సంక్షిప్త వార్తలు

రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్‌లో 8% వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో విక్రయించడం ద్వారా రూ.1,100 కోట్ల నిధుల్ని ప్రభుత్వం సమీకరించబోతోంది.

Published : 07 Dec 2023 01:27 IST

నేటి నుంచే ఇర్కాన్‌లో వాటా విక్రయం
8% అమ్మకంతో రూ.1,100 కోట్ల సమీకరణ

దిల్లీ: రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్‌లో 8% వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో విక్రయించడం ద్వారా రూ.1,100 కోట్ల నిధుల్ని ప్రభుత్వం సమీకరించబోతోంది. రిటైల్‌యేతర మదుపర్లకు ఓఎఫ్‌ఎస్‌ గురువారం (నేడు) ప్రారంభం కాబోతోంది. రిటైల్‌ మదుపర్లు శుక్రవారం బిడ్లు దాఖలు చేయొచ్చు. గ్రీన్‌షూ ఆప్షన్‌ (స్పందన ఎక్కువగా ఉంటే మరింత వాటా విక్రయించే అవకాశం)తో కలిపి 8% ఈక్విటీని విక్రయించనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఒక్కో షేరుకు కనీస ధర రూ.154గా నిర్ణయించారు. మొత్తం 7.53 కోట్ల షేర్లను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఓఎఫ్‌ఎస్‌కు పూర్తి స్థాయిలో స్పందన లభిస్తే, ప్రభుత్వ ఖజానాకు రూ.1,100 కోట్లు జమయ్యే అవకాశం ఉంది. ఇర్కాన్‌లో ప్రభుత్వానికి ప్రస్తుతం 73.18 శాతం వాటా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈలు) మైనార్టీ వాటాలను విక్రయించడం ద్వారా రూ.8,859 కోట్లు సమీకరించింది.  


యాక్సిస్‌కేడ్స్‌ చేతికి ఎప్కోజెన్‌
ఈనాడు, హైదరాబాద్‌: ఇంధన రంగంలోని సంస్థలకు ఇంజినీరింగ్‌ డిజైనింగ్‌ పరిష్కారాలను అందించే హైదరాబాద్‌ సంస్థ ఎప్కోజెన్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేసినట్లు యాక్సిస్‌కేడ్స్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. దీనికోసం రూ.26.25 కోట్లు చెల్లించినట్లు బుధవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఈ సందర్భంగా యాక్సిస్‌కేడ్స్‌ సీఈఓ, ఎండీ అరుణ్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పశ్చిమాసియా, ఉత్తర అమెరికా దేశాల్లో ఎప్కోజెన్‌ విస్తరించిందని పేర్కొన్నారు. ఈ స్వాధీనత ద్వారా తమ సంస్థా అక్కడ అడుగు పెట్టినట్లవుతుందన్నారు. ప్రస్తుతం రూ.26.65 కోట్లు చెల్లించామని, మూడేళ్ల పనితీరు ఆధారంగా అదనంగా రూ.7 కోట్ల మేరకు చెల్లించేందుకు వీలుందని పేర్కొన్నారు.


 పీపీఎస్‌ మోటార్స్‌తో స్కానియా భాగస్వామ్యం

ఈనాడు, హైదరాబాద్‌: స్వీడన్‌కు చెందిన వాహన సంస్థ స్కానియా కమర్షియల్‌ వెహికిల్స్‌ లిమిటెడ్‌, గనుల్లో ఉపయోగించే టిప్పర్ల విక్రయాలు, ఇతర సేవల కోసం  హైదరాబాద్‌కు చెందిన పీపీఎస్‌ మోటార్స్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్కానియా మైనింగ్‌ టిప్పర్లను మన దేశంలో పీపీఎస్‌ మోటార్స్‌ విక్రయించనుంది. అత్యాధునిక సాంకేతికతతో వీటిని అందిస్తున్నట్లు స్కానియా కమర్షియల్‌ వెహికిల్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోహన్‌ పి ష్లిటర్‌ పేర్కొన్నారు. దేశంలో 6 ప్రాంతీయ గిడ్డంగులను పీపీఎస్‌ ఏర్పాటు చేసిందని, ఇవన్నీ గనుల ప్రాంతాలకు దగ్గరలో ఉన్నాయన్నారు. ఆధునిక వర్క్‌షాప్‌లనూ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


మహీంద్రా వాహనాల ధరలూ పెరగనున్నాయ్‌

దిల్లీ: ప్రయాణికులు - వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుంచి పెంచనున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా బుధవారం తెలిపింది. ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరల పెరుగుదల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పెరిగిన తయారీ వ్యయంలో కొంత మేరకు మాత్రమే, వాహన ధరల పెంపు రూపేణ కొనుగోలుదార్లకు బదిలీ చేస్తున్నట్లు వివరించింది.


చమురు బావుల కార్యకలాపాల్లో ఇక హరిత విద్యుత్‌ వినియోగం: ఓఎన్‌జీసీ

దిల్లీ: కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యంలో భాగంగా చమురు తవ్వకం, చమురు బావుల కార్యకలాపాల్లో హరిత విద్యుత్‌ వినియోగించుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ భావిస్తోంది. అరేబియా సముద్ర గర్భం నుంచి చమురును వెలికతీసే సమయంలో ఉత్పత్తి అయ్యే మీథేన్‌ గ్యాస్‌ను మండించడానికి వాడే సహజ వాయువు స్థానంలో హరిత విద్యుత్‌ను వినియోగించే ఉద్దేశంలో ఉన్నట్లు దుబాయ్‌లో జరుగుతున్న 28వ ఐక్యరాజ్యసమితి పర్యావరణమార్పు సదస్సు(కాప్‌28)లో ఓఎన్‌జీసీ ఛైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. చమురు-గ్యాస్‌ క్షేత్రంలో కంప్రెషన్‌, ఇతర ప్రక్రియలతో పాటు ఇతర అవసరాలకు విద్యుదుత్పత్తి నిమిత్తం భారీ స్థాయిలో గ్యాస్‌ను ఓఎన్‌జీసీ వినియోగిస్తోందన్నారు. ‘2028 కల్లా ఈ గ్యాస్‌ స్థానంలో హరిత విద్యుత్‌ వినియోగించాలని భావిస్తున్నాం. ఇలా మిగిలిన గ్యాస్‌ను ఎరువులు, విద్యుత్‌ ప్లాంట్లకు విక్రయిస్తామ’ని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు 2020Ëతో పోలిస్తే 2030 కల్లా 30 శాతం మీథేన్‌ ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో ఉన్నాయి. ‘మా కార్యకలాపాల్లో మీథేన్‌ ఉద్గారాలను సున్నాకు చేర్చడం ద్వారా పర్యావరణానికి మద్దతు పలకాలని భావిస్తున్న’ట్లు కుమార్‌ సింగ్‌ తెలిపారు.


రూ.8.22 లక్షల కోట్లకు దేశీయ ఎలక్ట్రానిక్స్‌ తయారీ

దిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ రూ.8.22 లక్షల కోట్ల స్థాయికి  చేరిందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ లోక్‌సభకు తెలిపారు. 2013-14లో దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ రూ.1,80,454 కోట్లు (29.8 బిలియన్‌ డాలర్లు)గా ఉండగా.. 2022-23కు దాదాపు 4 రెట్లు అధికమై రూ.8,22,350 కోట్ల (102 బి.డాలర్ల)కు చేరిందని అన్నారు. 2026కు తయారీ మరింత వృద్ధి చెంది రూ.23,95,195 కోట్ల (300 బి.డాలర్ల)కు చేరొచ్చని అంచనా వేశారు. దేశంలో వినియోగిస్తున్న మొబైల్‌ ఫోన్లలో 99.2 శాతం ఇక్కడే తయారవుతున్నాయని, 2014-15లో 74% ఫోన్లను దిగుమతి చేసుకునే వాళ్లమని, ప్రస్తుతం భారీగా ఎగుమతులూ చేస్తున్నట్లు చంద్రశేఖర్‌ వెల్లడించారు. 2022-23లో దేశం నుంచి 11.1 బి.డాలర్ల విలువైన మొబైల్‌ ఫోన్లు ఎగుమతి అయ్యాయని వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 25 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చాయని, 2025-26కు ఈ సంఖ్య కోటికి చేరొచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని