IT: ఐటీలో.. వారానికి 50 గంటల పని

ప్రపంచంతో పోటీ పడాలంటే.. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి చెప్పిన మాటలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయన సూచనను కొందరు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకించారు.

Updated : 26 Nov 2023 07:57 IST

ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం
పనితీరు అంచనాకు కొత్త విధానాలు అవసరం
ఎక్స్‌ఫినో నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచంతో పోటీ పడాలంటే.. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి చెప్పిన మాటలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయన సూచనను కొందరు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ‘ఐటీ ఉద్యోగులు వారానికి 45-50 గంటలకు తగ్గకుండా పనిచేస్తున్నార’ని ఉద్యోగ నియామక సంస్థ ఎక్స్‌ఫినో నివేదిక వెల్లడించింది. రోజూ దాదాపు 10 గంటల చొప్పున, వారానికి 5 రోజుల పాటు ఐటీ రంగంలోని ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారానికి పని గంటలు 40కి తగ్గడం లేదని తెలిపింది. తమకు ఇచ్చిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేసే క్రమంలో, కొందరు 50 గంటలు, అంతకు మించీ పనిచేస్తున్నారని తెలిపింది.

ప్రతి రూపాయిపై రూ.1.9 ఆర్జన: గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ సంస్థలు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు చేస్తున్న ఖర్చులో పెద్ద మార్పేమీ కనిపించడం లేదని ఆ నివేదిక పేర్కొంది. నిపుణులపై ఖర్చు చేసే ప్రతీ రూపాయిపైన కంపెనీలు  రూ.1.8 నుంచి రూ.1.9 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొంది.

ఒక ఉద్యోగిపై ఎంత ఆదాయం అన్నదే ముఖ్యం: ఐటీ రంగంలో ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా, ఉద్యోగులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారన్నదే ప్రధానంగా సంస్థలు పట్టించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. పని గంటలు పెరగడం వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపింది. ఐటీ రంగంలో ఒక ఉద్యోగిపై ఎంత ఆదాయం ఆర్జించారన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

  • టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాంటి సంస్థలకు ఉద్యోగి సగటు రాబడి.. గత అయిదేళ్లలో 3.8-11 శాతం వరకూ తగ్గినట్లు పేర్కొంది. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా విషయంలో ఇది 2.6 శాతం, 5.6 శాతం వరకూ పెరిగినట్లు నివేదిక వివరించింది.
  • ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిలో 58 శాతం మంది ఉద్యోగ, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం పాటించలేకపోతున్నారని పేర్కొంది. ప్రపంచ సగటు 40 శాతం కన్నా ఇది అధికంగా ఉండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో వృద్ధి రేటు తక్కువగా నమోదు కావడంతో కొత్త నియామకాలూ అంతగా లేకపోవడంతో, ఉద్యోగులపై ఒత్తిడికి కారణమవుతోంది.

పనితీరుపై ప్రభావం: సహజంగా భారతీయులు కష్టజీవులు. కానీ, పనిగంటలు విపరీతంగా పెరిగిపోతుండటంతో వారి నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని నివేదిక పేర్కొంది. అధిక పని గంటలు, ప్రయాణ దూరాలు, మౌలిక వసతుల సమస్య, పనిలో ఒత్తిడిలాంటివి వారి పనితీరును దెబ్బతీస్తున్నాయని తెలిపింది. కొవిడ్‌ సమయంలో టెక్‌ సేవలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీనిని అందుకునేందుకు సంస్థలు తమ ఉద్యోగులు అధికంగా పనిచేసేలా ప్రోత్సహించాయి. కేవలం లక్ష్యాలను సాధించే దిశగా పనులు సాగాయి. అప్పుడు ఎవరూ పని గంటలను లెక్కలోకి తీసుకోలేదు. ఎక్కడి నుంచైనా పనిచేయడం లాంటి వెసులుబాట్లు వచ్చిన నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను అంచనా వేసేందుకు కొత్త విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని