వచ్చే బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలుండవు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్‌లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్‌ ఎకనమిక్‌ పాలసీ ఫోరమ్‌లో మంత్రి తెలిపారు.

Updated : 08 Dec 2023 07:27 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

దిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్‌లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్‌ ఎకనమిక్‌ పాలసీ ఫోరమ్‌లో మంత్రి తెలిపారు. ‘కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేవరకు ప్రభుత్వ వ్యయాల అవసరాల కోసమే ఫిబ్రవరిలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతాం. అందువల్ల అద్భుతమైన ప్రకటనలేవీ ఉండవ’ని మంత్రి వెల్లడించారు. 2019 ఎన్నికల సమయంలో అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు చేపట్టిన పీయూష్‌ గోయల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి రావడంతో, ఆర్థిక మంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్‌ 2019 జులై 5న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అత్యంత వేగవంత వృద్ది మనదే: వ్యాపార కార్యకలాపాల పరంగా, రంగాలన్నీ రాణిస్తుండటంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మనజోరు  కొనసాగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో తెలిపారు.  2014 మే నుంచి మోదీ ప్రభుత్వం సాధించిన పలు విజయాలను ఆమె ప్రస్తావించారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి చాలా ఎక్కువగా నమోదైంది. ప్రపంచంలోనే ఇదే అత్యధికం. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మున్ముందూ ఆ ధోరణి కొనసాగిస్తామ’ని సీతారామన్‌ తెలిపారు. 2014లో విలువ పరంగా ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, కేవలం ఎనిమిదేళ్లలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినట్లు గుర్తు చేశారు. ‘అన్ని రంగాలూ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఆ వృద్ధి మనకు కనిపిస్తోంది కూడా’ అని పేర్కొన్నారు.

కీలకంగా తయారీ..: ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో తయారీ రంగమూ కీలక పాత్ర పోషిస్తోందని నిర్మలా సీతారామన్‌ వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలో తయారీరంగ పరంగా అధిక డిమాండు ఉన్న రెండో గమ్యస్థానంగా భారత్‌ ఉందని మంత్రి స్పష్టం చేశారు. నవంబరు 9 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 21.82 శాతం పెరగ్గా, జీఎస్‌టీ నెలవారీ సగటు వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లుగా నమోదవుతున్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది సంకేతమని తెలిపారు. 2017-18లో నిరుద్యోగ రేటు 17.8 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 10 శాతానికి తగ్గిందని తెలిపారు. గత అయిదేళ్లలో సుమారు 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని మంత్రి స్పష్టం చేశారు.  ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు.

ఆ నిర్ణయం సరికాదు: పర్యావరణహిత లక్ష్యాల సాధన నిమిత్తం దిగుమతి (బోర్డర్‌ అడ్జస్ట్‌మెంట్‌) పన్ను విధించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు తీసుకున్న నిర్ణయం నైతికంగా సరికాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  ‘హరిత లక్ష్యాల సాధనకు అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లేలా అంతర్జాతీయ సమాజం ఆలోచించాలి. అంతేకాని దిగుమతి పన్ను విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాద’ని ఆమె తెలిపారు. ‘మీరు పర్యావరణహిత ఉత్పత్తులు తీసుకు రానందున, నా దేశ పరిశ్రమ పర్యావరణహితంగా ఉండేందుకు మీ మీద నేను పన్ను విధిస్తాను. ఆ డబ్బులతో నా పరిశ్రమను పర్యావరణహితంగా మారుస్తాననే’ అభివృద్ధి చెందిన దేశాల ఆలోచన సరికాదు. ఇది వర్ధమాన దేశాలకు వ్యతిరేకమని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని