రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే

చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది

Updated : 02 Dec 2023 07:07 IST

వెల్లడించిన ఆర్‌బీఐ

ముంబయి: చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. వ్యవస్థలో చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో,   97.26 శాతమే వెనక్కి వచ్చాయని.. ప్రజల వద్ద ఇంకా రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ.2000 నోటును చలామణి నుంచి వెనక్కి తీసుకోనున్నట్లు మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది. ‘2023 మే 19న వ్యాపార సమయం ముగింపు నాటికి మొత్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2023 నవంబరు 30న వ్యాపార సమయం ముగిసే నాటికి ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.9,760 కోట్లకు తగ్గింద’ని ఆర్‌బీఐ తెలిపింది. రూ.2000 బ్యాంకు నోట్ల చెల్లుబాటును రద్దు చేయలేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద ప్రజలు రూ.2000 నోట్లను డిపాజిట్ చేయొచ్చు లేదా ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని వివరించింది. తపాలా కార్యాలయాల నుంచి ఇండియా పోస్ట్‌ ద్వారా నిర్దేశిత ఆర్‌బీఐ కార్యాలయాలకు రూ.2,000 నోటును పంపించి కూడా తమ ఖాతాల్లో జమచేసుకోవచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని