ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సిద్ధం

ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(టీఏఎస్‌ఎల్‌), నాస్‌డాక్‌ లిస్టెడ్‌ కంపెనీ-శాటెల్లాజిక్‌ ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్‌ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్‌ఎల్‌ వెల్లడించింది.

Published : 30 Nov 2023 02:14 IST

శాటెల్లాజిక్‌ ఇంక్‌తో ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(టీఏఎస్‌ఎల్‌), నాస్‌డాక్‌ లిస్టెడ్‌ కంపెనీ-శాటెల్లాజిక్‌ ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్‌ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్‌ఎల్‌ వెల్లడించింది. దీంతో శాటెల్లాజిక్‌ మనదేశంలోని రక్షణ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టినట్లు అవుతుంది. నూతన ఉపగ్రహ డిజైన్‌ను ఆవిష్కరించడంపై ఈ రెండు సంస్థలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. దీంతో పాటు ఒక రాకెట్‌ ప్రయోగం ద్వారా పలు రకాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే పరిజ్ఞానంపై కసరత్తు చేస్తామని టీఏఎస్‌ఎల్‌ వివరించింది. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం శాటెల్లాజిక్‌ నుంచి టీఏఎస్‌ఎల్‌కు బదిలీ కావడంతో పాటు, సిబ్బందికి తగిన శిక్షణ, విడిభాగాల ఉత్పత్తి, అనుసంధానం.. తదితర అంశాల్లో శాటెల్లాజిక్‌ పూర్తిగా సహకరిస్తుంది. టీశాట్‌-1ఏ అనే పేరుతో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు టీఏఎస్‌ఎల్‌ పేర్కొంది. రక్షణ, పౌర అవసరాలకు ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుందని వివరించింది. ఈ అవసరాల కోసం కర్ణాటకలోని వేమగల్‌ యూనిట్లో శాటిలైట్‌ ఏఐటీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీఏఎస్‌ఎల్‌ సీఈఓ, ఎండీ సుకరణ్‌ సింగ్‌ వెల్లడించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సంస్థతో తాము కలిసి పనిచేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని