Banks: బ్యాంకులూ వారానికి 5 రోజులే!

త్వరలో బ్యాంకులు కూడా వారానికి 5 రోజులే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ప్రతిపాదనలు పంపినట్లు వార్తాసంస్థ సీఎన్‌బీసీ వెల్లడించింది.

Updated : 22 Jul 2023 07:59 IST

ప్రభుత్వానికి ఐబీఏ ప్రతిపాదనలు

హైదరాబాద్‌: త్వరలో బ్యాంకులు కూడా వారానికి 5 రోజులే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ప్రతిపాదనలు పంపినట్లు వార్తాసంస్థ సీఎన్‌బీసీ వెల్లడించింది. దీనికి బదులుగా రోజూ 40 నిమిషాలు అదనంగా బ్యాంకు ఉద్యోగులు పనిచేయాలని ప్రతిపాదించారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు జులై 28న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్స్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీఏ)తో ఐబీఏ సమావేశం కానుంది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పనిదినాలను వారానికి 5 రోజులుగా మారుస్తూ, ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకూ ఇదే విధానాన్ని అమలు చేయాలని ఈనెల 19న నిర్వహించిన సమావేశంలో యూబీఎఫ్‌ఏ కోరింది. దీంతో పాటు బ్యాంకు ఉద్యోగుల వేతనాల పెంపు, పదవీ విరమణ చేసిన వారికి ఆరోగ్య బీమా పాలసీ తదితర అంశాలపైనా చర్చించి, ఐబీఏ దృష్టికి తీసుకెళ్లింది.

వీటిపై వచ్చేవారం ఇరు వర్గాలూ చర్చించబోతున్నాయి. ఇందులో ప్రధానంగా బ్యాంకు పనిదినాలపైనే దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల పనిదినాలను వారానికి 5 రోజులు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఐబీఏ కూడా తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. వారంలో ఒకరోజు పని తగ్గుతున్నందున, దీనికి బదులుగా 5 రోజుల పాటు,  సిబ్బంది పనివేళలను రోజూ మరో 40 నిమిషాల పాటు పెంచాలని ఐబీఏ భావిస్తోంది. వారానికి అయిదు రోజులు పనిదినాలను అమలు చేయాలని ఎప్పటి నుంచో బ్యాంకింగ్‌ యూనియన్లు ఒత్తిడి చేస్తున్నాయి. ఎల్‌ఐసీకి అమలు చేయడంతో ఇది మరోసారి తెరపైకి వచ్చింది.

ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి, పదవీ విరమణ చేసిన వారికి రూ.2లక్షల వరకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్‌యూ అంగీకరించింది. దీనికి అదనంగా టాపప్‌ పాలసీని రూ.10లక్షల వరకు తీసుకునేందుకు ఆప్షనల్‌ విధానంలో అనుమతించాలని  కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు