Airtel - Alphabets laser internet: ఇకపై లేజర్‌ నెట్‌..!

మారుమూల ప్రాంతాలు లేదా పట్టణ ప్రాంతాల్లోని ఆకాశ హర్మ్యాల మధ్య ఇంటర్నెట్‌ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావటంలో టెలికాం కంపెనీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Updated : 27 Aug 2023 10:20 IST

కేబుల్‌ లైన్లతో పనిలేదు
వేగం పుంజుకుంటున్న ‘తారా’ ప్రాజెక్టు
త్వరలో మన దేశంలో సేవలు
ఆల్ఫాబెట్‌, ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యం
ఈనాడు - హైదరాబాద్‌

మారుమూల ప్రాంతాలు లేదా పట్టణ ప్రాంతాల్లోని ఆకాశ హర్మ్యాల మధ్య ఇంటర్నెట్‌ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావటంలో టెలికాం కంపెనీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిగ్నల్స్‌ బలంగా లేకపోవడం ఎంతో ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశం. దీనికి తోడు తరచుగా భూగర్భ కేబుళ్లు తెగిపోవటం, అవి ఎక్కడ తెగిపోయాయో తెలుసుకొని సరిదిద్దటం పెద్ద సమస్య. ప్రస్తుత సమాజంలో పెట్రోలు, డీజిల్‌ కంటే డేటా ఎంతో విలువైనది. డేటా లేకుండా ఒక్క రోజు అయినా గడవని పరిస్థితి. కానీ అన్ని ప్రాంతాలకు సమర్థంగా ఇంటర్నెట్‌ సేవలను అందించటం అనేది సాంకేతిక సవాలుగా మారింది. దీనికి పరిష్కారాన్ని చూపడమే లక్ష్యంగా గూగుల్‌ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్‌, ‘తారా’ ప్రాజెక్టు చేపట్టింది. లేజర్‌ బీమ్‌తో ఇంటర్నెట్‌ సేవలు అందించటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ తరహా ఇంటర్నెట్‌ సేవల్లో లోపాలు కానీ, సిగ్నల్‌ డౌన్‌ కావటం కానీ ఉండదు. ఈ వినూత్నమైన ప్రాజెక్టులో మన దేశానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ భాగస్వామి కావటం ప్రత్యేకత.

ఏమిటీ ‘తారా’ ?

‘తారా’ ప్రాజెక్టు ఏడేళ్ల క్రితం ప్రారంభమైంది. ఆకాశంలో బెలూన్లు ఎగరవేసి వాటి ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందించటం ఈ ప్రాజెక్టు ప్రధానోద్దేశం. కానీ అధిక ఖర్చు, ఇతర సమస్యల వల్ల ఇది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో పూర్తిగా భిన్నమైన రీతిలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం మొదలు పెట్టారు. దీని ప్రకారం ట్రాఫిక్‌ సిగ్నల్‌ను పోలిన యంత్రాలను ఇంటర్నెట్‌ సేవలు అందించాల్సిన ప్రదేశాల్లో అమర్చుతారు. దీనికి ఫైబర్‌-ఆప్టిక్‌ కేబుళ్లు అవసరం లేదు. కేబుల్‌తో పనిలేకుండా ఈ పరికరాలు లేజర్‌ను బీమ్‌ చేస్తాయి. లేజర్‌ కిరణాల నుంచి ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ లభిస్తాయి. తద్వారా అంతరాయం లేకుండా డేటా ఆధారిత సదుపాయాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే దాదాపు 13 దేశాల్లో ‘తారా’ ప్రాజెక్టు ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నారు. కెన్యా, ఫిజీ, ఆస్ట్రేలియా, కాంగో... తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. ఇదే విధంగా మనదేశంలోనూ ‘తారా’ ప్రాజెక్టును అమలు చేసి సుదూర ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సేవలు అందించాలనేది లక్ష్యం.

ఖర్చు కూడా తక్కువ!

ఏదైనా కొత్త ప్రదేశంలో ఇంటర్నెట్‌ సేవలు అందించటం ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. రోడ్డు పక్కన, మధ్యలో... ఎక్కడపడితే అక్కడ తవ్వాలి. ఫైబర్‌ - ఆప్టిక్‌ కేబుల్‌ లైన్లు వేయాలి. అందుకు అవసరమైన అనుమతులు తీసుకోవాలి. దీనికి ఎంతో సమయం కూడా పడుతుంది. ‘తారా’ ప్రాజెక్టు దీనికి పూర్తిగా భిన్నం. ట్రాఫిక్‌ లైట్లను పోలిన యంత్రాలను చకచకా బిగించి, ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ను ‘బీమ్‌’ చేయవచ్చు. పైగా ఇది ఎంతో తక్కువ ఖర్చుతో అయిపోతుందని, పెద్దగా ఇబ్బందులూ ఎదురుకావని సాంకేతిక నిపుణులు వివరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పట్టణాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందించటానికి ఇది ఎంతో అనువైన విధానం- అని భారతీ ఎయిర్‌టెల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టణాల్లో పెద్దపెద్ద భవనాల మధ్య తవ్వకాలు చేపట్టి ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ వేయటం ఎంతో కష్టం, పైగా బలమైన సిగ్నల్‌ కూడా ఉండదు, అటువంటి చోట్ల ‘తారా’ సరైన పరిష్కారం- అని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అధిక వేగం..‘తారా’ ప్రాజెక్టు కింద రెండు టెర్మినళ్ల మధ్య లేజర్‌ బీమ్‌, సెకనుకు 20 గిగాబైట్ల వేగంతో సిగ్నళ్లను పంపగలుగుతుంది. ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు వేయటానికి కుదరని ప్రదేశాల్లో, లేదా కేబుల్‌ వేయటానికి ఎంతో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో... ప్రత్యామ్నాయంగా ‘తారా’ ప్రాజెక్టును అమలు చేయాలని భారతీ ఎయిర్‌టెల్‌ భావిస్తోంది. మన దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సదుపాయం త్వరలో అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. మన దేశంలో డిజిటల్‌ టెక్నాలజీ ఆధారిత సేవలను విస్తరించటానికి 10 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.82,000 కోట్లు) వెచ్చించనున్నట్లు రెండేళ్ల క్రితం గూగుల్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా భారతీ ఎయిల్‌టెల్‌లో 700 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.5750కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి మనదేశంలో ‘తారా’ ప్రాజెక్టు అమలు చేయటానికి ‘ఆల్ఫాబెట్‌’ ముందుకు వచ్చింది. తొలిదశలో దేశంలోని పెద్ద నగరాల్లో ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ లైన్‌ వేయలేక, నాణ్యమైన సేవలను అందించలేకపోతున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ‘తారా’ ప్రాజెక్టు చేపట్టాలని, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని