సుజుకీ మోటార్‌ గుజరాత్‌ నుంచి 30 లక్షల వాహనాల ఉత్పత్తి

మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కు కార్లు తయారు చేసే సుజుకీ మోటార్‌ గుజరాత్‌ (ఎస్‌ఎంజీ), ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది.

Published : 07 Dec 2023 01:29 IST

దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కు కార్లు తయారు చేసే సుజుకీ మోటార్‌ గుజరాత్‌ (ఎస్‌ఎంజీ), ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది. ఎస్‌ఎంజీ 2017  ఫిబ్రవరిలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించగా, 6 ఏళ్ల 11 నెలల్లో ఈ మైలురాయిని అధిగమించిందని పేర్కొంది. ఎస్‌ఎంజీ ఏడాదికి 7.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన వాహనాలను దేశీయంగా విక్రయించడమే కాకుండా, విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ‘సుజుకీ మోటార్‌ గుజరాత్‌ కొనుగోలుతో మా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తున్నాం. గుజరాత్‌ ప్లాంటులో మా బ్యాటరీ విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి కూడా 2024-25లో జరుగుతుందని ఆశిస్తున్నామ’ని ఎంఎస్‌ఐ ఎండీ, సీఈఓ హిసాషి టకుచి తెలిపారు. స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌, ఫ్రోంక్స్‌ వంటి ప్రముఖ మోడళ్లు ఈ ప్లాంటు నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 2022-23లో ఎస్‌ఎంజీలో ఉత్పత్తి చేసిన వాహనాల్లో సుమారు 50 శాతం ఎగుమతి చేశామని టకుచి తెలిపారు. సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ), జపాన్‌ నుంచి ఎస్‌ఎంజీ కొనుగోలుకు ఎంఎస్‌ఐ వాటాదార్లు ఇటీవలే ఆమోదం తెలిపారు. ఎస్‌ఎంజీ గతంలో ఎస్‌ఎంసీకి పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా ఉండగా, ప్రస్తుతం మారుతీ సుజుకీ యాజమాన్యంలోకి వచ్చింది.

విద్యుత్‌ ఎస్‌యూవీ ఉత్పత్తి గుజరాత్‌లోనే..

తమ సంస్థ త్వరలో తీసుకురాబోతున్న విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహన (ఇ-ఎస్‌యూవీ) ఉత్పత్తి కూడా గుజరాత్‌ ప్లాంటులోనే జరుగుతుందని మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్రస్తుత తయారీ ప్లాంటు ఉన్న హన్సాల్‌పుర్‌కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో కొత్త ప్లాంటును నెలకొల్పబోతున్నట్లు తెలిపింది. ‘మా తొలి ఇ- ఎస్‌యూవీని వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఇది ఎస్‌ఎంజీ గుజరాత్‌ ప్లాంటు నుంచే వస్తుంది. ప్రస్తుతం ఎస్‌ఎంజీ హన్సాల్‌పుర్‌లో ఎ, బి, సి అనే మూడు ప్లాంట్లున్నాయి. ఈవీల తయారీకి కొత్త ప్లాంటు కూడా సిద్ధమవుతోంద’ని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (కార్పొరేట్‌ వ్యవహారాలు) రాహుల్‌ భారతీ వెల్లడించారు. ఎస్‌ఎంజీ ప్లాంటులో ఉత్పత్తి చేయబోయే ఇ- ఎస్‌యూవీలను ఎగుమతి కూడా చేస్తామని పేర్కొన్నారు. 2022 మార్చిలో ఎస్‌ఎంజీ మాతృ సంస్థ సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌, గుజరాత్‌ ప్రభుత్వంతో కొత్త ప్లాంటు కోసం అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈవీల తయారీ కోసం హన్సాల్‌పుర్‌ ప్లాంటులో రూ.3,100 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు రాహుల్‌ తెలిపారు. మారుతీ ఈవీ కాన్సెప్ట్‌ను ఇప్పటికే ఆవిష్కరించింది. ఒక ఛార్జింగ్‌తో 550 కి.మీ. ప్రయాణించేలా 60 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో ఈ వాహనాన్ని తీసుకు రాబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని