సంక్షిప్త వార్తలు(7)

గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ ఉత్పత్తి చేసే సంస్థ గ్రాఫైట్‌ ఇండియా లిమిటెడ్‌, హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గోడి ఇండియా అనే సంస్థలో 31% వాటా కొనుగోలు చేస్తోంది.

Published : 06 Dec 2023 02:10 IST

గోడి ఇండియాలో గ్రాఫైట్‌  ఇండియాకు 31% వాటా  

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ ఉత్పత్తి చేసే సంస్థ గ్రాఫైట్‌ ఇండియా లిమిటెడ్‌, హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గోడి ఇండియా అనే సంస్థలో 31% వాటా కొనుగోలు చేస్తోంది. దీని కోసం కంపల్సరీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో రూ.50 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు గ్రాఫైట్‌ ఇండియా వెల్లడించింది. గోడి ఇండియా హైదరాబాద్‌లోని తన యూనిట్లో విద్యుత్తు వాహనాలకు అవసరమైన బ్యాటరీలు, సూపర్‌ కెపాసిటర్‌ ఆధారిత ఇంధన నిల్వ సాధనాలు ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థ లిథియమ్‌ ఆయాన్‌ బ్యాటరీలే కాకుండా సోడియమ్‌ ఆయాన్‌ సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలకు సంబంధించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి విభాగాల్లోకి విస్తరించే లక్ష్యంతో గోడి ఇండియాలో పెట్టుబడి పెట్టినట్లు గ్రాఫైట్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ దీక్షిత్‌ తెలిపారు. విస్తృత పరిశోధనల ఆధారంగా ఇంధన నిల్వ, బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి విభాగాల్లో సరికొత్త విధానాలను ఆవిష్కరించినట్లు గోడి ఇండియా వ్యవస్థాపకుడు మహేష్‌ గోడి వివరించారు. గ్రాఫైట్‌ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరుపక్షాలకూ మేలు చేస్తుందని అన్నారు.


ఐడీఎఫ్‌సీ బోర్డులోకి డేవెన్‌ పరేఖ్‌ వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్‌ గ్లోబల్‌ వెంచర్‌ క్యాపిటలిస్టు అయిన డేవెన్‌ పరేఖ్‌, ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐడీఎఫ్‌సీ) బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అండ్‌ ఏజెన్సీ అయిన ఐడీఎఫ్‌సీలోకి డేవెన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారు. ఈయన సాఫ్ట్‌వేర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఇన్‌సైట్‌ పార్ట్‌నర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఈయన మూడేళ్ల పాటు ఐడీఎఫ్‌సీ బోర్డులో ఉంటారని వైట్‌హౌస్‌  తెలిపింది. 2020లో కూడా పరేఖ్‌ను అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డీఎఫ్‌సీ డైరెక్టర్ల బోర్డులోకి నామినేట్‌ చేశారు. ఈయన 2016 నుంచి 2018 వరకు ఓవర్సీస్‌ ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ బోర్డులో సభ్యుడిగా పని చేశారు. 2010-12 మధ్య అమెరికా ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా సేవలందించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో బీఎస్‌ పూర్తి చేశారు.


రూ.830 కోట్లతో హైదరాబాద్‌లో ఫెడెక్స్‌ కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: సరకు రవాణా సేవల సంస్థ అయిన ఫెడెక్స్‌ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉన్న ఫెడెక్స్‌ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌లో తన తొలి ఏసీసీ (అడ్వాన్స్‌డ్‌ కేపబిలిటీ కమ్యూనిటీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై 100 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.830 కోట్ల) పెట్టుబడి పెడుతున్నట్లు ఫెడెక్స్‌ వెల్లడించింది. ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి ఫెడెక్స్‌ కార్పొరేషన్‌ సీఈఓలు రాజ్‌ సుబ్రమణియమ్‌, రిఛర్డ్‌ స్మిత్‌ హాజరయ్యారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించేందుకు ఈ కేంద్రం కృషి చేస్తుందని, ముఖ్యంగా డిజిటల్‌ విభాగంలో సరికొత్త ప్రాజెక్టులు చేపడుతుందని తద్వారా స్థానికంగా యువకులకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఫెడెక్స్‌ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా తాము చేపట్టే నూతన ప్రాజెక్టులకు హైదరాబాద్‌ కేంద్రం వెన్నుదన్నుగా నిలుస్తుందని వివరించారు. దాదాపు 220 దేశాల్లో ఫెడెక్స్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.


వీనస్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ కొత్త ఉత్పత్తులు

హైదరాబాద్‌: వీనస్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ తన 60 ఏళ్ల సంబరాల సందర్భంగా రెండు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. స్ప్లాష్‌ ప్రొ స్మార్ట్‌ ఇన్‌స్టంట్‌ వాటర్‌హీటర్‌, సెడ్రా స్టోరేజ్‌ వాటర్‌హీటర్‌లను తీసుకొచ్చింది. స్ప్లాష్‌ ప్రొపై 2 ఏళ్ల గ్యారెంటీతో పాటు ఇన్నర్‌ ట్యాంక్‌పై 10 ఏళ్లు, హీటింగ్‌ ఎలిమెంట్‌పై 4 ఏళ్ల గ్యారెంటీ ఉంది. సెడ్రాపై కూడా 2 ఏళ్ల గ్యారెంటీ ఉండగా.. ఇన్నర్‌ ట్యాంక్‌పై 7 ఏళ్లు, హీటింగ్‌ ఎలిమెంట్‌పై 3 ఏళ్ల గ్యారెంటీని ఇస్తున్నట్లు తెలిపింది. గత ఆరు దశాబ్దాలుగా నాణ్యత, మన్నికకు మారుపేరుగా నిలిచి ఒక విశ్వసనీయ బ్రాండ్‌గా ఉన్నామని సంస్థ పేర్కొంది. పలు సంవత్సరాల నుంచి వాటర్‌హీటర్ల విషయంలో అతిపెద్ద భారతీయ ఎగుమతిదారుగా కొనసాగుతున్నట్లు తెలిపింది.


విప్రో చేతికి వీవీఎఫ్‌ 3 సబ్బులు

దిల్లీ: వీవీఎఫ్‌ (ఇండియా) లిమిటెడ్‌ నుంచి జో, డాయ్‌, బ్యాక్టర్‌ షీల్డ్‌ అనే 3 సబ్బుల బ్రాండ్లను కొనుగోలు చేసినట్లు విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ మంగళవారం ప్రకటించింది. వ్యక్తిగత శుభ్రత విభాగంలో కంపెనీ విస్తరించేందుకు ఈ బ్రాండ్ల కొనుగోలు తమకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ఎంత మొత్తానికి ఈ కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు. అజీమ్‌ ప్రేమ్‌జీకి చెందిన విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌, గత 12 నెలల్లో ఇలా బ్రాండ్లను కొనుగోలు చేయడం ఇది మూడోసారి. ఇప్పటి వరకు మొత్తంగా ఇది 15వ కొనుగోలు. విప్రో.. తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను దూకుడుగా విస్తరిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ రూ.10,000 కోట్ల విక్రయాల మార్కును అధిగమించింది.


రిఫ్రిజిరేటెడ్‌ విద్యుత్‌ వాహనాలు

జెవో ఆవిష్కరణ

ముంబయి: విద్యుత్తు వాహనాల (ఈవీ) మొబిలిటీ ప్లాట్‌ఫాం అయిన జెవో, తన రిఫ్రిజిరేటెడ్‌ విద్యుత్‌ వాహనాల(ఆర్‌ఈవీ)ను మాచిపీ సొల్యూషన్స్‌ భాగస్వామ్యంతో ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కింద తొలి ఏడాదిలో 10 నగరాల్లో ఆర్‌ఈవీలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఔషధాలు, క్విక్‌సర్వీసో రెస్టారంట్‌(క్యూఎస్‌ఆర్‌), సముద్రపు ఆహారం(రొయ్యలు, చేపల వంటివి), డెయిరీ, ఎఫ్‌ఎమ్‌సీజీ వస్తువులను ఉష్ణోగ్రత నియంత్రిత వాహనాలైన ఆర్‌ఈవీల్లో రవాణా చేయొచ్చు. మన దేశంలో నిలువ ఉంచే వస్తువులకు, ఔషధాలకు ఉష్ణోగ్రత నియంత్రిత రవాణా(టీసీఎల్‌) సేవల గిరాకీ పెరుగుతోందని అందుకు అనుగుణంగానే ఈ వాహనాలను తీసుకొచ్చినట్లు జెవో ఇండియా వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్య సింగ్‌ రత్ను పేర్కొన్నారు.


ఏడాది కనిష్ఠానికి సేవల రంగ వృద్ధి

దిల్లీ: నవంబరులో దేశీయ సేవల రంగ వృద్ధి ఏడాది కనిష్ఠానికి పడిపోయింది. కొత్త ఆర్డర్లు నెమ్మదించడం, ఉత్పత్తి తగ్గడం ఇందుకు కారణాలుగా ఓ సర్వే తెలిపింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సేవల వ్యాపార కార్యకలాపాల సూచీ అక్టోబరులో 58.4 పాయింట్ల వద్ద ఉండగా.. నవంబరులో 56.9 పాయింట్లకు దిగివచ్చింది. నెలవారీగా చూస్తే వృద్ధి తగ్గినట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. దీర్ఘకాలిక సగటు కంటే బలమైన వృద్ధే నమోదైంది. పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధి ఉన్నట్లుగా, 50 పాయింట్ల దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. ‘మూడో త్రైమాసికంలో భారత సేవల రంగం వృద్ధి మరింతగా నెమ్మదించింది. అయితే కొత్త ఆర్డర్లు అండతో మున్ముందు సేవలకు గిరాకీ పుంజుకోవడం కొనసాగుతుంది.  ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆశాభావం తగ్గుముఖం పట్టినప్పటికీ.. వ్యాపార పరంగా సానుకూల పరిస్థితే ఉంద’ని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వద్ద ఎకనమిక్‌ అసోసియేట్‌ డైరెక్టరు పాలియనా డె లిమా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని