TATA - IPhone: ఇక టాటాల తయారీ ఐఫోన్లు

మనదేశంలో ఐఫోన్లు తయారు చేయనున్న తొలి దేశీయ సంస్థగా టాటా గ్రూప్‌ అవతరించనుంది. బెంగళూరులో ఐఫోన్ల తయారీ కోసం నెలకొల్పిన ప్లాంట్‌ను విక్రయించడానికి తైవాన్‌ సంస్థ విస్ట్రాన్‌ గ్రూప్‌ అంగీకరించడమే ఇందుకు నేపథ్యం.

Updated : 28 Oct 2023 07:53 IST

విస్ట్రాన్‌ భారత కార్యకలాపాల కొనుగోలు

దిల్లీ: మనదేశంలో ఐఫోన్లు తయారు చేయనున్న తొలి దేశీయ సంస్థగా టాటా గ్రూప్‌ అవతరించనుంది. బెంగళూరులో ఐఫోన్ల తయారీ కోసం నెలకొల్పిన ప్లాంట్‌ను విక్రయించడానికి తైవాన్‌ సంస్థ విస్ట్రాన్‌ గ్రూప్‌ అంగీకరించడమే ఇందుకు నేపథ్యం. టాటా ఎలక్ట్రానిక్స్‌కు విస్ట్రాన్‌ ఇన్ఫోకామ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ను 125 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1035 కోట్ల)కు విక్రయించడానికి విస్ట్రాన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. బెంగళూరు సమీపంలో ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ను విస్ట్రాన్‌ నిర్వహిస్తోంది. దాదాపు ఏడాది పాటు చర్చల అనంతరం విస్ట్రాన్‌ కార్పొరేషన్‌ ఫ్యాక్టరీ, టాటాల చేతిలోకి వస్తోంది. ప్రస్తుతం  ఐఫోన్‌ 14 మోడల్‌ను కూడా అసెంబ్లింగ్‌ చేస్తున్న ఈ ప్లాంట్‌లో 10,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇరు సంస్థల మధ్య ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాక, ప్రభుత్వ సంస్థల నుంచి తప్పనిసరి అనుమతులు పొందేందుకు ముందుకు వెళ్తామని విస్ట్రాన్‌ వెల్లడించింది. యాపిల్‌ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను తైవాన్‌ తయారీ సంస్థలు పెగాట్రాన్‌ కార్పొరేషన్‌, ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ దేశీయంగా చేపడుతున్నాయి. తాజా పరిణామాలతో వీటి సరసన టాటా సన్స్‌ అనుబంధ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్‌ చేరనుంది. విస్ట్రాన్‌ కార్యకలాపాలను టాటాలు కొనుగోలు చేయడంపై కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ‘ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)’లో అభినందనలు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకంతో స్మార్ట్‌ఫోన్‌ తయారీ, ఎగుమతులకు భారత్‌ హబ్‌గా మారుతోందని అన్నారు. ఇక్కడ నుంచి విదేశాలకు ఐఫోన్లను టాటా గ్రూప్‌ ఎగుమతి చేయాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు