ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ

గౌతమ్‌ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే..

Published : 30 Nov 2023 02:24 IST

66.7 బి.డాలర్లతో 19వ స్థానం
గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు పెరిగిన నేపథ్యం

గౌతమ్‌ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. అగ్రగామి-25 మంది కుబేరుల జాబితాలోనే లేకుండా పోయారు. గత వారం సుప్రీం కోర్టులో జరిగిన పరిణామాలతో, మళ్లీ గ్రూప్‌ కంపెనీలపై మదుపర్ల సెంటిమెంటు పుంజుకోవడంతో.. అగ్రగామి 20 మంది ప్రపంచ కుబేరుల సరసన అదానీ చేరగలిగారు.

మెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి సెబీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేయడంతో, మంగళవారం అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు 5-20 శాతం పెరిగాయి. గ్రూప్‌నకు చెందిన 11 నమోదిత కంపెనీలు రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్‌ విలువను ఒక్కరోజులో జత చేసుకున్నాయి. ఫలితంగా గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ రూ.11 లక్షల కోట్లు అధిగమించింది. ఏప్రిల్‌ 11 తర్వాత గ్రూప్‌ మార్కెట్‌ విలువలో ఒకే రోజు కనిపించిన అత్యంత వృద్ధి ఇదే. దీంతో గ్రూప్‌ కంపెనీల్లో అదానీ వాటాల విలువా పెరిగింది. ఫలితంగా 66.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.5.47 లక్షల కోట్ల) సంపదతో ప్రపంచంలోని అగ్రగామి కుబేరుల్లో 19వ స్థానానికి అదానీ చేరారు. భారత్‌ నుంచి 89.5 బి.డాలర్ల (సుమారు రూ.7.34 లక్షల కోట్ల)తో ముకేశ్‌ అంబానీ ఈ జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు.

కోర్టులో ఇదీ జరిగింది: అదానీ గ్రూప్‌పై వచ్చిన పలు ఆరోపణలకు సంబంధించి.. మొత్తం 24 అంశాల్లో 22 కేసులపైన దర్యాప్తు పూర్తయిందని.. ఇక దర్యాప్తు కొనసాగింపునకు గడువు కోరబోమని కోర్టుకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ తెలిపింది. ‘ఈ కేసులో సెబీని అనుమానించడానికి మా ముందు ఎటువంటి ఆధారాలూ లేవు. అలాగే హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నిటినీ ‘వాస్తవాలు’గా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేద’ని సుప్రీంకోర్టు పేర్కొనడం అదానీ గ్రూప్‌పై మదుపర్ల సెంటిమెంటు మెరుగుపడడానికి కారణమైంది.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం.. మస్క్‌ 228 బి.డాలర్ల సంపదతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నారు. జెఫ్‌ బెజోస్‌, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 171 బి.డాలర్లు, 167 బి.డాలర్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు