రామలింగ రాజు, మరో నలుగురు రూ.624 కోట్లు లాభపడ్డారు

దాదాపు 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కేసులో, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌   ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 

Published : 02 Dec 2023 03:26 IST

12 శాతం వడ్డీతో ఆ సొమ్ము చెల్లించాలి

‘సత్యం’ కుంభకోణంపై సెబీ తాజా ఆదేశాలు

 

ఈనాడు, హైదరాబాద్‌: దాదాపు 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కేసులో, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌   ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) కీలక ఉత్తర్వులు ఇచ్చింది.  ఈ కేసులో సత్యం వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులు   రూ.624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించి, ఆ సొమ్మును వారి నుంచి వడ్డీ సహా వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ నలుగురిలో రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్‌, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకే చెందిన ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు కూడా ఈ కేసులో బాధ్యత ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు 96 పేజీల ఉత్తర్వులను సెబీ తాజాగా జారీ చేసింది.
సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌లో 2009 జనవరి 7న ఖాతాల కుంభకోణం వెలుగు చూసింది. కంపెనీ ఆదాయాలు, వ్యయాలకు సంబంధించి తప్పుడు లెక్కలు వేసినట్లు అప్పటి సంస్థ ఛైర్మన్‌ అయిన రామలింగరాజు అంగీకరించిన విషయం విదితమే. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో కంపెనీ ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన సమాచారం ఆధారంగా రామలింగరాజు, ఇతరులు కంపెనీ షేర్లలో క్రయవిక్రయాలు నిర్వహించి లాభపడినట్లు సెబీ విశ్లేషించింది. ఈ మొత్తం రూ.624 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల ఈ సొమ్మును 2009 జనవరి 7వ తేదీ నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.

శాట్‌ ఆదేశాల మేరకు..: 2018 అక్టోబరు, నవంబరులో సెబీ ఇచ్చిన రెండు ఉత్తర్వుల్లో రామలింగరాజు, ఆయన సహచరులు అక్రమంగా ఏ మేరకు లబ్ది పొందిందీ వివరించిన విషయం విదితమే. ఆ ఉత్తర్వులను  శాట్‌ (సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌) ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపేసింది. ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి పరిశీలించి తాజా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అందుకు ఈ ఏడాది నవంబరు 30వ తేదీని గడువుగా నిర్దేశించింది. దీన్ని అనుసరించి సెబీ కొత్త ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది. కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించడంతో పాటు గతంలో అనుసరించిన సంప్రదాయాలను సైతం పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు సెబీ పూర్తికాలపు డైరెక్టర్‌ అనంత్‌ నారాయణ్‌ పేర్కొన్నారు. సత్యం ఖాతాల కుంభకోణం వెలుగు చూసిన తర్వాత రామలింగరాజు, రామరాజులను సెక్యూరిటీస్‌ మార్కెట్లో 2028 జూన్‌ 14 వరకు కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ నిషేధించింది. కాకపోతే ఈ ఉత్తర్వుల అమలు సుప్రీంకోర్టులో ఉన్న అప్పీళ్లపై వెలువడే తీర్పులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని