ఏడు రోజుల జోరుకు విరామం

సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్‌బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు.

Updated : 08 Dec 2023 02:47 IST

సమీక్ష

సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్‌బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 83.36 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 69,694.15 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ, ఇంట్రాడేలో 69,320.53 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 132.04 పాయింట్లు కోల్పోయి 69,521.69 వద్ద ముగిసింది. నిఫ్టీ 36.55 పాయింట్లు తగ్గి 20,901.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 20,850.80- 20,941.25 పాయింట్ల మధ్య కదలాడింది.

  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 2.46%, హెచ్‌యూఎల్‌ 1.80%, టాటా స్టీల్‌ 1.37%, ఐటీసీ 1.06%, ఎల్‌ అండ్‌ టీ 0.91%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 0.63% డీలాపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌, టైటన్‌, ఎన్‌టీపీసీ, మారుతీ, ఎస్‌బీఐ 2.43% వరకు లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ, టెక్‌ 0.85% మేర పడ్డాయి. యుటిలిటీస్‌ 3.16%, విద్యుత్‌ 2.67%, సేవలు 1.63%, మన్నికైన వినిమయ వస్తువులు 1.22%, చమురు-గ్యాస్‌ 1% రాణించాయి.  
  • పేటీఎం ఢమాల్‌: పెద్ద రుణాలపై దృష్టి పెట్టి, రూ.50,000 లోపు రుణాల జారీలో నెమ్మదిస్తామని ప్రకటించడంతో పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు ఇంట్రాడేలో 20% కుదేలై రూ.650.65 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. చివరకు 18.69% నష్టంతో రూ.661.30 వద్ద ముగిసింది.
  • రూ.లక్ష కోట్ల క్లబ్‌లో టాటా పవర్‌: బ్రోకరేజీ సంస్థ జేఎం ఫైనాన్షియల్‌ రేటింగ్‌ పెంచడంతో, టాటా పవర్‌ షేరు ఇంట్రాడేలో రూ.332 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 10.76% లాభంతో రూ.325.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.04 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ ఘనత సాధించిన టాటా గ్రూప్‌ సంస్థల్లో ఇది ఆరోది. ఇప్పటికే టీసీఎస్‌, టైటన్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ట్రెంట్‌ సంస్థలు రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్‌ విలువ సాధించాయి.
  • ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో తాజా నిధుల సమీకరణ అవకాశాలను పరిశీలించేందుకు ఈ నెల 11న స్పైస్‌జెట్‌ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది. 100 మి.డాలర్ల వరకు సమీకరించేందుకు కంపెనీ చూస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
  • భారత విపణిలో వినియోగానికి అంతర్జాతీయ అగ్రిసైన్స్‌ కంపెనీ సింజెంటా నుంచి హెర్బిసైడ్‌ ట్రేడ్‌మార్క్‌ ‘గ్రామోక్సోన్‌’ను కొనుగోలు చేసినట్లు క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ తెలిపింది.
  • 14.5 కోట్లకు విమాన ప్రయాణికులు: 2014లో 6 కోట్లుగా ఉన్న దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య.. ప్రస్తుతం 14.5 కోట్లకు చేరిందని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. రైల్వే ఏసీ మొదటి తరగతి ఛార్జీలకు పోటీగా విమానఛార్జీలు ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. విమాన ఛార్జీలు భారీగా పెరిగాయని లోక్‌సభలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా, ఆయన ఈ సమాధానం ఇచ్చారు. పౌరవిమానయాన రంగం నియంత్రణరహిత రంగమని, కొవిడ్‌-19 సంక్షోభం, విమాన ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో విమానఛార్జీలు పెరగలేదని స్పష్టం చేశారు. 2030కి విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం కంటే మూడు రెట్లు పెరిగి 42 కోట్లకు చేరొచ్చన్నారు.
  • ఎల్‌ఐసీ షేరు గురువారం ఇంట్రాడేలో 7% వరకు దూసుకెళ్లి రూ.799.90 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. దీంతో మళ్లీ రూ.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ సాధించింది. చివరకు 5.34% లాభంతో రూ.785.50 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4.96 లక్షల కోట్లుగా నమోదైంది.
  • డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ధరల శ్రేణి రూ.750- 790: దేశంలోనే పెన్సిళ్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ ఈనెల 13న ప్రారంభమై 15న ముగియనుంది. షేరుకు ధరల శ్రేణిగా రూ.750- 790ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1200 కోట్లు సమీకరించనుంది.
  • 2017-18లో  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆడిట్‌కు సంబంధించిన కేసులో ఇద్దరు ఆడిటర్లపై 10 ఏళ్ల వరకు నిషేధం, మొత్తం రూ.10 లక్షల జరిమానాను నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) విధించింది.
  • ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు రూ.63 కోట్ల ఆర్డరు: హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు, ముంబయిలోని వసాయి-విరార్‌ సిటీ మున్సిపల్‌ కార్పొ¸రేషన్‌ నుంచి 40 విద్యుత్తు బస్సుల సరఫరా, నిర్వహణ ఆర్డరు లభించింది. ఈ ఆర్డరు విలువ రూ.62.80 కోట్లు.

నాట్కో చెన్నై యూనిట్‌పై తుపాను ప్రభావం

చెన్నై నగరాన్ని తుపాను వరదలు ముంచెత్తడంతో అక్కడ వివిధ వ్యాపార సంస్థల కార్యకలాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెన్నైలోని నాట్కో ఫార్మా యూనిట్లో నీరు చేరడంతో, మందుల ఉత్పత్తి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంస్థ గురువారం బీఎస్‌ఈకి వెల్లడించింది. నీటిని తొలగించడానికి, ఉత్పత్తి కార్యకలాపాలు సాధ్యమైనంత త్వరగా తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నాట్కో ఫార్మా పేర్కొంది. ఈ యూనిట్లో కేన్సర్‌ ముందులకు అవసరమైన ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) లను ఉత్పత్తి చేస్తున్నారు.
డాక్టర్‌ రెడ్డీస్‌ బాచుపల్లి యూనిట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు: డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన హైదరాబాద్‌ శివార్లలోని బాచుపల్లి ఆర్‌అండ్‌డీ యూనిట్‌ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ప్రతినిధి బృందం తనిఖీ చేస్తోంది. ఈ విషయాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ బీఎస్‌ఈకి వెల్లడించింది. తనిఖీ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలియజేస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు