సంక్షిప్త వార్తలు

గ్రాన్యూల్స్‌ ఇండియాకు చెందిన అమెరికా అనుబంధ సంస్థ, గ్రాన్యూల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌., సిల్డెనాఫిల్‌ ఓరల్‌ సస్పెన్షన్‌ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ మందు వయాట్రిస్‌ స్పెషాలిటీ ఎల్‌ఎల్‌సీ అనే సంస్థకు చెందిన రెవాటియో బ్రాండుకు జనరిక్‌ ఔషధం.

Updated : 05 Dec 2023 05:14 IST

గ్రాన్యూల్స్‌ ఔషధానికి అమెరికాలో అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియాకు చెందిన అమెరికా అనుబంధ సంస్థ, గ్రాన్యూల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌., సిల్డెనాఫిల్‌ ఓరల్‌ సస్పెన్షన్‌ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ మందు వయాట్రిస్‌ స్పెషాలిటీ ఎల్‌ఎల్‌సీ అనే సంస్థకు చెందిన రెవాటియో బ్రాండుకు జనరిక్‌ ఔషధం. సిల్డెనాఫిల్‌ ఓరల్‌ సస్పెన్షన్‌ను పల్మనరీ ఆర్టెరియల్‌ హైపర్‌టెన్షన్‌ (పీఏహెచ్‌) చికిత్సలో వినియోగిస్తున్నారు. ఈ మందు అమెరికాలో గత ఏడాది కాలంలో 43 మిలియన్‌ డాలర్ల అమ్మకాలు నమోదు చేసింది. ఈ ఔషధంతో కలిసి తమకు అమెరికాలో 63 ఏఎన్‌డీఏ అనుమతులు ఉన్నట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా తెలిపింది.


డిపాజిట్‌ రేట్ల పెంపు: బీఓఐ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతున్నట్లు ప్రకటించింది. 46-90 రోజుల వ్యవధి డిపాజిట్లకు 5.25 శాతం, 91-179 రోజుల వ్యవధికి 6 శాతం, 180-210 రోజుల వ్యవధికి 6.25 శాతం, 211 రోజుల నుంచి ఏడాది లోపు వాటికి 6.50 శాతం చొప్పున వడ్డీ అందిస్తున్నట్లు పేర్కొంది. ఏడాది డిపాజిట్‌పై 7.25 శాతం వడ్డీని ప్రకటించింది. అధిక విలువగల వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐ), చిన్న, మధ్యస్థాయి సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, వృత్తి నిపుణులను ఆకట్టుకునేలా వడ్డీ రేట్లను సవరించినట్లు బ్యాంక్‌ పేర్కొంది.


7.76 కోట్ల రిటర్నుల దాఖలు

పార్లమెంటులో వెల్లడించిన ప్రభుత్వం

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు  ఈనెల 2 వరకు 7.76 కోట్లకు పైగా దాఖలైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 31 వరకు సమయం ఉన్నందున, ఈ సంఖ్య మరికొంత పెరుగుతుందని భావిస్తున్నట్లు, సోమవారం లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలియజేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న వారిలో 10.09 కోట్ల మంది, 2021-22 ఆదాయానికి గాను పన్నులు చెల్లించినట్లు తెలిపారు. 2022-23 సంవత్సరానికి గాను రూ.16.63 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. ఇందులో ఆదాయపు పన్ను వాటా రూ.8.08 లక్షల కోట్లు.


5 ఏళ్లలో 1,06,561 కంపెనీల స్వచ్ఛంద నిష్క్రమణ

దిల్లీ: కంపెనీల చట్టం కింద నమోదైన వాటిల్లో, లక్షకు పైగా సంస్థలు గత అయిదేళ్లలో స్వచ్ఛందంగా నిష్క్రమించాయని సోమవారం ప్రభుత్వం వెల్లడించింది. అనేక కంపెనీలు దివాలా స్మృతి కింద స్వచ్ఛంద లిక్విడేషన్‌ను కోరాయని తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబరు 30 వరకు 1,06,561 కంపెనీలు స్వచ్ఛందంగా కంపెనీల చట్టం 2013 నుంచి నిష్క్రమించాయని కేంద్ర మంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు. 1,168 కంపెనీలు దివాలా స్మృతి కింద లిక్విడేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాయని, ఇందులో 633 కేసుల్లో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తుది తీర్పులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.


ఇంటర్నేషనల్‌ ఏఆర్‌సీ నుంచి బ్లాక్‌స్టోన్‌ నిష్క్రమణ

దిల్లీ: ఇంటర్నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఇంటర్నేషనల్‌ ఏఆర్‌సీ) నుంచి బ్లాక్‌ స్టోన్‌ నిష్క్రమిస్తోంది. ఇందులో వాటాదార్లుగా ఉన్న టాటా గ్రూప్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి భారత సంస్థలు మాత్రం కొనసాగనున్నాయని అంచనా. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీకి 20%, టాటా క్యాపిటల్‌కు 18%, ఐసీఐసీఐ బ్యాంక్‌కు 6 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా, ఇంటర్నేషనల్‌ ఏఆర్‌సీలో బ్లాక్‌స్టోన్‌కున్న 51 శాతం వాటా కొనుగోలు రేసులో బ్లాక్‌స్టోన్‌ ఇండియా ప్రైవేటు ఈక్విటీ మాజీ సహ అధిపతి అయిన మాథ్యూ సిరాయాక్‌ ముందుండడం విశేషం. ఈ లావాదేవీ నేపథ్యంలో కంపెనీ నికర విలువను రూ.300 కోట్లుగా లెక్కగట్టినట్లు ఈ అంశాలతో సంబంధమున్న వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ  పేర్కొంది. కాప్రి గ్లోబల్‌, ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రా కూడా వాటా కొనుగోలుపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్‌ ఏఆర్‌సీ నుంచి పలువురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు నిష్క్రమిస్తున్న నేపథ్యంలో ఇటీవల కొద్ది కాలంలో ఆసియా ప్రాధాన్యతను బ్లాక్‌స్టోన్‌ తగ్గించుకుంటూ వస్తోంది. ఇంటర్నేషనల్‌ ఏఆర్‌సీని 2002లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మాజీ ఎండీ, సీఈఓ అరుణ్‌ దుగ్గల్‌ ఏర్పాటు చేశారు.


ఎఫ్‌ఐయూ వద్ద 28 క్రిప్టో ప్లాట్‌ఫామ్‌ల నమోదు

దిల్లీ: ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌- ఇండియా (ఎఫ్‌ఐయూ) వద్ద 28 క్రిప్టో/ వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ (వీడీఐ) సేవలు అందించే సంస్థలు నమోదయ్యాయని ఆర్థిక శాఖ తెలిపింది. వీటిల్లో వజీర్‌ఎక్స్‌, కాయిన్‌ డీసీఎక్స్‌, కాయిన్‌స్విచ్‌ లాంటివి ఉన్నాయని తెలిపింది. వీడీఏలు, క్రిప్టో ఎక్స్ఛేంజీలు, మధ్యవర్తిత్వ సంస్థలను మనీ ల్యాండరింగ్‌ నియంత్రణ చట్టం కింద రిపోర్ట్‌ చేయాల్సిన సంస్థలుగా పరిగణిస్తారని ఆర్థిక శాఖ మార్చిలో స్పష్టం చేసింది. ఈ ప్రకారంగానే వినియోగదార్లు, క్లయింట్ల కేవైసీలను క్రిప్టో ఎక్స్ఛేంజీలు, మధ్యవర్తిత్వ సంస్థలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారత విపణి కోసం పనిచేస్తున్న విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయా? అనే ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి అవునని బదులిచ్చారు.


రూ.700 కోట్ల సమీకరణ యత్నాల్లో బైజూస్‌

షేర్ల తనఖాకు సిద్ధం

దిల్లీ: ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ వచ్చే ఏడాది మార్చి వరకు కంపెనీ కార్యకలాపాల కోసం రూ.600-700 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం షేర్లను తనఖా పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత తమ అనుబంధ సంస్థల్లో వాటాలు విక్రయించడం ద్వారా బైజూస్‌ డబ్బులు సేకరించనుంది. బైజూస్‌ వ్యవస్థాపకులు బైజు రవీంద్రన్‌, ఇటీవల ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కోసం కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్లు, స్థిరాస్తులను తనఖా పెట్టి నిధులు సమీకరించారు. కార్యకలాపాల నిర్వహణ కోసం నెలకు సుమారు రూ.50 కోట్ల మేర వరకు అదనంగా అవసరమవుతోంది. ఇందులో అధిక భాగం వేతనాల కోసం వెచ్చించాల్సి వస్తోంది. ఆదాయ వ్యయాలకు వ్యత్యాసం ఉన్న రూ.50 కోట్ల కోసం ప్రమోటర్లు షేర్లు, గృహ, ఇతర స్థిరాస్తులను తనఖా పెట్టారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


కోల్‌కతాలో తొలి ఈవీ

బ్యాటరీ స్వాపింగ్‌ కేంద్రం: ఐఓసీ

దిల్లీ: విద్యుత్‌ వాహనాల కోసం (ఈవీ) కోల్‌కతాలో మొట్టమొదటి బ్యాటరీ స్వాపింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) తెలిపింది. సన్‌ మొబిలిటీ సహకారంతో న్యూ టౌన్‌ వద్ద ఉన్న తన రిటైల్‌ విక్రయ కేంద్రం వద్ద దీనిని ఏర్పాటు చేసింది.


సంక్షిప్తంగా

  • ఎన్‌సీఎల్‌టీలో స్పైస్‌జెట్‌కు ఉపశమనం లభించింది. బకాయిలు చెల్లించలేదంటూ విమాన లీజు సంస్థ విల్లీస్‌ లీజ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ సోమవారం కొట్టివేసింది.
  • జనవరి నుంచి దేశంలో వాహన ధరలను పెంచనున్నట్లు ఎంజీ మోటార్‌ ఇండియా తెలిపింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాల వల్లే, వాహన ధరలు పెంచుతున్నట్లు వివరించింది.
  • కృష్ణా గోదావరి బేసిన్‌ (కేజీ బ్లాక్‌)లోని లోతైన క్షేత్రాల నుంచి ముడిచమురు ఉత్పత్తిని ఓఎన్‌జీసీ 2024 మేలో  ప్రారంభించనున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి రామేశ్వర్‌ తేలి రాజ్యసభకు తెలిపారు. కేజీ-డీడబ్ల్యూఎన్‌-98/2 క్షేత్రం చాలా సవాళ్లతో కూడుకున్నదని, కొవిడ్‌-19 సంక్షోభం కూడా ఉత్పత్తి ప్రారంభంలో జాప్యానికి కారణమైందని వెల్లడించారు.
  • కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (కామ్స్‌) ప్రమోటర్‌ అయిన గ్రేట్‌ టెర్రైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ తమ మొత్తం 19.87 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా రూ.2700 కోట్లకు విక్రయించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు