ప్రస్తుత పొదుపు, పెట్టుబడి రేట్లతో 8% వృద్ధి సాధ్యపడదు

ప్రస్తుతం ఉన్న పొదుపు, పెట్టుబడుల వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించలేదని ఇండియా రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది.

Published : 31 Mar 2023 01:14 IST

ఇండియా రేటింగ్స్‌ నివేదిక

ముంబయి: ప్రస్తుతం ఉన్న పొదుపు, పెట్టుబడుల వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించలేదని ఇండియా రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. స్థిరమైన ప్రాతిపదికన ఈ రేట్లు 35 శాతంగా ఉండాలని, ప్రస్తుతం ఇవి వరుసగా 30.2 శాతం, 29.6 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు మళ్లీ పుంజుకోవాలంటే మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు అవసరమని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ఇబ్బందుల కారణంగా విదేశీ గిరాకీ బలహీనపడటం, సరఫరా పరమైన సమస్యలు వంటి వాటిని దూరం చేయడానికి ఈ పెట్టుబడులు తోడ్పడతాయని తెలిపింది. అధిక పెట్టుబడులతో పాటు అధికంగా దేశీయ పొదుపులు కూడా అవసరమని, అప్పుడే పొదుపు-పెట్టుబడుల మధ్య లోటు అదుపులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం మౌలిక రంగ వ్యయాలపై దృష్టి పెట్టినప్పటికీ.. పొదుపు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఇండియా రేటింగ్స్‌ వివరించింది. 2020-21లో 6.6 శాతం క్షీణించిన ఆర్థిక వ్యవస్థ.. గత ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం వృద్ధి నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి వృద్ధి తగ్గొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత తగ్గి 5.9 శాతానికి చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని