సంస్థల్లో నియామకాలు 12% తగ్గాయ్‌

వేర్వేరు రంగాల కార్యాలయాల్లో నైపుణ్యంతో కూడిన (వైట్‌-కాలర్‌) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్‌లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా,  ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది.

Updated : 08 Dec 2023 03:03 IST

నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ నివేదిక

దిల్లీ: వేర్వేరు రంగాల కార్యాలయాల్లో  నైపుణ్యంతో కూడిన (వైట్‌-కాలర్‌) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్‌లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా,  ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది. ఐటీ-సాఫ్ట్‌వేర్‌, టెలికాం, విద్యా రంగాల్లో ఉద్యోగ నియామకాలు తగ్గాయని పేర్కొంది. టెలికాంలో 18%, విద్యారంగంలో 17%, రిటైలింగ్‌లో 11% చొప్పున నియామక పోస్టింగులు తగ్గాయని వివరించింది. ఆతిథ్యం, ప్రయాణ, వాహన, వాహన విడిభాగాల రంగాల్లో నియామకాలు స్తబ్దుగా సాగాయని నివేదిక తెలిపింది.

వీటిల్లో పెరిగాయ్‌: చమురు-గ్యాస్‌ రంగాల్లో 9%,  ఔషధ రంగంలో 6%, బీమా రంగంలో 5% చొప్పున కొత్త ఉద్యోగాలు వృద్ధి చెందాయని పేర్కొంది. ఐటీయేతర రంగాలైన చమురు-గ్యాస్‌, ఔషధ, బీమా రంగాలు పండుగ సీజన్‌లో ఆరోగ్యకర వృద్ధి సాధించాయని తెలిపింది. ఐటీ రంగంలో 22% ఉద్యోగాలు తగ్గాయని నౌకరీ.కామ్‌ ముఖ్య వ్యాపార అధికారి పవన్‌ గోయల్‌ వెల్లడించారు. అయితే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రంగాలైన మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌, ఫుల్‌ స్టాక్‌ డేటా శాస్త్రవేత్తల ఉద్యోగాలు వరుసగా 64%, 16% చొప్పున పెరిగాయని నివేదిక తెలిపింది.

నగరాల వారీగా..: మెట్రోయేతర నగరాల్లోనే అధికంగా నియామకాలు జరిగాయని నౌకరీ.కామ్‌ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. వడోదరలో 9% వృద్ధి కనిపించింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి వంటి మెట్రో నగరాల్లో 12% క్షీణత నమోదైంది. ఐటీ ఆధారిత నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, పుణెలలో వరుసగా 20%, 18%, 21%, 18 శాతం చొప్పున నియామక పోస్టింగులు తగ్గాయి. 16 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్‌ వృత్తి నిపుణులకు గత రెండు నెలల్లో గిరాకీ 26% పెరిగింది. ఇదే సమయంలో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్లు) విభాగంలో 13% క్షీణత కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు