సంక్షిప్త వార్తలు

ఇటీవలి కొద్ది నెలలుగా భారత అంకురాల్లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ తన వాటాలుతగ్గించుకుంటూ వస్తోంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే జొమాటోలో కూడా రూ.1,125.5 కోట్ల (135 మిలియన్‌ డాలర్ల) విలువైన షేర్లను సాఫ్ట్‌బ్యాంక్‌ విక్రయించనుందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

Published : 08 Dec 2023 01:27 IST

జొమాటోలో సాఫ్ట్‌బ్యాంక్‌ వాటా విక్రయం!

దిల్లీ: ఇటీవలి కొద్ది నెలలుగా భారత అంకురాల్లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ తన వాటాలుతగ్గించుకుంటూ వస్తోంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే జొమాటోలో కూడా రూ.1,125.5 కోట్ల (135 మిలియన్‌ డాలర్ల) విలువైన షేర్లను సాఫ్ట్‌బ్యాంక్‌ విక్రయించనుందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఈ వాటాను ఎవరు కొనుగోలు చేస్తున్నారన్న విషయం తెలియరాలేదు. అక్టోబరు ప్రారంభంలోనూ తన అనుబంధ సంస్థ ఎస్‌వీఎఫ్‌ గ్రోత్‌ సింగపూర్‌ ద్వారా జొమాటోలో 1.09 శాతం వాటాను రూ.1,040.5 కోట్లకు సాఫ్ట్‌బ్యాంక్‌ విక్రయించింది. ఆగస్టులో కూడా 1.17 శాతం వాటాను అమ్మింది. సెప్టెంబరు చివరికి జొమాటోలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 2.17 శాతం వాటా ఉందని సమాచారం.

ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జొమాటో షేరు విలువ 102 శాతం పెరిగి రూ.121.70కి చేరింది. అయితే తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన రూ.169కి ఇంకా దూరంలోనే ఉంది.


ఇర్కాన్‌ షేర్ల విక్రయానికి మంచి స్పందన

రూ.2,400 కోట్ల విలువైన బిడ్లు దాఖలు

దిల్లీ: ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌లో 8 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1,100 కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం గురువారం ప్రారంభించిన ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)కు సంస్థాగత మదుపర్ల నుంచి మంచి స్పందన లభించింది.     రూ.2,400 కోట్లకు పైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి. నేడు (శుక్రవారం) రిటైల్‌ మదుపర్లు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. ప్రభుత్వం మొత్తం 7.53 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు, ఒక్కో షేరుకు రూ.154 కనీస ధర నిర్ణయించింది. రిటైల్‌యేతర మదుపర్లకు కేటాయించిన 3.38 కోట్ల షేర్లకు గాను, గురువారం 4.63 రెట్లు అంటే 15.65 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఈ బిడ్ల ఇండికేటివ్‌ ధర  రూ.157.24. ఈ ధర వద్ద బిడ్ల విలువ రూ.2,400 కోట్లకు పైమాటే. ప్రస్తుతం ప్రభుత్వానికి ఇర్కాన్‌లో 73.18 శాతం వాటా ఉంది. ఇర్కాన్‌ షేరు బీఎస్‌ఈలో 6.54% తగ్గి రూ.160.75 వద్ద ముగిసింది.


ఐఐఎఫ్‌ఎల్‌కు ఊరట

దిల్లీ: ఖాతాదార్ల నిధులను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై, రెండేళ్ల పాటు కొత్త ఖాతాదార్లను చేర్చుకోవద్దని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ను ఆదేశిస్తూ, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇచ్చిన ఆదేశాలను, సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) పక్కన పెట్టింది. ఐఐఎఫ్‌ఎల్‌పై విధించిన రూ.కోటి జరిమానాను కూడా రూ.20 లక్షలకు తగ్గించింది. గత జూన్‌లో సెబీ ఇచ్చిన ఆదేశాలను ఐఐఎఫ్‌ఎల్‌ (గతంలో ఇండియా ఇన్ఫోలైన్‌ లిమిటెడ్‌) సవాలు చేయగా, శాట్‌ గురువారం ఈ ఆదేశాలిచ్చింది. నిధుల దుర్వినియోగం జరగలేదని శాట్‌ పేర్కొంది.


2026 కల్లా జీడీపీలో డిజిటల్‌ వాటా 20%  

కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

గాంధీనగర్‌: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వాటా 2026 కల్లా 20 శాతానికి చేరగలదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు. గురువారమిక్కడ జరిగిన ‘స్టార్టప్‌ కాంక్లేవ్‌ 2023’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ‘2014లో జీడీపీలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వాటా 4.5 శాతంగా ఉండేది. ఇపుడు 11 శాతానికి చేరింది. 2026 కల్లా అది జీడీపీలో 20 శాతానికి చేరగలద’ని పేర్కొన్నారు. 2015లో ‘డిజిటల్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించి, లక్ష్యాలను నిర్దేశించారు. అవి చేరుకునే క్రమంలో.. మన ఆర్థిక వ్యవస్థలో పరిమాణం - నాణ్యత పరంగా మార్పు కనిపిస్తోంది. ఆ మార్పు ప్రపంచంలో మనకూ ఒక స్థానాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారింద’న్నారు. అవచ్చే దశాబ్దం అంకురాలకు, ఆవిష్కరణలకు అత్యుత్తమ కాలంగా మారనుందని ఆయన అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు