Apple Event 2023: ఐఫోన్‌ 15 ఫోన్లొచ్చాయ్‌

టెక్‌ దిగ్గజం యాపిల్‌ గురువారం ‘వండర్‌లస్ట్‌’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త ఐఫోన్‌ 15 మోడళ్లను, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈ ఉత్పత్తుల తయారీలో పర్యావరణహితానికి కంపెనీ ప్రాధాన్యమివ్వడం ప్రత్యేకతగా చెప్పొచ్చు.

Updated : 13 Sep 2023 08:53 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్‌ దిగ్గజం యాపిల్‌ గురువారం ‘వండర్‌లస్ట్‌’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త ఐఫోన్‌ 15 మోడళ్లను, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈ ఉత్పత్తుల తయారీలో పర్యావరణహితానికి కంపెనీ ప్రాధాన్యమివ్వడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. 2030 కల్లా పూర్తిగా యాపిల్‌ ఉత్పత్తులన్నీ పర్యావరణహితంగానే ఉంటాయని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలిపారు.

ఐఫోన్‌ 15, 15 ప్లస్‌: ఐఫోన్‌ 15.. 6.1 అంగుళాలు, ఐఫోన్‌ 15 ప్లస్‌ 6.7 అంగుళాల్లో లభ్యం కానుంది. ఐఫోన్‌ 15 ధర 799 డాలర్లు (128 జీబీ), ఐఫోన్‌ 15 ప్లస్‌ ధర 899 డాలర్లు (128 జీబీ). ఏ16 బయోనిక్‌ చిప్‌, ఓఎల్‌ఈడీ సూపర్‌ రెటీనా డిస్‌ప్లే, డైనమిక్‌ ఐలాండ్‌తో కూడిన ఈ ఫోన్లు గులాబీ, పసుపు, ఆకుపచ్చ నీలం, నలుపు రంగుల్లో లభ్యమవుతాయి. 48 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమేరా ఇందులో ఉంది. మొదటిసారిగా టైప్‌-సి ఛార్జర్‌తో వీటిని తీసుకొచ్చారు.

ఐఫోన్‌ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌: ఐఫోన్‌ 15 ప్రో 6.1 అంగుళాలు, ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ 6.7 అంగుళాలు. టైటానియమ్‌ డిజైన్‌, సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, సరికొత్త ఏ17 ప్రో చిప్‌తో వీటిని తీసుకొచ్చారు. 100% రీసైకిల్డ్‌ మెటీరియల్స్‌తో ఇవి తయారయ్యాయని కంపెనీ తెలిపింది. పల్చటి బోర్డర్లు, తేలికపాటి బరువు వీటి మరో ప్రత్యేకత. ఐఫోన్‌ 15 ప్రో ప్రారంభ ధర 999 డాలర్లు.. ప్రోమ్యాక్స్‌ 1199 డాలర్లు. ఈ ఫోన్లు సెప్టెంబరు 22 నుంచి లభిస్తాయి.

వాచ్‌ సిరీస్‌ 9: సరికొత్త ఎస్‌9 చిప్‌తో వాచ్‌ సిరీస్‌ 9ను యాపిల్‌ తీసుకొచ్చింది. మునుపటి సిరీస్‌లతో పోలిస్తే అత్యంత వేగంగా పనిచేసేందుకు ఎస్‌9 చిప్‌ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మెషీన్‌ కంప్యూటేషన్లను కూడా రెండు రెట్ల వేగంగా ఇది చేస్తుంది. ఈ వాచీ సాయంతో ఐఫోన్లను కూడా ట్రేస్‌ చేయొచ్చు. డబుల్‌ ట్యాప్‌తో ఫోన్‌ కాల్‌ స్వీకరించడం, ముగించడం లాంటి ఫోను ప్రధాన విధులను నియంత్రించే వీలుంది. ఈ వాచీ మొట్టమొదటి కర్బన తటస్థ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది. దీని ధర 399 డాలర్లు (జీపీఎస్‌), 499 డాలర్లు (జీపీఎస్‌+ సెల్యులార్‌).

వాచీ అల్ట్రా 2: ఇందులోనూ ఎస్‌9 చిప్‌సెట్‌, డబుల్‌ట్యాప్‌ సదుపాయం ఉంది. ఐఫోన్లను కూడా ట్రేస్‌ చేయొచ్చు. 95 శాతం రీసైకిల్డ్‌ మెటీరియల్‌తో దీనిని తయారు చేశారు. లో- పవర్‌ మోడ్‌లో 72 గంటల పాటు బ్యాటరీ ఛార్జింగ్‌ ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభ ధర 799 డాలర్లు (జీపీఎస్‌+ సెల్యులార్‌).


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు