ఎన్‌ఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ తొలిసారిగా (ఈ నెల 1న) 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.334.72 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది.

Published : 04 Dec 2023 04:36 IST

ఇది జీవన కాల గరిష్ఠ స్థాయి

దిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ తొలిసారిగా (ఈ నెల 1న) 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.334.72 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. అదేరోజు నిఫ్టీ 50 సూచీ 20,291.55 పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠాన్ని నమోదు చేసినా, చివరకు 134.75 పాయింట్ల (0.67 శాతం) లాభంతో నిఫ్టీ జీవన కాల గరిష్ఠ ముగింపు స్థాయి అయిన 20,267.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 500 సూచీ కూడా 18,141.65 పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠాన్ని తాకింది.

  • ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కేవలం లార్జ్‌-క్యాప్‌ స్టాక్‌లకే పరిమితం కాలేదని ఇది సూచిస్తోంది.ఎన్‌ఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ 2 లక్షల కోట్ల డాలర్ల (2017 జులై) స్థాయి నుంచి 3 లక్షల కోట్ల డాలర్ల (2021 మే)కు చేరడానికి 46 నెలల సమయం పట్టింది. 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 4 లక్షల కోట్ల డాలర్లకు చేరడానికి కేవలం 30 నెలల సమయమే పట్టిందని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. గత పదేళ్లలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ 17.5 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌)ను సాధించిందని పేర్కొంది.
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు మార్కెట్‌ విలువ పరంగా తొలి మూడు స్థానాల్లో నిలిచి తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నాయి.
  • ఎన్‌ఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ, మన దేశ జీడీపీతో పోలిస్తే 118 శాతంగా నమోదైంది. మార్కెట్‌ విలువ పరంగా అగ్రశ్రేణి 5 దేశాల సరసన ఉన్నా, అభివృద్ధి చెందిన మార్కెట్లు అయిన అమెరికా, జపాన్‌లతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది.
  • ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో అక్టోబరు వరకు పలు కంపెనీలు రూ.5 లక్షల కోట్లకు పైగా నిధులను ప్రాథమిక మార్కెట్‌ నుంచి; ఈక్విటీ, కార్పొరేట్‌ బాండ్ల రూపంలో సమీకరించాయి.
  • గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోజువారీ సగటు టర్నోవర్‌ ఈక్విటీ విభాగంలో 27 శాతం, ఈక్విటీ డెరివేటివ్‌లలో 5 శాతం పెరిగింది.
  • గత పదేళ్లలో ఈక్విటీ విభాగ రోజువారీ సగటు టర్నోవర్‌ 6 రెట్లు పెరిగింది. అదే డెరివేటివ్‌ల రోజువారీ సగటు టర్నోవర్‌ 6 రెట్లు పెరిగినట్లు ఎక్స్ఛేంజ్‌ తెలిపింది.
  • బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ కూడా నవంబరు 29న 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని