కొనసాగిన రికార్డుల పరుగు

వరుసగా ఏడో రోజూ పరుగులు తీసిన సెన్సెక్స్‌, నిఫ్టీ.. తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ వంటి దిగ్గజ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించాయి.

Updated : 07 Dec 2023 06:58 IST

సమీక్ష

రుసగా ఏడో రోజూ పరుగులు తీసిన సెన్సెక్స్‌, నిఫ్టీ.. తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ వంటి దిగ్గజ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించాయి. విదేశీ కొనుగోళ్లు, ముడిచమురు ధరలు తగ్గడం మదుపర్ల సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.32 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.31% తగ్గి 76.96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు రాణించాయి.

మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ బుధవారం రూ.2.38 లక్షల కోట్లు పెరిగి రికార్డు గరిష్ఠమైన రూ.348.85 లక్షల కోట్లకు చేరింది. గత 7 ట్రేడింగ్‌ రోజుల్లో మదుపర్లు రూ.20.13 లక్షల కోట్ల లాభాన్ని పొందారు.

సెన్సెక్స్‌ ఉదయం 69,534.93 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. రోజంతా లాభాలు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 69,744.62 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 357.59 పాయింట్ల లాభంతో 69,653.73 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.60 పాయింట్లు రాణించి 20,937.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 20,961.95 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది.

వచ్చే 5-6 ఏళ్లలో తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు రూ.4,800 కోట్ల పెట్టుబడులు ప్రకటించడంతో హిమాద్రీ స్పెషాలిటీ కెమికల్‌ షేరు రూ.307.10 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.58% లాభంతో రూ.301.10 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 లాభపడ్డాయి. విప్రో 3.60%, ఐటీసీ 2.51%, ఎల్‌ అండ్‌ టీ 2.31%, టీసీఎస్‌ 2.08%, టాటా మోటార్స్‌ 1.99%, నెస్లే 1.45%, ఇన్ఫోసిస్‌ 1.40%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.04%, ఎం అండ్‌ ఎం 1.03%, రిలయన్స్‌ 0.95% పెరిగాయి. ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, ఎయిర్‌టెల్‌ 1.52% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్‌ 3%, విద్యుత్‌ 2.41%, చమురు-గ్యాస్‌ 1.96%, ఐటీ 1.48%, యంత్ర పరికరాలు 1.25%, టెక్‌ 1.18% మెరిశాయి. ఆరోగ్య సంరక్షణ, టెలికాం, బ్యాంకింగ్‌ మాత్రం డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో 1877 షేర్లు లాభపడగా, 1887 స్క్రిప్‌లు నష్టపోయాయి. 131 షేర్లలో ఎటువంటి మార్పులేదు.

అదానీ.. అదే జోరు: అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల జోరు బుధవారమూ కొనసాగింది. 2030 కల్లా హరిత ప్రాజెక్టులపై 75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతామని గ్రూప్‌ ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. అదానీ టోటల్‌ గ్యాస్‌ 19.98%, అదానీ గ్రీన్‌ 16.11%, అదానీ ఎనర్జీ 7.36%, ఎన్‌డీటీవీ 7.07%, సంఘీ ఇండస్ట్రీస్‌  4.97%, అదానీ విల్మర్‌ 4.11%, అదానీ పవర్‌ 4.09%, అదానీ పోర్ట్స్‌ 0.67% లాభపడ్డాయి. ఏసీసీ 2.59%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2.53%, అంబుజా సిమెంట్స్‌ 1.48% చొప్పున నష్టపోయాయి. 11 గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.63,769 కోట్లు పెరిగి రూ.14.54 లక్షల కోట్లుగా నమోదైంది. ఇక బ్లూమ్‌బర్గ్‌ ప్రపంచ సంపన్నుల సూచీలో గౌతమ్‌ అదానీ 15వ స్థానానికి చేరింది. ప్రస్తుతం ఆయన సంపద 82.5 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6.90 లక్షల కోట్ల)కు చేరింది. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 91.4 బిలియన్‌ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు.

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం: కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈనెల 8న ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సమావేశ నిర్ణయాలు ప్రకటించనున్నారు. గత నాలుగు సమావేశాల్లో ఆర్‌బీఐ రెపో రేట్లను యథాతథంగా ఉంచింది. ఈసారి కూడా ఇదే ధోరణి కొనసాగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హిందుస్థాన్‌ జింక్‌ డివిడెండ్‌ రూ.6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండ్‌గా రూ.6 చెల్లించేందుకు వేదాంతా గ్రూప్‌ సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.2,535.19 కోట్లు వెచ్చించనుంది.  

బీ2సీ లావాదేవీలకూ ఇ-ఇన్‌వాయిస్‌: వచ్చే 2-3 ఏళ్లలో బీ2సీ లావాదేవీలకూ సంస్థలు, ఎలక్ట్రానిక్‌ లేదా ఇ-ఇన్‌వాయిస్‌ జారీ చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయనుందని సీబీఐసీ సభ్యులు (జీఎస్‌టీ) శశాంక్‌ ప్రియా వెల్లడించారు. ప్రస్తుతం రూ.5 కోట్ల టర్నోవర్‌ సంస్థల బీ2బీ కొనుగోళ్లు, విక్రయాలకు మాత్రమే ఈ నిబంధన ఉంది.

నెట్‌వర్క్‌ 18 టీవీ, డిజిటల్‌ న్యూస్‌ విలీనం: తమ టీవీ, డిజిటల్‌ వార్తల వ్యాపారాన్ని ఏకీకరణ చేయనున్నట్లు నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌ ప్రకటించాయి. మనీ కంట్రోల్‌ వెబ్‌సైట్‌, యాప్‌లను నిర్వహిస్తున్న టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, ఇ-ఎయిటీన్‌.కామ్‌ (ఇ18)లు నెట్‌వర్క్‌ 18తో విలీనమయ్యేందుకు ఒక పథకాన్ని ప్రకటించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని