6 విమానాశ్రయాల లీజు వల్ల ఏటా రూ.515 కోట్లు ఆదా

2018 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ) ఆరు విమానాశ్రయాలను అద్దెకు ఇవ్వడం వల్ల, నిర్వహణా వ్యయాల రూపంలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు ఏటా రూ.515 కోట్లు ఆదా అవుతున్నాయని  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

Published : 05 Dec 2023 03:58 IST

దిల్లీ: 2018 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ) ఆరు విమానాశ్రయాలను అద్దెకు ఇవ్వడం వల్ల, నిర్వహణా వ్యయాల రూపంలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు ఏటా రూ.515 కోట్లు ఆదా అవుతున్నాయని  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళూరు, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, తిరువనంతపురం, జయపుర, గువాహటి- విమానాశ్రయాలను 2018లో పీపీపీ పద్ధతిలో లీజుకు ఇచ్చారు.  అహ్మదాబాద్‌ విమానాశ్రయం నిర్వహణ వ్యయం రూపేణ రూ.137.41 కోట్లు, జయపుర ద్వారా రూ.50.96 కోట్లు, లఖ్‌నవూ ద్వారా రూ.62.96 కోట్లు, మంగళూరు ద్వారా రూ.53.29 కోట్లు, తిరువనంతపురంలో రూ.142.09 కోట్లు, గువాహటిపై రూ.67.88 కోట్లు చొప్పున ఆదా అవుతున్నాయి. ఈ విమానాశ్రయాలను అద్దెకు ఇచ్చిన తర్వాత నుంచి వీటిని నిర్వహిస్తున్న సంస్థలు ఆర్జించిన ఆదాయాల వివరాలను కూడా మంత్రి వెల్లడించారు. అహ్మదాబాద్‌ నుంచి రూ.507 కోట్లు; జయపుర నుంచి రూ.251 కోట్లు, లఖ్‌నవూ నుంచి రూ.365 కోట్లు, మంగళూరు రూ.118 కోట్లు, తిరువనంతపురంపై రూ.350 కోట్లు, గువాహటి నుంచి రూ.248 కోట్లు చొప్పున ఆదాయాన్ని ఆర్జించాయని తెలిపారు. ప్రస్తుతం పీపీపీ విధానంలో 14 విమానాశ్రయాలను ప్రైవేట్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇందులో మూడు మాత్రమే (కోచి, బెంగళూరు, హైదరాబాద్‌) 2022-23లో లాభాలను నమోదుచేశాయి. విమానాశ్రయాలను అత్యుత్తమ రీతిలో నిర్వహణకు, ప్రైవేట్‌ రంగ సామర్థ్యం వినియోగానికి, పెట్టుబడుల కోసం ఈ విమానాశ్రయాలను అద్దెకు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని