యూకో బ్యాంక్‌ ఖాతాదారుల్లో డబ్బుల జమ కేసులో సీబీఐ తనిఖీలు

యూకో బ్యాంకుకు చెందిన 41,000 మంది ఖాతాదార్ల ఖాతాల్లోకి  మొత్తంగా రూ.820 కోట్లు జమ అయిన వ్యవహారంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది.

Published : 06 Dec 2023 02:12 IST

దిల్లీ: యూకో బ్యాంకుకు చెందిన 41,000 మంది ఖాతాదార్ల ఖాతాల్లోకి  మొత్తంగా రూ.820 కోట్లు జమ అయిన వ్యవహారంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. నవంబరు 10- 13 మధ్య జరిగిన ఈ ఘటనలో ఆశ్చర్యకరంగా ఏ ఖాతాల నుంచి నగదు బదిలీ జరిగిందో, ఆ ఖాతాల్లో డబ్బు డెబిట్‌ కాకపోవడం గమనార్హం. ఈ వ్యవహారానికి సంబంధించి కోల్‌కతా, మంగళూరు సహా పలు నగరాల్లోని 13 ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో ప్రైవేట్‌ బ్యాంకులకు చెందిన 14,000 ఖాతాల నుంచి 8.53 లక్షల ఐఎంపీఎస్‌ లావాదేవీల ద్వారా ఈ డబ్బులు యూకో బ్యాంకు ఖాతాదారుల ఖాతాల్లోకి వచ్చాయని తెలిపారు. ఈ డబ్బులను కొంత మంది వారి ఖాతాల నుంచి ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. దీనిపై ఇద్దరు సపోర్టు ఇంజినీర్లు, మరికొందరిపై యూకో బ్యాంకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. తనిఖీల్లో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ సిస్టమ్‌లు, ఇ-మెయిల్‌లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు లాంటి ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని