ఓయో మళ్లీ సొంత హోటళ్ల నిర్వహణ

ఆతిథ్య సేవల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఓయో, మళ్లీ సొంతంగా హోటళ్ల నిర్వహణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా ‘మేనేజ్డ్‌ బై ఓయో’ పేరుతో ఈ సేవలను అందించనుంది. ఈ హోటళ్ల కోసం స్థిరాస్తులను అన్వేషించేందుకు స్థిరాస్తి అభివృద్ధి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఓయో పేర్కొంది.

Published : 29 Nov 2023 03:07 IST

దిల్లీ: ఆతిథ్య సేవల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఓయో, మళ్లీ సొంతంగా హోటళ్ల నిర్వహణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా ‘మేనేజ్డ్‌ బై ఓయో’ పేరుతో ఈ సేవలను అందించనుంది. ఈ హోటళ్ల కోసం స్థిరాస్తులను అన్వేషించేందుకు స్థిరాస్తి అభివృద్ధి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఓయో పేర్కొంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో 200 ఖరీదైన హోటళ్ల కోసం, ఆదాయాన్ని పంచుకునే పద్ధతిలో (రెవెన్యూ షేరింగ్‌) వార్షిక దీర్ఘకాలిక నిర్వహణ కాంట్రాక్టులను కుదుర్చుకుంటామని ఓయో  తెలిపింది. నిర్వహణ సామర్థ్యం, వినియోగదార్లకు సంతృప్తి విషయంలో నైపుణ్యాన్ని చూపించుకునే అవకాశాన్ని తన దిగ్గజ హోటల్‌ ఆపరేటర్లకు అందిస్తున్నట్లు పేర్కొంది. స్వీయ నిర్వహణ హోటల్‌ విధానాన్ని కొవిడ్‌-19 మొదటి విడత పరిణామాలకు ముందు 2020లో ఓయో మూసివేసింది. మూడేళ్ల తర్వాత దీనిని తిరిగి ప్రారంభిస్తోంది. ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద 30 స్థిరాస్తి సంస్థలతో ఓయో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 35కి పైగా హోటళ్లలో కార్యకలాపాలను ప్రారంభించింది. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, గోవా, జయపుర, ముంబయి, చెన్నై, పుణె, పుదుచ్చేరి, వడోదరా లాంటి ముఖ్య నగరాల్లో ఈ హోటళ్లు ఉన్నాయి. మరిన్ని హోటళ్లను ప్రారంభించేందుకు అధిక రద్దీ ఉండే మెట్రో నగరాలు - ప్రధాన పర్యాటక ప్రాంతాలపై ఓయో ఎక్కువగా దృష్టి సారిస్తోంది. వీటిల్లో చాలా వరకు కంపెనీకి చెందిన ‘టౌన్‌హౌస్‌, టౌన్‌హౌస్‌ ఓక్‌, కలెక్షన్‌ ఓ’ కింద తీసుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని