ఎఫ్‌ఐఐల కొనుగోళ్లతో ముందుకే

ఈ వారమూ మార్కెట్లలో జోష్‌ కొనసాగేందుకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా పనితీరు కనబరచని బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల షేర్ల వైపు అందరి దృష్టీ ఉంది. దేశీయ వృద్ధిపై బలమైన అంచనాలకు తోడు అంతర్జాతీయంగా అధిక వడ్డీ రేట్లు, చమురు ధరల్లో ఊగిసలాటలు కొలిక్కి వస్తుండటంతో మార్కెట్లో సెంటిమెంటు సానుకూలంగా మారింది.

Published : 04 Dec 2023 01:23 IST

గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకూ అవకాశం
సెంటిమెంటు మాత్రం సానుకూలం
ఆర్‌బీఐ పరపతి విధానంపైనా దృష్టి
లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించొచ్చు
విశ్లేషకుల అంచనాలు

వారమూ మార్కెట్లలో జోష్‌ కొనసాగేందుకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా పనితీరు కనబరచని బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల షేర్ల వైపు అందరి దృష్టీ ఉంది. దేశీయ వృద్ధిపై బలమైన అంచనాలకు తోడు అంతర్జాతీయంగా అధిక వడ్డీ రేట్లు, చమురు ధరల్లో ఊగిసలాటలు కొలిక్కి వస్తుండటంతో మార్కెట్లో సెంటిమెంటు సానుకూలంగా మారింది. దీంతో విదేశీ సంస్థాగత మదుపర్లు(ఎఫ్‌ఐఐ) తమ షార్ట్‌ పొజిషన్లను కవర్‌ చేసుకోవడాన్ని కొనసాగించొచ్చని భావిస్తున్నారు. ‘బ్యాంకులు, ఆర్థిక సేవల షేర్లు రాణించడం మొదలుపెడితే నిఫ్టీ-50 మరింత ముందుకెళ్లొచ్చు. బ్యాంక్‌నిఫ్టీ తన జీవనకాల గరిష్ఠమైన 46,369.5 పాయింట్లను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిలో భాజపా విజయం సాధించినందున, మార్కెట్‌ సెంటిమెంటు మెరుగుపడొచ్చు. రికార్డు గరిష్ఠాల వద్ద, మదుపర్లు కొంత మేర లాభాలు స్వీకరించొచ్చు. ఈనెల 6-8 తేదీల్లో జరిగే ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాల కోసం మదుపర్లు వేచిచూడొచ్చు. వడీరేట్లలో మార్పులు చేయకపోవచ్చని భావిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • ప్రామాణిక సూచీలతో పాటే సిమెంటు షేర్లూ రాబోయే రోజుల్లో రాణించొచ్చు. సాధారణ ఎన్నికలకు ముందు మౌలిక రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచుతుందన్న అంచనాలే ఇందుకు నేపథ్యం.
  • లోహ కంపెనీల షేర్లలో లాభాలు కొనసాగొచ్చు. లోహ సూచీ 7,175 పాయింట్ల వద్ద తన నిరోధాన్ని అధిగమిస్తే ఎక్కువ లాభాలకు అవకాశం ఉంది.
  • కొన్ని వాహన షేర్లు లాభపడొచ్చు. గరిష్ఠాలకు చేరినందున లాభాల స్వీకరణ జరగొచ్చు. నవంబరు విక్రయాల ప్రభావమూ ఉంటుంది.
  • మార్కెట్‌తో పాటే ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లూ పెరగొచ్చు. కొంత మేర లాభాల స్వీకరణ ఉన్నా,రక్షణాత్మక రంగం కాబట్టి ఈ సూచీ రాణించడానికే అవకాశం ఎక్కువ.
  • ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్న అంచనాల మధ్య, చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కొనసాగొచ్చు. ఈ షేర్ల ధరలు మరీ ఎక్కువకు చేరినందున లాభాలు పరిమితంగానే ఉండొచ్చు.
  • ఐటీ కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో కదలాడొచ్చు. ఇన్ఫోసిస్‌ రూ.1500 ధరపైన బులిష్‌ బ్రేకవుట్‌కు అవకాశం ఉంది. టీసీఎస్‌కు రూ.3550 వద్ద నిరోధం, రూ.3400 వద్ద మద్దతు కనిపిస్తున్నాయి.
  • ఔషధ షేర్లు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కనిష్ఠాల దిగువకు చేరకపోతే మాత్రం సెంటిమెంటు మెరుగ్గానే ఉండొచ్చు.
  • ప్రభావం చూపే వార్తలు లేనందున ఎంపిక చేసిన టెలికాం షేర్లలో కదలికలుంటాయి. భారతీ ఎయిర్‌టెల్‌ వరుసగా అయిదో వారమూ పెరిగింది.
  • బ్యాంక్‌ నిఫ్టీకి మిశ్రమ ఫలితాలు కనిపించొచ్చు. కొంత మేర లాభాల స్వీకరణ, దిద్దుబాటుకు అవకాశం ఉంది. బ్యాంక్‌ నిఫ్టీకి 44,000 పాయింట్ల వద్ద మద్దతు; 45,250 వద్ద నిరోధాన్ని అంచనా వేస్తున్నారు.
  • యంత్ర పరికరాల కంపెనీల్లో స్వల్పకాలంలో కొంత లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. గత అయిదు వారాల్లో ఈ రంగ సూచీ 11 శాతం వరకు లాభాలందుకోవడం ఇందుకు నేపథ్యం. ఏబీబీ ఇండియాకు రూ.4,700 వద్ద: సీమెన్స్‌కు రూ.3,950 వద్ద బలమైన నిరోధం ఎదురుకావొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని