స్టార్‌బక్స్‌కు రూ.91,500 కోట్ల నష్టం

సియాటెల్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్‌బక్స్‌ కార్పొరేషన్‌ ఆదాయంపై, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం వేగంగా కనిపించింది. విక్రయాలు తగ్గడంతో, సుమారు 11 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.91,500 కోట్ల) మేర విలువను కంపెనీ నష్టపోయింది.

Published : 08 Dec 2023 01:32 IST

పేలవ అమ్మకాలు, బాయ్‌కాట్‌ల నేపథ్యం

హౌస్టన్‌: సియాటెల్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్‌బక్స్‌ కార్పొరేషన్‌ ఆదాయంపై, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం వేగంగా కనిపించింది. విక్రయాలు తగ్గడంతో, సుమారు 11 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.91,500 కోట్ల) మేర విలువను కంపెనీ నష్టపోయింది. నవంబరు 16న రెడ్‌ కప్‌ డే ప్రమోషన్‌ దగ్గర నుంచి 19 రోజుల్లో స్టార్‌బక్స్‌ షేరు విలువ 8.96 శాతం క్షీణించింది. కంపెనీ మొత్తం విలువలో ఇది 9.4 శాతం కావడం గమనార్హం. ఇది సుమారు 11 బిలియన్‌ డాలర్ల నష్టానికి సమానం. విక్రయాలు నెమ్మదించడం, సెలవు సీజనులో ఆఫర్లకు స్పందన స్తబ్దుగా ఉండటం ఇందుకు కారణమైంది. పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ స్టార్‌బక్స్‌ ఉద్యోగుల సంఘం ట్వీట్‌ చేసిన నేపథ్యంలో, స్టార్‌బక్స్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ సియాటెల్‌లో పలువురు   పిలుపునివ్వడం కూడా, కంపెనీ షేరు ధరపై ప్రభావం చూపింది. స్టార్‌బక్స్‌ షేరు వరుసగా 12 రోజులుగా నష్టపోతూనే ఉంది. 1992లో స్టార్‌బక్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాక, ఇన్ని వరుస రోజుల్లో షేరు నష్టపోవడం ఇప్పుడే. ప్రస్తుతం స్టార్‌బక్స్‌ షేరు 95.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఏడాది గరిష్ఠమైన 115 డాలర్లతో పోలిస్తే 20 డాలర్ల వరకు నష్టపోయింది. అంతర్జాతీయంగా సున్నిత అంశాల విషయంలో భిన్న అభిప్రాయాలు నెలకొన్నందున బ్రాండ్‌ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని కంపెనీ తెలిపింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై ఆశాభావంతో ఉన్నట్లు స్టార్‌బక్స్‌ సీఈఓ లక్ష్మణ్‌ నరసింహన్‌ తెలిపారు. సూక్ష్మ ఆర్థిక సవాళ్లు, వినియోగదార్ల అభిరుచుల్లో మార్పులు లాంటివి ఉన్నప్పటికీ.. వినియోగదార్లను తమ వైపు తిప్పుకునే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని