మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది.

Published : 30 Nov 2023 02:28 IST

మళ్లీ 20,000 పాయింట్ల పైకి నిఫ్టీ

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రికార్డు గరిష్ఠమైన రూ.333.29 లక్షల కోట్లుగా నమోదైంది. ఉదయం ట్రేడింగ్‌లో ఈ విలువ రూ.3,33,26,881 కోట్లుగా ఉంది. అప్పుడు డాలర్‌ విలువ రూ.83.31 కనుక, మదుపర్ల సంపద విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకు సెన్సెక్స్‌ 6,061.17 పాయింట్ల మేర పరుగులు తీయగా.. మదుపర్ల సంపద రూ.50.90 లక్షల కోట్లు పెరిగింది. 4 లక్షల కోట్ల డాలర్లు, అంతకంటే అధిక మార్కెట్‌ విలువ కలిగిన దేశాల్లో అమెరికా (47.78 లక్షల కోట్ల డాలర్లు), చైనా (9.74 లక్షల కోట్ల డాలర్లు), జపాన్‌ (6.02 లక్షల కోట్ల డాలర్లు), హాంకాంగ్‌ (4.78 లక్షల కోట్ల డాలర్లు) సరసన భారత్‌ చేరింది. 2007 మే 28న బీఎస్‌ఈ లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరింది. 2014 జూన్‌ 2న 2 లక్షల కోట్ల డాలర్లకు, 2017 జులై 10న 2 లక్షల కోట్ల డాలర్లకు, 2020 డిసెంబరు 16న 2.5 లక్షల కోట్ల డాలర్లకు చేరగా, 2021 మే 24న 3 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని అందుకుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ మళ్లీ 20,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత నిఫ్టీ ఈ స్థాయికి చేరింది. విదేశీ పెట్టుబడులు కొనసాగడం సానుకూల ప్రభావం చూపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 83.32 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.54% లాభపడి 82.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • సెన్సెక్స్‌ ఉదయం 66,381.26 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66,946.28 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 727.71 పాయింట్లు లాభపడి 66,901.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 206.90 పాయింట్లు రాణించి 20,096.60 దగ్గర స్థిరపడింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 దూసుకెళ్లాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 3.92%, ఎం అండ్‌ ఎం 3.38%, విప్రో 2.32%, టాటా మోటార్స్‌ 2.09%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.94%, టెక్‌ మహీంద్రా 1.51%, ఐసీఐసీఐ 1.44%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.39%, హెచ్‌సీఎల్‌ 1.28%, టీసీఎస్‌ 1.23%, ఇన్ఫోసిస్‌ 1.11%, ఎయిర్‌టెల్‌ 1.01% లాభపడ్డాయి. నెస్లే, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ స్వల్పంగా నష్టపోయాయి.
  • ఝార్ఖండ్‌లో బర్న్‌పూర్‌ సిమెంట్‌కు చెందిన సిమెంట్‌ గ్రైండింగ్‌ ఆస్తులను రూ.169.79 కోట్లకు కొనుగోలు చేసినట్లు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ వెల్లడించింది.
  • హిందుజా గ్రూప్‌ సంస్థ హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌కు చెందిన ముంబయి, ఇతర నగరాల్లోని కార్యాలయాల్లో ఐటీ విభాగం బుధవారం సోదాలు నిర్వహించింది.

అదరగొట్టిన ఐఆర్‌ఈడీఏ

ఇండియన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) షేరు అరంగేట్రంలో అదరగొట్టింది. ఇష్యూ ధర రూ.32తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు 56.25% లాభంతో రూ.50 వద్ద నమోదైంది. అనంతరం అదే జోరుతో 87.46% లాభంతో రూ.59.99 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి, అక్కడే ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.16,123.90 కోట్లుగా నమోదైంది. రిటైల్‌ మదుపర్లు ఒక లాట్‌కు రూ.14,720 పెట్టుబడి పెట్టగా.. తొలిరోజే రూ.12,880 లాభం రావడం విశేషం.


12 ఏళ్ల గరిష్ఠానికి టాటా మోటార్స్‌ షేరు

టాటా మోటార్స్‌ షేరు 12 ఏళ్ల తర్వాత రూ.700 మైలురాయిని అధిగమించింది. కంపెనీ పెట్టుబడులు ఉన్న టాటా టెక్నాలజీస్‌ షేరు, ఎక్స్ఛేంజీల్లో బలంగా నమోదు కానుందన్న అంచనాలే ఇందుకు నేపథ్యం. బుధవారం ఇంట్రాడేలో రూ.714.40 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరిన టాటా మోటార్స్‌ షేరు.. చివరకు      2.09% లాభంతో రూ.712.15 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2.36 లక్షల కోట్లుగా నమోదైంది. టాటా మోటార్స్‌ కొత్త మోడళ్లకు మంచి స్పందన లభిస్తుండటం షేరు పరుగుకు అండగా నిలుస్తోంది.


ఎయిర్‌టెల్‌ @ రూ.1000స

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ షేరు తొలిసారిగా రూ.1000 మార్కును దాటింది. ఇంట్రాడేలో 2 శాతం లాభపడ్డ షేరు రూ.1,006.90 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1.01 శాతం లాభంతో రూ.995.50 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5.59 లక్షల కోట్లుగా నమోదైంది. అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్‌ను ఐపీఓకు తీసుకొచ్చే ప్రక్రియను ఎయిర్‌టెల్‌ ప్రారంభించిందనే వార్తలు ఇందుకు దోహదపడ్డాయి.


పసిడి జిగేల్‌

హైదరాబాద్‌: అంతర్జాతీయ విపణితో పాటు దేశీయంగానూ బంగారం ధరలు మరింత పెరిగాయి. ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర బుధవారం 2040 డాలర్లను మించింది. ఔన్సు వెండి ధర కూడా 25 డాలర్లకు చేరింది. అయితే 2020 కొవిడ్‌ పరిణామాల నాటి బంగారం గరిష్ఠ విలువ ఔన్సు 2072 డాలర్లతో పోలిస్తే, ఇప్పటికీ ఇంకా తక్కువగానే  ఉండటం గమనార్హం.  దేశీయ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ ఎంసీఎక్స్‌లో పసిడి డిసెంబరు కాంట్రాక్టు గరిష్ఠంగా రూ.62675, వెండి కిలో రూ.75,975 పలికాయి.

హైదరాబాద్‌ బులియన్‌ ట్రేడింగ్‌లో: 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర రూ.64,500కు చేరగా, కిలో వెండి రూ.78,100 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని