సంక్షిప్త వార్తలు

సంస్థలకు క్లౌడ్‌, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్‌వన్‌) హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌, కేపబిలిటీ సెంటర్‌ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది.

Published : 30 Nov 2023 02:12 IST

హైదరాబాద్‌లో సీ1 గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: సంస్థలకు క్లౌడ్‌, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్‌వన్‌) హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌, కేపబిలిటీ సెంటర్‌ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా 10,000 పైగా సంస్థలకు సేవలు అందిస్తున్న సీ1, ఈ కేంద్రం ద్వారా మరింత విస్తరించనుంది. కంపెనీ వ్యూహాత్మక వృద్ధిలో భాగంగా ఈ జీఐసీసీని ఏర్పాటు చేసినట్లు సీఈఓ జెఫ్రీ రస్సెల్‌ వెల్లడించారు. సీ1 మొత్తం ఉద్యోగుల్లో ఇక్కడ 20 శాతం వరకు పని చేస్తారని తెలిపారు. సీ1 ఇండియా అధిపతి చంద్ర బొడ్డోజు మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో ఈ కేంద్రాన్ని మరింత విస్తరిస్తామన్నారు. నిపుణుల సంఖ్య రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పోటీపడే నైపుణ్యాలు ఉన్నవారు ఇక్కడ అధికంగా ఉన్నారని తెలిపారు.


అమెరికా విపణికి అరబిందో ఫార్మా హెచ్‌ఐవీ మందు

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఐవీ మందుకు అరబిందో ఫార్మా అమెరికాలో అనుమతి సంపాదించింది. డరునావిర్‌ 600 ఎంజీ, 800 ఎంజీ ట్యాబ్లెట్లను హెచ్‌ఐవీ వ్యాధికి చికిత్సలో వినియోగిస్తున్నారు. ఈ ఔషధాన్ని యూఎస్‌ మార్కెట్లో విడుదల చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. జనస్సెన్‌ ప్రోడక్ట్స్‌ అనే ఔషధ కంపెనీకి చెందిన ప్రెజిస్తా అనే బ్రాండ్‌కు ఇది జనరిక్‌ ఔషధం. యూఎస్‌ మార్కెట్లో గత ఏడాది కాలంలో 275 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,300 కోట్ల) అమ్మకాలను ఈ మందు నమోదు చేసింది. దీంతో కలిసి దాదాపు 500 ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఏఎన్‌డీఏ (అబ్రివియేటెడ్‌ న్యూడ్రగ్‌ అప్లికేషన్‌) అనుమతులు పొందినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది.


తగ్గిన నిరుద్యోగ రేటు

దిల్లీ: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడి వయసున్న ప్రజల నిరుద్యోగ రేటు సెప్టెంబరు త్రైమాసికంలో 6.6 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే మూడు నెలల్లో ఇది 7.2 శాతంగా ఉందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) పేర్కొంది. మొత్తం కార్మిక శక్తిలో నిరుద్యోగులుగా ఉన్న వారి శాతాన్ని నిరుద్యోగ రేటుగా పరిగణిస్తారు. పట్టణ మహిళల్లో(15 ఏళ్లకు పైబడిన) నిరుద్యోగ రేటు మాత్రం గతేడాది జులై-సెప్టెంబరు నాటి 9.4 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది. పట్టణ పురుషుల్లో     6.6 శాతం నుంచి 6 శాతానికి పరిమితమైంది.


జులై- సెప్టెంబరులో అమెరికా వృద్ధి 5.2%

వాషింగ్టన్‌: జులై- సెప్టెంబరులో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను 5.2 శాతానికి ఆ దేశ ప్రభుత్వం సవరించింది. అంతకుముందు అంచనావేసిన 4.9 శాతం కంటే ఇది ఎక్కువ. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నప్పటికీ అమెరికా ప్రజల వినియోగం పెరగడం వల్లే ఆర్థిక వ్యవస్థ 5.2 శాతం వృద్ధి రేటును నమోదుచేయగలిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు రెండేళ్లలోనే ఒక త్రైమాసికంలో అత్యంత వేగవంత వృద్ధి ఇది అని పేర్కొంది. అయితే ప్రస్తుత నాలుగో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో వృద్ధి   నెమ్మదించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వినియోగదార్లపై అధిక వడ్డీ రేట్ల ప్రభావం, వ్యాపార వ్యయాలు పెరగడం లాంటివి ఇందుకు కారణం కావచ్చు. అక్టోబరు- డిసెంబరులో 1.8 శాతం వృద్ధి నమోదుకావచ్చన్నది అంచనా. జులై- సెప్టెంబరు వృద్ధిపై విడుదల చేసిన రెండో విడత అంచనాల ప్రకారం.. ఏప్రిల్‌- జూన్‌లోని 2.1 శాతం నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకోవచ్చని అప్పట్లోనే పేర్కొంది.


క్లుప్తంగా

  • జొమాటో నుంచి అలీబాబా నిష్క్రమణ: ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ సంస్థ జొమాటోలో ఉన్న మొత్తం   3.44 శాతం వాటాను రూ.3,337 కోట్లకు విక్రయించినట్లు చైనా ఇ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా సంస్థ అలీపే సింగపూర్‌ హోల్డింగ్స్‌ తెలిపింది. బీఎస్‌ఈలో బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 21 విడతల్లో 29.60 కోట్లకు పైగా జొమాటో షేర్లను అలీపే విక్రయించింది. ఒక్కో షేరు సగటు విక్రయ ధర రూ.112.7గా ఉంది.
  • డీప్‌ ఫేక్‌ల నిరోధానికి: డీప్‌ఫేక్‌లను నిరోధించేందుకు కఠిన నిబంధనలను గూగుల్‌ తీసుకొచ్చింది. తమ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్‌ చేసే కంటెంట్‌లో మార్పులు చేస్తే, ఆ వివరాలను యూట్యూబ్‌ క్రియేటర్లు వెల్లడించాలని స్పష్టం చేసింది. గోప్యత ప్రక్రియ ద్వారా ముఖం, స్వరం ప్రతిబింబించే విధంగా ఏఐతో సృష్టించిన కంటెంట్‌ను తొలగిస్తామని గూగుల్‌ హామీ ఇచ్చింది.
  • కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఇంతకు ముందు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా)తో ప్రతిపాదిత విలీనాన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి కృషి చేస్తున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని