ఏఎల్‌ఎస్‌ వ్యాధికి నూతన ఔషధం

నరాల వ్యాధులకు సంబంధించిన ఒక బయోలాజికల్‌ మిశ్రమ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసి వివిధ దేశాల్లో విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అమెరికాలోని టెక్సాస్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోయ థెరప్యూటిక్స్‌ ఇంక్‌., అనే బయోటెక్నాలజీ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 07 Dec 2023 01:39 IST

కోయ థెరప్యూటిక్స్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: నరాల వ్యాధులకు సంబంధించిన ఒక బయోలాజికల్‌ మిశ్రమ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసి వివిధ దేశాల్లో విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అమెరికాలోని టెక్సాస్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోయ థెరప్యూటిక్స్‌ ఇంక్‌., అనే బయోటెక్నాలజీ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం కోయ థెరప్యూటిక్స్‌కు చెందిన ‘కోయ 302’ అనే ‘ఇన్వెస్టిగేషనల్‌ కాంబినేషన్‌ థెరపీ’ అభివృద్ధి, విక్రయ హక్కులు డాక్టర్‌ రెడ్డీస్‌కు లభిస్తాయి. అమెరికాతో పాటు కెనడా, ఐరోపా సమాఖ్య, యూకే దేశాల్లో ఈ బయోలాజికల్‌ ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ విక్రయించే అవకాశం ఏర్పడుతుంది. జపాన్‌, మెక్సికోతో పాటు దక్షిణ అమెరికా దేశాల్లో విక్రయ హక్కులు మాత్రం కోయ థెరప్యూటిక్స్‌కు ఉంటాయి. అమయోట్రాపిక్‌ లేటరల్‌ స్కెలరోసిస్‌ (ఏఎల్‌ఎస్‌) అనే నరాల వ్యాధిని ఈ మందుతో చికిత్స చేస్తారు. కోయ 302 ప్యాక్‌లో తక్కువ డోసు ఐఎల్‌-2, సీటీఎల్‌ఏ- 4 ఎల్‌జీ (అబటాసెప్ట్‌) మందులు ఉంటాయి.

రూ.62 కోట్ల చెల్లింపులు: ‘కోయ 302’ మిశ్రమ ఔషధానికి సంబంధించిన హక్కుల కోసం ఇప్పటికిప్పుడు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ దాదాపు 7.5 మిలియన్‌ డాలర్లను (రూ.62 కోట్లు) కోయ థెరప్యూటిక్స్‌కు చెల్లిస్తుంది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి లభించిన తర్వాత మరో 4.2 మిలియన్‌ డాలర్లు (రూ.35 కోట్లు) చెల్లించాల్సి వస్తుంది. ఆ తర్వాత అమ్మకాల  లక్ష్యాలకు అనుగుణంగా 677.25 మిలియన్‌ డాలర్ల వరకు డాక్టర్‌ రెడ్డీస్‌ చెల్లించాల్సి ఉంది.

చికిత్సా విధానాలు పెంచేందుకు కృషి:  ఏఎల్‌ఎస్‌ వ్యాధితో బాధపడేవారికి ప్రస్తుతం పరిమిత చికిత్సలు మాత్రమే ఉన్నాయని.. కోయ థెరప్యూటిక్స్‌తో కలిసి నూతన చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఉత్తర  అమెరికా సీఈఓ మార్క్‌ చికుచి అన్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఔషధంతో 150 కోట్ల మందికి చేరువ కావాలనేది తమ లక్ష్యమని తెలిపారు. ‘కోయ 302’ ఔషధంపై రెండో దశ క్లినికల్‌ పరీక్షల నిర్వహణ నుంచి దీనికి పూర్తిస్థాయి అనుమతులు సంపాదించే క్రమంలో డాక్టర్‌ రెడ్డీస్‌తో భాగస్వామ్యం ఎంతగానో ఉపకరిస్తుందని కోయ థెరప్యూటిక్స్‌ సీఈఓ డాక్టర్‌ హోవార్డ్‌ బెర్మన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని