంతో ప్రీమియం హోటళ్లలో దశాబ్దంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ కనిపిస్తోందని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ నివేదిక చెబుతోంది. అందులోని ముఖ్యాంశాలు..

* గిరాకీ పెరగడంతో సగటు గది రేట్లు(ఏఆర్‌ఆర్‌) కరోనా ముందు స్థాయికి చేరాయి. దీంతో ఆపరేటింగ్‌ మార్జిన్లు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.

* 2021-22లో ప్రీమియం హోటళ్లలో ఏఆర్‌ఆర్‌ 13% పెరిగింది. 2022-23లో 19-21% పెరగడంతో దశాబ్ద గరిష్ఠస్థాయి రూ.7500-10,000కు చేరుకుంది.

* 2021-22లో ఆక్యుపెన్సీ స్థాయి 50% ఉండగా.. ఈ ఏడాది అది 67-72 శాతానికి చేరింది. ఇది కూడా దశాబ్దపు గరిష్ఠమే. కాగా, 2020-21లో ఏఆర్‌ఆర్‌ 20-25% క్షీణించడంతో పాటు ఆక్యుపెన్సీ 31 శాతానికి పరిమితమైంది.

* ప్రతీకార ప్రయాణాలు (కరోనా సమయం ఇంటికే పరిమితం కావడంతో తర్వాత చేస్తున్న విహారాలు), విరామ, కార్పొరేట్‌, ఎమ్‌ఐసీఈ అంశాల్లో మెరుగుపడడంతో దేశీయ గిరాకీ రాణిస్తోంది.

* విదేశీ పర్యాటకుల సంఖ్య ఇంకా కరోనా ముందు స్థాయిలకు చేరలేదు. తొలి 9 నెలల్లో 54 లక్షలు లేదా కరోనా ముందు స్థాయిలో 70% మాత్రమే నమోదైంది. అయితే 2023-24లో 100 శాతానికి చేరొచ్చని అంచనా.

* కాగా, ప్రస్తుత రికవరీలో ప్రీమియం హోటళ్లలోనే అధిక ఏఆర్‌ఆర్‌, ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. బడ్జెట్‌ హోటళ్లలో మాత్రం తగ్గుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని