కార్లు, బైక్‌లకు భలే గిరాకీ

ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల)తో పాటు ద్విచక్ర వాహనాల (బైక్‌లు, స్కూటర్ల)కు లభించిన అధిక గిరాకీ వల్లే, నవంబరులో రికార్డు స్థాయిలో వాహన రిటైల్‌ విక్రయాలు సాగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది.

Published : 07 Dec 2023 01:37 IST

అందువల్లే నవంబరులో రికార్డు అమ్మకాలు

దిల్లీ: ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల)తో పాటు ద్విచక్ర వాహనాల (బైక్‌లు, స్కూటర్ల)కు లభించిన అధిక గిరాకీ వల్లే, నవంబరులో రికార్డు స్థాయిలో వాహన రిటైల్‌ విక్రయాలు సాగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. 2022 నవంబరులో మొత్తం 24,09,535 వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది అదే నెలలో 18% ఎక్కువగా 28,54,242 వాహనాలు రిటైల్‌గా అమ్ముడయ్యాయని వెల్లడించింది. ‘2020 మార్చిలో విక్రయించిన 25.69 లక్షల వాహనాలే ఇప్పటివరకు రికార్డుగా ఉండేవి. గత నెలలో 28.54 లక్షల వాహనాల విక్రయం ద్వారా కొత్త రికార్డు నమోదైంద’ని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌రాజ్‌ సింఘానియా తెలిపారు. అప్పటికంటే ద్విచక్ర వాహనాలంు 1.77 లక్షలు అధికంగా విక్రయమైనట్లు తెలిపారు. 2022 అక్టోబరులో అమ్మిన ప్రయాణికుల వాహనాల కంటే గత నెలలో 4,000 అధికంగా విక్రయించామన్నారు. పండుగ సెంటిమెంటు, కొత్త మోడళ్లు ఇందుకు కారణమని విశ్లేషించారు. అయితే పండగల తరవాత వాహన రిటైల్‌ విక్రయాలు నిదానించడంతో, డీలర్ల వద్ద నిల్వలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

పెళ్లిళ్లు కలిసొస్తాయ్‌: గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ద్విచక్ర వాహనాలకు గిరాకీ బాగుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల వివాహాలు జరుగుతున్నందున, వాహనాలకు గిరాకీ పెరిగేందుకు కారణమవుతుందని పేర్కొన్నారు. పంటల దిగుబడి బాగుంటే, పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుందన్నారు. సిమెంటు, బొగ్గు రవాణాకు గిరాకీకి తోడు, ఎన్నికల తరవాత వ్యాపార కార్యకలాపాలు మెరుగవుతాయనే అంచనా వల్ల వాణిజ్య వాహనాల అమ్మకాలూ పెరుగుతాయనే ధీమా వ్యక్తం చేశారు. కొన్ని ప్రయాణికుల వాహనాల నిల్వలు 60 రోజుల అవసరాలకు మించి ఉన్నందున, గిరాకీ ఉన్న మోడళ్ల ఉత్పత్తిపై కంపెనీలు దృష్టి సారించాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని