జోష్‌

దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది

Updated : 02 Dec 2023 03:37 IST

జీవనకాల గరిష్ఠానికి నిఫ్టీ

దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది. నవంబరు నెలలో వాహన విక్రయాలకు పండగ శోభ సంతరించగా.. జీఎస్‌టీ వసూళ్లలో జోరు కొనసాగింది. దేశీయ తయారీ రంగమూ మరోమారు ఆకర్షణీయ పనితీరుతో ఆకట్టుకుంది.

 సానుకూల ఆర్థిక గణాంకాలు, విదేశీ కొనుగోళ్ల మద్దతుతో నిఫ్టీ జీవనకాల గరిష్ఠాన్ని అధిరోహించింది. సెన్సెక్స్‌ 11 నెలల గరిష్ఠం దగ్గర ముగిసింది. జీడీపీ వృద్ధి అంచనాలను మించడం, విదేశీ మార్కెట్లు రాణించడం సానుకూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు పుంజుకుని 83.33 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.57% తగ్గి 80.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  •  సూచీల లాభాలతో మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ తాజా గరిష్ఠమైన రూ.337.67 లక్షల కోట్లకు చేరింది. గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో సెన్సెక్స్‌ 1,511.15 పాయింట్లు, నిఫ్టీ 473.2 పాయింట్లు చొప్పున రాణించగా, మదుపర్ల సంపద రూ.8.95 లక్షల కోట్లు వృద్ధి చెందింది.
  •  సెన్సెక్స్‌ ఉదయం 67,181.15 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, 67,149.07 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 492.75 పాయింట్ల లాభంతో 67,481.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 134.75 పాయింట్లు పెరిగి 20,267.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 20,291.55 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 పరుగులు తీశాయి.
  •  ఫ్లెయిర్‌ రైటింగ్‌ షేరు అరంగేట్రంలో మెరిసింది. ఇష్యూ ధర రూ.304తో పోలిస్తే బీఎస్‌ఈలో 65.45% లాభంతో రూ.503 వద్ద ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ 69% లాభపడి, రూ.514 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 48.91% లాభంతో రూ.452.70 వద్ద ముగిసింది. మార్కెట్‌ విలువ రూ.4,771.25 కోట్లుగా నమోదైంది. మదుపరి ఒక లాట్‌పై రూ.14,896 పెట్టుబడి పెడితే, ముగింపు ధర ప్రకారం ఆ విలువ మరో రూ.7,287 పెరిగినట్లయ్యింది.
  •  52 వారాల గరిష్ఠానికి హెచ్‌ఏఎల్‌ షేరు: భారత సైన్యం, ఎయిర్‌ఫోర్స్‌కు లైట్‌ కాంబాట్‌ హెలీకాప్టర్లను అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (హెచ్‌ఏఎల్‌) షేరు ఇంట్రాడేలో 5% లాభపడి రూ.2499 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరింది. చివరకు 3.35% లాభంతో     రూ.2,462.15 వద్ద ముగిసింది.
  • నవంబరు 24తో ముగిసిన వారానికి మన విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 2.538 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.21,000 కోట్లు) పెరిగి 597.935 బి.డాలర్ల (రూ.49.62 లక్షల కోట్ల)కు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది.
  •  లిక్విఫైడ్‌ సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) డెలివరీ చేయనందుకు నష్టపరిహారంగా రష్యా సంస్థ గాజ్‌ప్రోమ్‌ నుంచి 1.817 బి.డాలర్ల పరిహారం కోరుతూ గెయిల్‌ న్యాయ ప్రక్రియను ప్రారంభించనుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని