సంక్షిప్త వార్తలు(6)

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) తన హైనెస్‌ సీబీ350, సీబీ350ఆర్‌ఎస్‌ బైక్‌లను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.

Published : 02 Dec 2023 02:25 IST

 

హోండా హైనెస్‌ సీబీ 350, సీబీ350ఆర్‌ఎస్‌ వెనక్కి

దిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) తన హైనెస్‌ సీబీ350, సీబీ350ఆర్‌ఎస్‌ బైక్‌లను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. ఈ రెండు మోడళ్లకు చెందిన కొన్ని బైక్‌లలో నిర్దిష్ట విడిభాగాలను పరిశీలించి, మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వెనక వైపు స్టాప్‌ లైట్‌ స్విచ్‌నకు చెందిన రబ్బరు భాగాల తయారీ సరిగా జరగలేదని కంపెనీ గుర్తించింది. దీని వల్ల వర్షం/నీరు వెళ్లి స్విచ్‌ లోపల తుప్పు పట్టి లైట్‌ పనిచేయకుండా పోయేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. 2020 అక్టోబరు నుంచి 2023 జనవరి వరకు తయారైన ఈ బైక్‌లలో ఈ సమస్య రావొచ్చని తెలిపింది. ఎన్ని బైక్‌లను రీకాల్‌ చేస్తుందో కంపెనీ స్పష్టతనివ్వలేదు. సెన్సార్‌ హౌసింగ్‌లో లోపాలుండడం వల్ల కూడా వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది.


ఎన్‌సీసీకి రూ.533 కోట్ల పనులు

 ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగంలోని ఎన్‌సీసీ లిమిటెడ్‌ గత నెలలో    రూ.553.48 కోట్ల విలువైన రెండు పనులను దక్కించుకుంది. భవన నిర్మాణ విభాగానికి సంబంధించి ఒక ప్రైవేటు ఏజెన్సీ నుంచి ఈ పనులు లభించినట్లు వెల్లడించింది.


పెరిగిన ఇనుప ఖనిజం ఉత్పత్తి: ఎన్‌ఎండీసీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ గనుల సంస్థ ఎన్‌ఎండీసీ ఏప్రిల్‌- నవంబరు మధ్య కాలంలో 27.31 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. గత ఏడాది ఇదే కాలంలో తవ్వి తీసిన 23.32 మిలియన్‌ టన్నులతో పోలిస్తే ఇది 17 శాతం అధికం. విక్రయాలూ 23 శాతం పెరిగాయి. 2022 ఏప్రిల్‌-నవంబరు మధ్య 22.49 మి.టన్నులను విక్రయించగా, ఈ ఏడాది 23 శాతం వృద్ధితో 27.78 మి.టన్నుల ఖనిజాన్ని అమ్మింది. నవంబరులో ఉత్పత్తి 3.83 మి.టన్నులు కాగా, అమ్మకాలు 3.79 మి.టన్నులుగా ఉన్నాయని ఎన్‌ఎండీసీ తెలిపింది.


టయోటా కొత్త ప్రాంతీయ కేంద్రంలో కీలకంగా భారత్‌  

దిల్లీ: జపాన్‌కు చెందిన టయోటా మోటార్‌ తన ‘పశ్చిమాసియా, తూర్పు ఆసియా, ఓషియానా ప్రాంతం’లోకి భారత్‌ను కలుపుతూ ఒక ప్రాంతీయ పునర్నిర్మాణాన్ని ప్రకటించింది. ఈ కొత్త భౌగోళిక ప్రాంతంలో భారత్‌ ఒక కీలక కేంద్రంగా మారుతుందని కంపెనీ పేర్కొంది. ఈ పరిణామంలో భాగంగా టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ఎండీ, సీఈఓ మసకజు యోషిమురా ఇకపై టయోటా మోటార్‌ కార్పొరేషన్‌(టీఎమ్‌సీ) రీజినల్‌ సీఈఓగా మారతారని కంపెనీ తెలిపింది. ఆసియా ప్రాంతంలో భారత్‌ మార్కెట్‌కు ఇప్పటికే అధిక ప్రాధాన్యమిస్తున్నాం. తాజా మార్పుతో ‘పశ్చిమాసియా, తూర్పు ఆసియా, ఓషియానా ప్రాంతం’ 2024 జనవరి 1 నుంచి సరికొత్త ‘భారత్‌, పశ్చిమాసియా, తూర్పు ఆసియా, ఓషియానా’గా ఏర్పడుతుంది. ‘టయోటా అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాల్లో భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. ఇక్కడి నిపుణులైన కార్మికులు ఈ మార్కెట్‌ శక్తిని పెంచుతున్నార’ని టీఎమ్‌సీ పేర్కొంది.


మూడేళ్లలో ఫ్లెక్సిబుల్‌ కార్యాలయ స్థలాలు రెట్టింపు

దిల్లీ: ప్రీమియం ఆఫీస్‌ స్థలాల విభాగంలో, ఫ్లెక్లిబుల్‌ కార్యాలయాల స్థలం సరఫరా మూడు నుంచి నాలుగేళ్లలో రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని కొలియర్స్‌ నివేదిక వెల్లడించింది. దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఈ సరఫరా 6-7 శాతం పెరిగిందని పేర్కొంది. పెద్ద కార్పొరేట్ల నుంచి గిరాకీ అధికంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. శుక్రవారం బెంగళూరులో ఫిక్కీ  నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, పుణేల్లో 4.35 కోట్ల చదరపు అడుగుల కార్యాలయాన్ని ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారని పేర్కొంది. ఇందులో మొత్తం 6.24 లక్షల మేరకు సీట్లు ఉన్నాయని తెలిపింది.


3 శాతం తగ్గిన మారుతీ ఉత్పత్తి

దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఉత్పత్తి, ఈ ఏడాది నవంబరులో 3 శాతం తగ్గి 1,47,763 వాహనాలకు పరిమితమైంది. 2022 ఇదే నెలలో సంస్థ 1,52,786 వాహనాలను తయారు చేసింది. ప్రారంభస్థాయి మోడళ్లయిన ఆల్టో, ఎస్‌ప్రెసో తయారీ 21,904 వాహనాల నుంచి 62 శాతం తగ్గి 8425కు పరిమితమైంది. బాలెనో, సెలెరియో, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, వ్యాగన్‌ ఆర్‌ వంటి మోడళ్ల తయారీ కూడా 89,655 నుంచి 79,700 వాహనాలకు తగ్గింది. వినియోగ మోడళ్లయిన బ్రెజా, గ్రాండ్‌ విటారా, ఎర్టిగా, జిమ్ని వంటి కార్ల తయారీ మాత్రం 29,294 నుంచి 45,483కు పెరిగింది. మొత్తంమీద ప్రయాణికుల వాహనాల తయారీ 1,51,326 నుంచి 1,44,912కు పరిమితమైంది. తేలికపాటి వాణిజ్య వాహనం క్యారీ తయారీ మాత్రం 1460 నుంచి దాదాపు రెట్టింపై 2851కు పెరిగింది.


సంక్షిప్తంగా

  •  కంపెనీలో ఎస్‌ అండ్‌ టీ మైనింగ్‌ కంపెనీ విలీనాన్ని పూర్తి చేసినట్లు టాటా స్టీల్‌ ప్రకటించింది. ఈ విలీనానికి ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీ కోల్‌కతా బెంచ్‌ ఆమోదం తెలిపింది. డిసెంబరు 1 నుంచి విలీనం అమల్లోకి వచ్చింది.
  •  టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, టీసీపీఎల్‌ బెవరేజెస్‌ అండ్‌ ఫుడ్స్‌లతో విలీనానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతి ఇచ్చిందని టాటా కాఫీ తెలిపింది.
  •  నమోదిత సంస్థల ఫిర్యాదుల నిర్వహణకు తీసుకొచ్చిన స్కోర్స్‌ ప్లాట్‌ఫామ్‌ నియమావళి అమలు చేసేందుకు గడువును 2024 ఏప్రిల్‌ 1కు పొడిగించినట్లు సెబీ పేర్కొంది.
  •  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- నవంబరు మధ్య దేశంలో 1.22 లక్షల కొత్త కంపెనీలు నమోదయ్యాయని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో నమోదైన కంపెనీల సంఖ్య 1,15,233గా ఉంది.  
  •  భారతీ ఎయిర్‌టెల్‌లో అదనంగా రూ.8,301 కోట్ల విలువైన 1.35 శాతం వాటాను ఆ సంస్థ ప్రమోటరు భారతీ టెలికాం కొనుగోలు చేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని