వాహన అమ్మకాలకు పండగ హుషారు

ఈ ఏడాది నవంబరులో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరా రికార్డు స్థాయిలో జరిగింది. పండగ సీజను  గిరాకీకి తగ్గట్లుగా డీలర్లకు కంపెనీలు భారీగా వాహనాలను అందించాయి

Published : 02 Dec 2023 03:12 IST

ప్రయాణికుల వాహనాల రికార్డు విక్రయాలు

దిల్లీ: ఈ ఏడాది నవంబరులో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరా రికార్డు స్థాయిలో జరిగింది. పండగ సీజను  గిరాకీకి తగ్గట్లుగా డీలర్లకు కంపెనీలు భారీగా వాహనాలను అందించాయి. గత నెలలో మొత్తంగా ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు 3.35 లక్షలుగా నమోదయ్యాయి. 2022 నవంబరులో టోకుగా విక్రయించిన 3.22 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 3.9% అధికం. ‘ప్రయాణికుల వాహనాల విభాగంలో, నవంబరుకు సంబంధించి కంపెనీల నుంచి టోకు సరఫరాల పరంగా ఇప్పటివరకు ఈ సంఖ్యే అత్యధికమ’ని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (మార్కెటింగ్‌, విక్రయాలు) శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని అత్యధిక వార్షిక టోకు విక్రయాలతో పరిశ్రమ ముగించే అవకాశం ఉందని.. మొత్తం 41 లక్షల వాహనాలను కంపెనీలు సరఫరా చేయొచ్చని తెలిపారు. నవంబరులో మారుతీ దేశీయంగా 1,34,158 ప్రయాణికుల వాహనాలు సరఫరా చేసింది. 2022 నవంబరులో సరఫరా చేసిన 1,32,395 వాహనాలతో పోలిస్తే ఇవి 1.33% ఎక్కువ. ప్రారంభస్థాయి చిన్న కార్ల సరఫరాలు 18,251 వాహనాల నుంచి తగ్గి 9,959 కు పరిమితమయ్యాయి.

 ద్విచక్ర వాహనాల దూకుడు: దేశీయంగా నవంబరులో 2,18,597 ద్విచక్ర వాహనాలను టోకుగా సరఫరా చేసినట్లు బజాజ్‌ ఆటో తెలిపింది. 2022 నవంబరులో సరఫరా చేసిన 1,23,657 వాహనాలతో పోలిస్తే ఈసారి 77% అధికం కావడం గమనార్హం. ఎగుమతులు 6% తగ్గి 1,30,451కు పరిమితమయ్యాయి. టీవీఎస్‌ మోటార్‌ దేశీయ ద్విచక్ర వాహనాల సరఫరా కూడా ఏడాది వ్యవధిలో 1,91,730 నుంచి 50% పెరిగి 2,87,017కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని