గోఫస్ట్‌ కథ కంచికేనా?

దేశీయ విమానయాన కంపెనీల్లో మరో సంస్థ కథ కంచికి చేరినట్లే!.. ఈ ఏడాది మే 2న విమాన సర్వీసులు నిలిపేసి.. స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన గోఫస్ట్‌.. ఇక ఎగరకపోవచ్చు.

Updated : 07 Dec 2023 07:29 IST

ఆస్తుల విక్రయానికి త్వరలో రుణదాతల ఆమోదం
రూ.3,000 కోట్లు పొందే అవకాశం

దేశీయ విమానయాన కంపెనీల్లో మరో సంస్థ కథ కంచికి చేరినట్లే!.. ఈ ఏడాది మే 2న విమాన సర్వీసులు నిలిపేసి.. స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన గోఫస్ట్‌.. ఇక ఎగరకపోవచ్చు. వాడియా గ్రూప్‌ అధిపతి నస్లీ వాడియా స్థాపించిన ఈ కంపెనీ నగదీకరణ ప్రతిపాదనకు, రుణదాతలు అనుమతి ఇవ్వనున్నారని సమాచారం. ఒక వారం వ్యవధిలోనే కంపెనీ లిక్విడేషన్‌కు ఆమోదం లభించే అవకాశం ఉందని ఈ అంశాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

బకాయిలు ఎంతంటే..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, డాయిష్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌ తదితర బ్యాంకులకు గోఫస్ట్‌ రూ.6,521 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. విమాన లీజుదార్లు, సరకు సరఫరాదార్లు, ట్రావెల్‌ ఏజెంట్లు, వినియోగదార్లు, కేంద్రం.. తదితరాలకూ చెల్లించాల్సిన బకాయిలు, రిఫండ్‌లు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం బకాయిలు రూ.11,000 కోట్లకు చేరుతాయి.

గడువు చివరికి రావడంతోనే..

దివాలా పరిష్కార ప్రణాళిక దరఖాస్తుకు గడువు పెంచరాదన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అందువల్ల త్వరలోనే నగదీకరణా జరుగుతుందని ఒక బ్యాంకరు తెలిపారు. గోఫస్ట్‌ రిజొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (పరిష్కార నిపుణుడు) శైలేంద్ర అజ్మేరా, కమిటీ ఆఫ్‌ క్రెడిటర్స్‌ (సీఓసీ) మధ్య జరుగుతున్న చర్చల గురించి అవగాహన ఉన్న విమానయాన సంస్థ అధికారులు సైతం.. కంపెనీ ఆస్తుల విలువను రూ.3,000 కోట్లుగా సీఓసీ లెక్కగట్టినట్లు తెలిపారు. ‘దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఉన్న 270 రోజుల గడువు చివరకు వచ్చేశాం. కాబట్టి ఈ వారంలోనే నగదీకరణకు సీఓసీ మొగ్గుచూపొచ్చ’ని ఒక అధికారి తెలిపారు. గోఫస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆసక్తి వ్యక్తీకరణ చర్చల్లో ముందుకొచ్చిన కొన్ని సంస్థలు ఇపుడు వెనక్కి తగ్గాయి. ‘గోఫస్ట్‌కు సొంత విమానాలు లేవు. బ్రాండ్‌కు, సంస్థకు పునరుజ్జీవం పోయడం అసాధ్యమైన పనిగా భావించడమే ఇందుకు కారణమ’ని మరొక అధికారి తెలిపినట్లు ఆ కథనం వెల్లడించింది.

నగదీకరణ జరిగితే.. ఈ విమానయాన కంపెనీ ఇక రెక్కలు విదల్చడం అసాధ్యమనే చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు