రికార్డుల మోత మోగింది

అంచనాలను మించి కేంద్రంలోని భాజపా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలు.. దేశీయ స్టాక్‌మార్కెట్లు దూసుకెళ్లేందుకు కారణమయ్యాయి. 5 రాష్ట్రాలకు గాను 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (భాజపా) విజయం సాధించడంతో సోమవారం దేశీయ సూచీలు తారాజువ్వల్లా ఎగిశాయి.

Updated : 05 Dec 2023 05:55 IST

జీవనకాల తాజా గరిష్ఠాలకు సెన్సెక్స్‌, నిఫ్టీ
 ఒకేరోజు రూ.5.81 లక్షల కోట్లు పెరిగి, రూ.343.48 లక్షల కోట్లకు మదుపర్ల సంపద 

అంచనాలను మించి కేంద్రంలోని భాజపా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలు.. దేశీయ స్టాక్‌మార్కెట్లు దూసుకెళ్లేందుకు కారణమయ్యాయి. 5 రాష్ట్రాలకు గాను 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (భాజపా) విజయం సాధించడంతో సోమవారం దేశీయ సూచీలు తారాజువ్వల్లా ఎగిశాయి. పార్లమెంటుకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లోనూ, మరోసారి సుస్థిర ప్రభుత్వం రావొచ్చన్న అంచనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ఒక్కరోజే 2 శాతానికి పైగా లాభపడ్డ సెన్సెక్స్‌, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు తగ్గి 83.38 వద్ద ముగిసింది.

సూచీల భారీ లాభాల నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ సోమవారం ఒక్కరోజే రూ.5.81 లక్షల కోట్లు పెరిగి తాజా గరిష్ఠమైన రూ.343.48 లక్షల కోట్లకు చేరింది. గత 5 ట్రేడింగ్‌ రోజుల్లో మదుపర్లు రూ.14.76 లక్షల కోట్ల మేర లాభపడ్డారు.

రోజంతా పరుగులే..: ఉదయం నుంచీ భారీ లాభాల్లో సూచీలు ట్రేడయ్యాయి. సూచీల దూకుడు మొదటి నుంచి చివరి దాకా కొనసాగింది. సెన్సెక్స్‌ ప్రారంభంలోనే 985 పాయింట్లకు పైగా లాభంతో దూకుడు కనబరచింది. ఆద్యంతం అదే ధోరణి కొనసాగిస్తూ,    68,918.22 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 1,383.93 (2.05%) పాయింట్ల లాభంతో 68,865.12 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా పరుగులు తీసి చివరకు 418.90 పాయింట్ల (2.07%) రాణించి 20,686.80 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 20,702.65 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. 2022 మే 20 తర్వాత సూచీలకిదే అత్యధిక ఒకరోజు లాభం కావడం విశేషం.

విప్రో, టాటా మోటార్స్‌, టైటన్‌ మినహా..: సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ అత్యధికంగా  4.68% మెరిసింది. ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌ 3.99% వరకు పెరిగాయి. విప్రో, టాటా మోటార్స్‌, టైటన్‌ మాత్రం స్వల్పంగా తగ్గాయి. చమురు-గ్యాస్‌, బ్యాంకింగ్‌ సహా అన్ని రంగాల సూచీలు లాభాలు నమోదుచేశాయి.

అనుబంధ సంస్థలు ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫ్రా క్రెడిట్‌, ఎల్‌ అండ్‌ టీ మ్యూచువల్‌ ఫండ్‌లను తమలో విలీనం చేసుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ ప్రకటించడంతో షేరు 1.99% లాభపడి రూ.154 వద్ద ముగిసింది. ఎల్‌ అండ్‌ టీ షేరు 3.93% పెరిగి రూ.3,316.05 దగ్గర స్థిరపడింది.

సూచీల లాభాలకు కొన్ని కారణాలివే..

  • పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మెరుగ్గా రాణించడంతో, మార్కెట్లు భారీ లాభాలు నమోదుచేశాయి. 2024లోనూ ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగితే, స్థిరమైన విధానాలు, సంస్కరణలు అమలవుతాయనే నమ్మకం కొనుగోళ్లకు దారితీసింది.
  • నవంబరులో వాహన విక్రయాలు, జీఎస్‌టీ వసూళ్లు, మౌలిక రంగం, తయారీ వృద్ధి రాణించడం కలిసొచ్చింది.
  • బ్యారెల్‌ ముడిచమురు 80 డాలర్లకు తగ్గడం, విదేశీ కొనుగోళ్లు ఇందుకు తోడయ్యాయి.
  • సాంకేతికంగా చూస్తే.. నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలకు చేరడంతో మరిన్ని లాభాలకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని