Jobs for Freshers: ఫ్రెషర్ల నియామకాలు పెరిగే అవకాశం: టీంలీజ్‌ ఎడ్‌టెక్‌ నివేదిక

టెక్నాలజీ రంగాల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్‌)ను నియమించుకునేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇ-కామర్స్‌, టెక్నాలజీ అంకురాలు, టెలికమ్యూనికేషన్స్‌, ఇంజినీరింగ్‌, మౌలిక సదుపాయాల సంస్థలు వీరికి అవకాశాలు ఇస్తున్నట్లు టీంలీజ్‌ ఎడ్‌టెక్‌ నివేదిక వెల్లడించింది.

Updated : 09 Aug 2023 09:13 IST

టీంలీజ్‌ ఎడ్‌టెక్‌ నివేదిక

దిల్లీ: టెక్నాలజీ రంగాల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్‌)ను నియమించుకునేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇ-కామర్స్‌, టెక్నాలజీ అంకురాలు, టెలికమ్యూనికేషన్స్‌, ఇంజినీరింగ్‌, మౌలిక సదుపాయాల సంస్థలు వీరికి అవకాశాలు ఇస్తున్నట్లు టీంలీజ్‌ ఎడ్‌టెక్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం (జులై-డిసెంబరు)లో ఫ్రెషర్ల నియామకాలు 3% పెరిగి, 65 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. అన్ని రకాల ఉద్యోగ నియామకాలు 68% నుంచి 73 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ మార్కెట్లో ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ‘ఫ్రెషర్స్‌’కు ఇది ఎంతో సానుకూలమని పేర్కొంది.

  • దేశంలో 18 రంగాల్లోని 737 చిన్న, మధ్యస్థ, పెద్ద కంపెనీలను టీంలీజ్‌ ఎడ్‌టెక్‌ సర్వే కోసం ఎంచుకుంది. ఇందులో మెట్రో నగరాలు, ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని సంస్థలున్నాయి. ఉద్యోగాల మార్కెట్‌లో సవాళ్లు ఎదురవుతున్న వేళ.. ఫ్రెషర్లను నియమించుకునేందుకు సంస్థలు ముందుకు రావడం, మొత్తం నియామకాలూ పెరిగే వీలుండటం సానుకూల పరిణామమని టీంలీజ్‌ ఎడ్‌టెక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను రూజ్‌ తెలిపారు. ఫ్రెషర్స్‌ను నియమించుకునే ధోరణి ఇ-కామర్స్‌, టెక్నాలజీ స్టార్టప్‌లలో 59%, టెలికమ్యూనికేషన్‌లో 53%, ఇంజినీరింగ్‌, మౌలిక సంస్థల్లో 50% ఉన్నట్లు సర్వేలో తేలింది.

ఐటీ రంగంలో ఈ నైపుణ్యాలకు గిరాకీ: ఐటీ రంగ నియామకాల్లో కొంత ప్రతికూలత ఉండే అవకాశాలున్నట్లు పేర్కొంది. అయినప్పటికీ, డెవ్‌ఆప్స్‌ ఇంజినీర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ఎస్‌ఈఓ అనలిస్టు, యూఎక్స్‌ డిజైనర్‌, సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌, కృత్రిమ మేధ నైపుణ్యాలు ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని