ఈ ఏడాది వేతనాలు 9.5% పెరగొచ్చు: సర్వే

ప్రస్తుత సంవత్సరంలో దేశంలో వేతనాలు సగటున 9.5% పెరిగే అవకాశం ఉందని, 2023 పెరుగుదల అయిన 9.7% కంటే ఇది స్వల్పంగా తక్కువని ఓ సర్వే తెలిపింది.

Published : 22 Feb 2024 04:26 IST

దిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో దేశంలో వేతనాలు సగటున 9.5% పెరిగే అవకాశం ఉందని, 2023 పెరుగుదల అయిన 9.7% కంటే ఇది స్వల్పంగా తక్కువని ఓ సర్వే తెలిపింది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్‌ పీఎల్‌సీ ఈ సర్వే నిర్వహించింది. ఇందుకోసం 45 రంగాలకు చెందిన 1,414 కంపెనీల డేటాను విశ్లేషించింది. కొవిడ్‌-19 పరిణామాల అనంతరం 2022లో దేశీయంగా అధిక వేతన పెంపు లభించిందని, తదుపరి గరిష్ఠ ఏక అంకె స్థాయిలో వేతనాలు పెంపు ఉంటోందని తెలిపింది. సంఘటిత రంగానికి అంచనా వేసిన ఈ వేతన పెంపు.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా వ్యూహాత్మక సర్దుబాటును సూచిస్తోందని పేర్కొంది. ‘మౌలికం, తయారీ లాంటి రంగాలు గణనీయ వృద్ధిని నమోదు చేయడాన్ని కొనసాగిస్తాయి. కొన్ని రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమనే విషయాన్ని ఇది సూచిస్తోంద’ని ఎయాన్‌ ఇండియాలో ట్యాలెంట్‌ సొల్యూషన్స్‌కు ముఖ్య కమర్షియల్‌ అధికారిగా ఉన్న రూపాంక్‌ చౌదరి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పటిష్ఠ ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో, వేతన పెంపు అధికంగా ఉంటున్న దేశాల్లో భారత్‌ అగ్రగామిగా కొనసాగుతుందని సర్వే తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్‌, ఇండోనేషియా ఉన్నాయని పేర్కొంది. 2024లో ఈ రెండు దేశాల్లో సగటు వేతన పెంపు 7.3%, 6.5 శాతంగా ఉండనుందని పేర్కొంది. మనదేశంలో సిబ్బంది వలసల రేటు 2022లో    21.4% కాగా.. 2023లో 18.7 శాతానికి పరిమితమైందని సర్వే తెలిపింది. ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉందనే విషయాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే.. ఆర్థిక సేవల సంస్థలు, ఇంజినీరింగ్‌, వాహన, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉందని. రిటైల్‌, టెక్నాలజీ కన్సల్టింగ్‌, సేవల రంగాల్లో తక్కువ వేతన పెంపు ఉండొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని