రూ.12 లక్షల కోట్లకు అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ

అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ నికర సంపద గతవారం మొత్తం మీద 5.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.46,500 కోట్లు) పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ఆధారంగా తెలుస్తోంది. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి సెబీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేయడం ఇందుకు నేపథ్యం.

Published : 05 Dec 2023 03:59 IST

అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ నికర సంపద గతవారం మొత్తం మీద 5.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.46,500 కోట్లు) పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ఆధారంగా తెలుస్తోంది. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి సెబీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేయడం ఇందుకు నేపథ్యం. కాగా.. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూపుపై పలు ఆరోపణలు చేస్తూ హిండెన్‌బర్గ్‌ ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అనంతరం ఆ సమయంలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ ప్రభావంతో గౌతమ్‌ అదానీ సంపద కూడా భారీగా ఆవిరయ్యింది. అప్పటివరకు ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే అగ్రగామి-25 మంది కుబేరుల జాబితాలోనే లేకుండా పోయారు. అయితే అదానీ గ్రూప్‌పై వచ్చిన పలు ఆరోపణలకు సంబంధించి.. మొత్తం 24 అంశాల్లో 22 కేసులపైన దర్యాప్తు పూర్తయిందని, ఇక దర్యాప్తు కొనసాగింపునకు గడువు కోరబోమని కోర్టుకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ తెలిపింది. ‘ఈ కేసులో సెబీని అనుమానించడానికి మా ముందు ఎటువంటి ఆధారాలూ లేవు. అలాగే హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నిటినీ ‘వాస్తవాలు’గా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేద’ని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొనడం అదానీ గ్రూప్‌పై మదుపర్ల సెంటిమెంటు మెరుగుపడడానికి కారణమైంది. ఈ పరిణామాల తర్వాత బ్లూమ్‌బర్గ్‌ కుబేరుల సూచీలో గౌతమ్‌ అదానీ 65.8 బిలియన్‌ డాలర్ల సంపదతో 20వ స్థానంలో నిలిచినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం పేర్కొంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సూచీలు కొత్త శిఖరాలను చేరడంతో అదానీ గ్రూపునకు చెందిన 10 కంపెనీల షేర్లకు సోమవారం కూడా లాభాలు కొనసాగాయి. దీంతో ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.12 లక్షల కోట్లకు చేరువగా నిలిచింది. సోమవారం ట్రేడింగ్‌ ముగిసేనాటికి రూ.11.95 లక్షల కోట్లుగా నమోదైంది. శుక్రవారం నాటి రూ.11.22 లక్షల కోట్లతో పోలిస్తే సుమారు రూ.72,861 కోట్ల మేర మార్కెట్‌ విలువ పెరగడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని