‘కొత్త హాల్‌మార్కింగ్‌’కు గడువు పొడిగించం

బ్లాక్‌చెయిన్‌ లాంటి కొత్త సాంకేతికతలకు ప్రమాణాలు రూపొందిస్తున్నామని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) తెలిపింది.

Published : 29 Mar 2023 03:29 IST

బ్లాక్‌ చెయిన్‌, కృత్రిమ మేధకూ ప్రమాణాలు: బీఐఎస్‌ ఛైర్మన్‌

దిల్లీ: బ్లాక్‌చెయిన్‌ లాంటి కొత్త సాంకేతికతలకు ప్రమాణాలు రూపొందిస్తున్నామని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి పసిడి ఆభరణాలను 6 అంకెల హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌)తో విక్రయించడం తప్పనిసరి అని.. ఈ గడువును పొడిగేంచేది లేదని బీఐఎస్‌ ఛైర్మన్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారీ తెలిపారు. ‘వ్యాపార సరళీకరణను ప్రోత్సహించడంలో భాగంగానే మేం ప్రమాణాలను రూపొందిస్తాం. కొన్ని మన దేశీయ ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి చేర్చాం. విదేశీ వాణిజ్యం సాఫీగా జరిగేందుకు ఇది దోహదం చేస్తుంద’ని విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు. 22,000 బీఐఎస్‌ ప్రమాణాల్లో.. 8,000 ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లామని, ఇందులో ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులకు ఐఈఎస్‌ ప్రమాణాలు, ఎలక్ట్రికల్‌ కాని ఉత్పత్తులకు ఐఎస్‌ఓ ప్రమాణాలు ఉన్నాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధ, బ్లాక్‌ చెయిన్‌, బ్రెయిన్‌ కంప్యూటింగ్‌ ఇంటర్‌ఫేస్‌, బిగ్‌ డేటా అనలాటిక్స్‌ లాంటి వర్ధమాన సాంకేతికతలకు ప్రమాణాలను రూపొందించే పనిలో భారత్‌ ఉందని తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ సాంకేతికతకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో భారత్‌ ముందుందని.. భవిష్యత్‌లో ఇవి ఐఎస్‌ఓ ప్రమాణాలుగా అవుతాయని తెలిపారు. పసిడి ఆభరణాలను 6 అంకెల హెచ్‌యూఐడీతో విక్రయించేందుకు గడువును పొడిగించబోమని, పాత నిల్వలను విక్రయించేందుకు ఇప్పటికే 2 ఏళ్లకు మించి సమయాన్ని ఆభరణాల వర్తకులకు ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం పాత హాల్‌మార్కింగ్‌లో 4 గుర్తులు (బీఐఎస్‌ చిహ్నం, స్వచ్ఛత, ఆభరణ వర్తకుల గుర్తు, హాల్‌మార్కింగ్‌ కేంద్రం) ఉంటాయి. ఏప్రిల్‌ 1 నుంచి 6 అంకెల హెచ్‌యూఐడీ లేకుండా విక్రయించేందుకు అనుమతి లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని