ఒక కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వం

ఒక రంగంలోని సంస్థలన్నింటికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ, ఒక విభాగంలోని ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎటువంటి రాయితీలను ఇవ్వదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు

Published : 02 Dec 2023 02:34 IST

టెస్లా అంశంపై ఉన్నతాధికారి వ్యాఖ్య

దిల్లీ: ఒక రంగంలోని సంస్థలన్నింటికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ, ఒక విభాగంలోని ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎటువంటి రాయితీలను ఇవ్వదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. భారత్‌లో ప్లాంటు ఏర్పాటు కోసం అమెరికా విద్యుత్‌కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రత్యేక ప్రోత్సాహకాలను కోరుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఒక వేళ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇవ్వదలిస్తే మాత్రం మొత్తం ఈవీ తయారీదార్లందరికీ వర్తించేలా ఉంటాయని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రతి కంపెనీ పనితీరును క్షుణ్నంగా పరిశీలించి, అర్హతలను సాధిస్తేనే రాయితీలు/ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. టెస్లా కోరిన కస్టమ్స్‌ సుంకం తగ్గింపు వ్యవహారం అంతర్‌ మంత్రిత్వ శాఖల చర్చల్లో భాగంగా వచ్చినా.. ప్రస్తుతానికి ఎటువంటి తుది నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇవ్వదలిస్తే.. అన్ని కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. గత నెలలో వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ అమెరికాలో టెస్లా ప్లాంటును సందర్శించిన సంగతి తెలిసిందే. భారత్‌లో టెస్లా ప్లాంటు ఏర్పాటును ప్రోత్సహించే నిమిత్తం, కస్టమ్స్‌ సుంకం తగ్గింపులను భారత్‌ పరిశీలిస్తోందని వార్తలు వచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం కారు ధర, బీమా, రవాణా(సీఐఎఫ్‌) విలువ 40,000 డాలర్లకు పైగా ఉన్న కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని భారత్‌ అమలు చేస్తోంది. అంతకంటే తక్కువ విలువ కార్లకు 70% సుంకం అమలవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని