చమురు ధరలతో యుద్ధమే

యుద్ధం.. ఓటమి పాలైన వారితో పాటు గెలిచిన వారికీ కొంతమేర విషాదం మిగుల్చుతుంది.

Updated : 31 Oct 2023 03:10 IST

ఇజ్రాయెల్‌-హమాస్‌ సంఘర్షణలు పెరిగితే ఇంకా కష్టం
ఈనాడు వాణిజ్య విభాగం

యుద్ధం.. ఓటమి పాలైన వారితో పాటు గెలిచిన వారికీ కొంతమేర విషాదం మిగుల్చుతుంది. ఆ యుద్ధంతో సంబంధం లేకున్నా, దాని ప్రభావానికి లోనైన వారూ ఇబ్బంది పడక తప్పదు. ప్రస్తుత ఇజ్రాయెల్‌-హమాస్‌ (పాలస్తీనా)ల మధ్య యుద్ధం మరింత విస్తరిస్తే, ఆ రెండు దేశాలే కాక, ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. చమురు- ఆహార ధరలు పెరిగితే.. అసలే ఆర్థిక మందగమనంలో ఉన్న ప్రపంచం మరింత కష్టాలకు లోను కాక తప్పదు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు ‘రెండో దశ’ యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ అనుమానాలు రాకమానవు.

పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలు ప్రస్తుతానికి చమురు ధరలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధం మరింత విస్తరించకపోతే చమురు బ్యారెల్‌ ధర 90- 100 డాలర్ల మధ్యే ఉండొచ్చు. కానీ లెబనాన్‌ రాజకీయపార్టీ హెజ్బుల్లా జోక్యం చేసుకుని, యుద్ధం మరింత రాజుకుంటే మాత్రం అపుడు బ్యారెల్‌ చమురు ధర 105-110 డాలర్లకు చేరొచ్చని అంటున్నారు. చమురు సరఫరాలో ఆటంకాలు పెరిగితే, బ్యారెల్‌ 120 డాలర్లకు చేరొచ్చు. ఇరాన్‌ చమురు.. మార్కెట్‌కు సరఫరా కాకుంటే ఈ పరిస్థితి ఎదురవుతుంది. అందుకు అవకాశాలు బాగా తక్కువే కాబట్టి.. స్వల్పకాలానికి  చమురు ధరల్లో ఊగిసలాటలు భారీగా ఉండకపోవచ్చని అమెరికా బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ అంచనా వేస్తోంది.

ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని తన ‘కమొడిటీ మార్కెట్స్‌ అవుట్‌లుక్‌’లో స్పష్టం చేసింది. గాజాలోకి మరిన్ని యుద్ద ట్యాంకులను ప్రవేశపెట్టాక, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు రెండో దశ యుద్ధాన్ని ప్రకటించారు. దీంతో హమాస్‌ అధికారులు ఇరాన్‌ మద్దతు ఉన్న హెజ్బుల్లా వంటి మద్దతుదార్ల సహాయం కోరాయి. ఒక వేళ హమాస్‌కు సహాయంగా ఇరాన్‌ వంటి దేశాలు వస్తే మాత్రం చమురు ధర సెగ పెరగడం తథ్యం.

  • చమురు ధరలపై ఉన్న 3 అవకాశాలివీ: ప్రపంచ బ్యాంకు  
  • యథాతథ స్థితి కొనసాగినా బ్యారెల్‌ చమురు సగటున ధర వచ్చే ఏడాది వరకు 81 డాలర్ల వద్దే ఉండొచ్చు
  • ఒక వేళ మధ్య స్థాయి అనిశ్చితి ఏర్పడితే (ఇరాక్‌ యుద్ధం తరహా పరిస్థితులు), అంతర్జాతీయంగా చమురు సరఫరా రోజుకు 3-5 మిలియన్‌ బారెళ్ల మేర తగ్గుతుంది. అపుడు చమురు ధరలు 35 శాతం వరకు పెరిగినా ఆశ్చర్యం లేదు.
  • ఒక వేళ భారీ స్థాయిలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడితే (1973 నాటి అరబ్‌ చమురు సంక్షోభం తరహా), అంతర్జాతీయంగా చమురు సరఫరా రోజుకు 6-8 మి. బారెళ్ల మేర తగ్గుతుంది. అపుడు ధరలు 56-75 శాతం పెరుగుతాయి. అంటే బ్యారెల్‌ ధర 140-157 డాలర్ల వరకు చేరొచ్చు.

మనదేశంపై ప్రభావం ఏమిటి?: చమురు ధర పెరిగితే, వినియోగం కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడిన మనదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పదు. చమురు బ్యారెల్‌ ధర 10 డాలర్ల చొప్పున పెరిగే కొద్దీ మన కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ) 0.5 శాతం అధికమవుతుంది. ఇది రూపాయి స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణాన్ని ఊగిసలాటలకు గురి చేస్తుంది. చమురు మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎమ్‌సీ)ల రిఫైనింగ్‌ మార్జిన్లపై, ఆయా కంపెనీల షేర్లపై ప్రభావం చూపిస్తుంది. అపుడు ప్రభుత్వం కొన్ని సుంకాలు, పన్నుల్లో కోత వేసి.. కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఇంధన రిటైల్‌ ధరలు బాగా పెరిగితే, సాధారణ ప్రజల జేబుకు చిల్లు పడుతుంది. అపుడు ఇతరత్రా వ్యయాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. పరోక్షంగా ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు