Banks- RBI: జరిమానాలపైౖ వడ్డీ వేయొద్దు

బ్యాంకులో వ్యక్తిగత/గృహరుణం వంటివి తీసుకున్నప్పుడు, తిరిగి చెల్లింపునకు సంబంధించి నిబంధనలు ఇప్పటివరకు ఆంగ్లంలో ఉంటున్నాయి. ఇకనుంచి అలా చెల్లదు.

Updated : 19 Apr 2023 09:29 IST

ఖాతాదారుల మాతృభాషలోనూ నిబంధనలుండాలి  
చెల్లింపు క్రమశిక్షణ పెంచడమే ధ్యేయంగా వ్యవహరించాలి
బ్యాంకులకు ఆర్‌బీఐ ముసాయిదా

ఈనాడు, హైదరాబాద్‌ : బ్యాంకులో వ్యక్తిగత/గృహరుణం వంటివి తీసుకున్నప్పుడు, తిరిగి చెల్లింపునకు సంబంధించి నిబంధనలు ఇప్పటివరకు ఆంగ్లంలో ఉంటున్నాయి. ఇకనుంచి అలా చెల్లదు. ఖాతాదారుల మాతృభాషలోనూ ఈ పత్రాలను బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఇవ్వాలి. ‘రుణ చెల్లింపు ఆలస్యమైతే’ విధించే జరిమానాల వివరాలను అందులో పొందుపరిచి, ఖాతాదారులతో చదివించి, వారి సంతకాలను బ్యాంకులు తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచించింది. ఇందుకోసం రూపొందించిన ముసాయిదాను అన్ని  బ్యాంకులకు పంపింది. దీని ప్రకారం..

ఇప్పుడన్నీ ఆంగ్లంలోనే

రుణం తీసుకున్న వారు, నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే ఎగవేతదారుల కింద జరిమానాలు బ్యాంకులు విధిస్తున్నాయి. ఎంత కాలానికి, ఎంతమొత్తం జరిమానా వసూలు చేస్తున్నారు, జరిమానాపై మళ్లీ వడ్డీ వేస్తున్నారా అనే వివరాలేమీ చాలా మంది రుణగ్రహీతలకు తెలియదు. రుణం మంజూరు సమయంలో, ఖాతాదారుల సంతకాలు తీసుకునే రుణ నిబంధనల ఒప్పంద పత్రాలన్నీ ఆంగ్లంలో ఉంటున్నాయి. వాటిని చదివి అర్థం చేసుకోవడం అత్యధికులకు కష్టమే. బ్యాంకు సిబ్బంది చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టి, రుణం పొందే వారే ఎక్కువ. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువులోగా బకాయి తిరిగి చెల్లించని వారికి ఒక్కో బ్యాంకు, ఒక్కో తీరుగా జరిమానా విధిస్తోంది.

ఇలాంటివి కుదరవు

ఉదాహరణకు ఒక బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే, 6 నెలల్లోగా తిరిగి చెల్లించాలనే నిబంధన ఉంది. ఈ గడువులోగా నిధులు చెల్లించి, బంగారాన్ని విడిపించుకోకపోతే బాకీ సొమ్ము విలువపై 2 శాతాన్ని జరిమానాగా విధిస్తోంది. అయినా ఖాతాదారుడు బాకీ కట్టకపోతే, కొంతకాలం తరవాత బంగారాన్ని వేలం వేసి, బాకీ సొమ్మును జమచేసుకుంటోంది. ఇలా జమచేసుకునే సమయం నాటికి, సదరు 2% జరిమానాపై వడ్డీ వసూలు చేస్తోంది. ఇలా జరిమానాపై వడ్డీ వసూలు చేయడం తగదని ఆర్‌బీఐ తాజా ముసాయిదాలో పేర్కొంది. తుది ఉత్తర్వులు జారీచేశాక, ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి.

ఎంతనే వివరాలు తెలియక..

కొన్ని ప్రైవేటు బ్యాంకులైతే జరిమానా ఎంత విధిస్తున్నారో ఖాతాదారులకు చెప్పడం లేదు. ఆంగ్ల భాష తెలియని, బ్యాంకు నిబంధనలపై అవగాహన లేని ఖాతాదారులు బ్యాంకు చెప్పినంత సొమ్మును చెల్లిస్తున్నారు. అందుకే జరిమానాల వసూలు ఎలా ఉండాలో కూడా ఆర్‌బీఐ నిర్దేశించింది. ఈ ప్రకారం..

* జరిమానాలు అధికంగా విధించి, ఆదాయాన్ని పెంచుకునే విధానాలను బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అనుసరించకూడదు.

* బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్దేశిత వడ్డీరేటు కన్నా అధికంగా జరిమానాలు విధించకూడదు.

* నిర్ణీత రేటు ప్రకారమే రుణాలపై వడ్డీ వసూలు చేయాలి. అంతకుమించి వసూలు చేయకూడదు.

* రుణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు, ఖాతాదారుల్లో క్రమశిక్షణ పెంచేలా జరిమానా రేట్లు ఉండాలి.

* వ్యాపారం కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల తీసుకున్న రుణాలపై వేసే జరిమానాల మొత్తం అనేది.. ఇతర వర్గాలు లేదా సంస్థలపై విధించే జరిమానాలకన్నా ఎక్కువగా ఉండకూడదు.

* ఏ రుణంపై ఎంత జరిమానా, ఎంత కాలానికి విధిస్తారనే వివరాలన్నీ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. వడ్డీ రేట్లు, సర్వీసు రుసుముల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో కనిపించాలి.

* రుణం సకాలంలో తిరిగి కట్టని వారికి నోటీసు పంపినప్పుడు, ఎంత జరిమానా వేశారనే వివరాలను అందులో తెలపాలి.

* ప్రతి బ్యాంకు / ఆర్థిక సంస్థ ఖాతాదారులపై వేసే జరిమానాలు ఎంత ఉండాలనేది ఆ సంస్థ బోర్డు ఆమోదించిన విధానంలో ఉండాలి.

* జరిమానా వడ్డీ(పీనల్‌ ఇంట్రస్ట్‌) అని, జరిమానా రుసుం(పీనల్‌ ఛార్జి) అని వేర్వేరు పేర్లతో వసూలు చేస్తున్నారు. ఏ పేరుతో పిలిచినా దానికి సదరు బ్యాంకు పాలకమండలి ఆమోదం ఉండాలి.

* కొత్త నిబంధనలు ప్రత్యేక సేవల మార్గదర్శకాల కింద జారీచేసిన క్రెడిట్‌ కార్డులకు వర్తించవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని