70 లక్షల మొబైల్‌ కనెక్షన్ల రద్దు

ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్‌ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) కార్యదర్శి వివేక్‌ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్‌ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Published : 29 Nov 2023 03:08 IST

అనుమానిత కార్యకలాపాలే కారణం
డీఎఫ్‌ఎస్‌ కార్యదర్శి వివేక్‌ జోషి

దిల్లీ: ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్‌ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) కార్యదర్శి వివేక్‌ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్‌ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సైబర్‌ భద్రత, పెరుగుతున్న డిజిటల్‌ చెల్లింపుల మోసాలపై చర్చించిన సమావేశంలో బ్యాంకులు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించుకుంటూ, మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. తదుపరి సమావేశం జనవరిలో ఉంటుందని తెలిపారు. ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏఈపీఎస్‌) ద్వారా జరుగుతున్న మోసాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి, నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమాచార రక్షణ (డేటా ప్రొటెక్షన్‌) ముఖ్యమని పేర్కొన్నారు. సైబర్‌ మోసాలను కట్టడి చేసేందుకు వివిధ ఏజెన్సీలు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై డీఎఫ్‌ఎస్‌ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. సైబర్‌ మోసాలపై సమాజాన్ని మేల్కొలపాలని, వినియోగదార్లను మోసపూరిత కార్యకలాపాల నుంచి కాపాడాలని జోషి సూచించారు.

డిజిటల్‌ చెల్లింపుల మోసాలపై జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ) నమోదు చేసిన తాజా గణాంకాలను ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ వివరించింది. అలాంటి సవాళ్లను అధిగమించేందుకు ఎదుర్కోవాల్సిన సవాళ్లు, సమస్యలను ప్రస్తావించింది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ విభాగం, టెలికాం విభాగం, ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌), నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ)  ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాల్లో డిజిటల్‌ మోసాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని