‘పేటీఎమ్‌’పై నిషేధం ఇందుకేనా?

పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌)లో అంతర్గత నష్టభయ నిర్వహణ (ఇంటర్నల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌)లో ఇబ్బందులున్నాయంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పలుమార్లు హెచ్చరించినా.. వాటిని సరిచేయడంలో కంపెనీ విఫలమైందని తెలుస్తోంది.

Updated : 10 Feb 2024 06:48 IST

పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌)లో అంతర్గత నష్టభయ నిర్వహణ (ఇంటర్నల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌)లో ఇబ్బందులున్నాయంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పలుమార్లు హెచ్చరించినా.. వాటిని సరిచేయడంలో కంపెనీ విఫలమైందని తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తుల (పీఈపీలు) జోక్యం ఉన్న లావాదేవీల విషయంలో కంపెనీ పెద్దగా స్పందించనందునే, ఈనెల 29 తరవాత ముఖ్య కార్యకలాపాలు జరపకుండా ఆర్‌బీఐ నిషేధించిందని.. ఈ పరిణామాలతో సంబంధమున్న ఇద్దరిని ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. సాధారణంగా పీఈపీలు రాజకీయ నాయకులతో లేదా సీనియర్‌ అధికారులతో సంబంధమున్న వారై ఉంటారు.

పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ జరిపిన ఆడిట్‌లో.. కంపెనీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలో పలు లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది. పీఈపీలను చేర్చుకోవడంలో సరైన విధానాలను పాటించలేదని సమాచారం. పీఈపీలను పర్యవేక్షించడానికి సరైన వ్యవస్థ లేకపోవడమే కాదు.. అనుమానాస్పద లావాదేవీల విషయాన్ని ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌(ఎఫ్‌ఐయూ)కు నివేదించడంలోనూ పీపీబీఎల్‌ విఫలమైందనీ అంటున్నారు. ఆర్‌బీఐ పరిశీలనలు ఏ ఒక్క పీఈపీని లక్ష్యం చేసుకోలేదని.. కేవలం బ్యాంక్‌లో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ను చక్కదిద్దడంపైనే ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై పేటీఎమ్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘నియంత్రణపరమైన మార్గదర్శకాలను పాటించడానికి మా వద్ద సరైన వ్యవస్థ, ప్రక్రియ ఉంద’ని చెప్పుకొచ్చారు.

సలహా కమిటీ ఏర్పాటు: పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ నిషేధం నేపథ్యంలో, సెబీ మాజీ ఛైర్మన్‌ ఎం. దామోదరన్‌ ఆధ్వర్యంలో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేటీఎమ్‌ బ్రాండ్‌ యజమాని ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది. కంపెనీలో నిబంధనలు పాటించడం, నియంత్రణ అంశాలపై సలహా ఇస్తుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో పేటీఎం శుక్రవారం పేర్కొంది. ఆంధ్రా బ్యాంక్‌ మాజీ ఎండీ ఆర్‌ రామచంద్రన్‌, ఐసీఏఐ మాజీ ప్రెసిడెంట్‌ ఎం.ఎం. చితాలే ఈ కమిటీలో ఉన్నారు.

పీపీబీఎల్‌ బోర్డు నుంచి ఇద్దరు బయటకు: ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు పీపీబీఎల్‌ బోర్డు నుంచి రాజీనామా చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, పీడబ్ల్యూసీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ షింజిని కుమార్‌, ఎస్‌బీఐ మాజీ డిప్యూటీ ఎండీ మంజు అగర్వాల్‌ ఈ జాబితాలో ఉన్నట్లు ఒక ఆంగ్ల వార్తా పత్రిక తన కథనంలో వెల్లడించింది. ఇప్పటికే షింజిని రాజీనామాకు ఆమోదం లభించిందని, బదులుగా మరొకరిని ఎంపిక చేశారని తెలిపింది.

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో సందడి: వినియోగదారు ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లలో ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్‌/టాపప్‌ చేయకూడదంటూ పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ నిషేధం విధించిన తర్వాత ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో సందడి పెరిగింది. కొద్ది రోజులుగా బ్యాంక్‌ ఖాతాలు, ఫాస్టాగ్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగిందని కంపెనీ సీఈఓ అనుబ్రత బిస్వాస్‌ పేర్కొన్నారు. జనవరితో పోలిస్తే ఇవి 5-7 రెట్లు పెరిగాయని తెలిపారు.

పేటీఎమ్‌ ఇ-కామర్స్‌ పేరు మార్పు: పేటీఎమ్‌ ఇ-కామర్స్‌ తన పేరును పాయ్‌ ప్లాట్‌ఫామ్స్‌గా మార్చుకుంది. మూడు నెలల కిందటే పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోగా, ఫిబ్రవరి 8న రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి ఆమోదం లభించిందని తెలుస్తోంది.

ఓఎన్‌డీసీలో ఒక సెల్లర్‌ ప్లాట్‌ఫాం అయిన బిట్సిలాను సంస్థ కొనుగోలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని