భారత వృద్ధిలో మరింత జోరు

సంస్కరణల అమలును వేగవంతం చేస్తే భారత వృద్ధి మరింత దూసుకెళ్లొచ్చని ప్రపంచ బ్యాంక్‌ తాజా నివేదికలో పేర్కొంది.

Published : 31 Mar 2023 01:12 IST

సంస్కరణల అమలులో వేగం ముఖ్యం
ప్రపంచ బ్యాంక్‌ నివేదిక

దిల్లీ: సంస్కరణల అమలును వేగవంతం చేస్తే భారత వృద్ధి మరింత దూసుకెళ్లొచ్చని ప్రపంచ బ్యాంక్‌ తాజా నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇటీవలి కాలంలో ఆర్థిక వృద్ధికి కారణమైన చోదకాలు ప్రస్తుతం డీలాపడినట్లు వెల్లడించింది. ‘ఫాలింగ్‌ లాంగ్‌ టెర్మ్‌ గ్రోత్‌ ప్రాస్పెక్ట్స్‌: ట్రెండ్స్‌, ఎక్స్‌పెక్టేషన్స్‌, పాలసీస్‌’ పేరిట ప్రపంచ బ్యాంక్‌ ఈ నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి అంతర్జాతీయ వృద్ధి మూడు దశాబ్దాల్లోనే కనిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఇందుకు కారణమని అంచనా వేసింది. కొవిడ్‌-19 రాకముందే ఉత్పాదకతలో మందగమనం మొదలైందని, ఆదాయ వృద్ధి, అధిక వేతనాలకు ఇవి కీలకమని.. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను దెబ్బతీసినట్లు నివేదిక అభిప్రాయపడింది. పెట్టుబడుల వృద్ధి కూడా బలహీనంగా ఉందని, అంతర్జాతీయ ఉద్యోగాల వృద్ధి మందకొడిగానే ఉన్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం కారణంగా కోల్పోయిన మానవ వనరులు మళ్లీ పుంజుకోలేదని వివరించింది. ఫలితంగా దశాబ్ద కాలాన్ని ప్రపంచం కోల్పోతుందని, అంతర్జాతీయ సగటు వృద్ధి సాధించేందుకు విధానపరమైన తోడ్పాటు అవసరమని పేర్కొంది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..

* ఇప్పటి నుంచి 2030 వరకు అంతర్జాతీయ వృద్ధి దశాబ్ద కనిష్ఠమైన 2.2 శాతానికి చేరొచ్చు. 2011-21 మధ్య ఇది 2.6 శాతంగా ఉంది.

* దేశాలు స్థిరమైన, వృద్ధి ఆధారిత విధానాలను అవలంబిస్తే అంతర్జాతీయ జీడీపీ వృద్ధి 0.7 శాతం పెరిగి వార్షిక సగటు రేటు 2.9 శాతానికి వెళ్లొచ్చు. పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌ వేగంగా వృద్ధి సాధిస్తోంది. సంస్కరణల అమలుతో ఇది మరింత జోరందుకోవచ్చు.

* ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌కు తక్కువ అభివృద్ధి చెందిన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్రను మరింత హేతుబద్ధీకరిస్తే స్టాక్‌ మార్కెట్‌ల అభివృద్ధికి ఊతమందించే అవకాశం ఉంటుంది.

* జాతీయ మౌలిక రంగ పైప్‌లైన్‌పై టాస్క్‌ఫోర్స్‌ చేసిన సంస్కరణల సిఫారసులను అమలు చేయాలి. మౌలిక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 2000-10లో వార్షిక పెట్టుబడుల వృద్ధి సగటు 10.5 శాతంగా ఉండగా.. 2011-21 మధ్య 5.7 శాతానికి చేరింది.

* ప్రభుత్వం మౌలిక రంగ పెట్టుబడులపై దృష్టి పెట్టడం, కార్మిక నిబంధనల సరళీకరణ, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, లాజిస్టిక్స్‌ రంగ ఆధునికీకరణ వంటి దీర్ఘకాలంలో మేలుచేకూర్చనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని