రిలయన్స్‌ నుంచి ‘హనూమాన్‌’

దేశీయ కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో అతిపెద్ద అడుగు పడనుంది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ - 8 యూనివర్సిటీలు కలిసి ‘భారత్‌జీపీటీ’ పేరిట కన్సార్షియంగా ఏర్పడ్డాయి.

Updated : 22 Feb 2024 07:00 IST

చాట్‌జీపీటీ తరహా సేవలు లభ్యం
భారత్‌జీపీటీ ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఆవిష్కరణ

దేశీయ కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో అతిపెద్ద అడుగు పడనుంది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ - 8 యూనివర్సిటీలు కలిసి ‘భారత్‌జీపీటీ’ పేరిట కన్సార్షియంగా ఏర్పడ్డాయి. చాట్‌జీపీటీ తరహా సేవలను ‘హనూమాన్‌’ పేరుతో, వచ్చే నెలలో ఈ కన్షార్షియం ఆవిష్కరించనుందని తెలుస్తోంది. ముంబయిలో జరిగిన ఒక టెక్‌ సదస్సులో హనూమాన్‌ సారాంశాన్ని (స్నీక్‌ పీక్‌) కన్సార్షియం ప్రదర్శించింది. తమిళనాడులోని ఒక మోటార్‌ మెకానిక్‌, ఏఐ బాట్‌లో తన సందేహాలను తీర్చుకోవడం; ఒక బ్యాంకర్‌ హిందీ టూల్‌ను వాడుకోవడం; హైదరాబాద్‌కు చెందిన ఒక డెవలపర్‌ కంప్యూటర్‌ కోడ్‌ను రాయడానికి దీనిని ఉపయోగించుకోవడం వంటి దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ‘హనూమాన్‌’ మోడల్‌ విజయవంతమైతే 11 భాషల్లో నాలుగు ప్రధాన రంగాల్లో(ఆరోగ్య రంగం, పాలన, ఆర్థిక సేవలు, విద్య) ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చు. ఐఐటీల భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చేసిన ఈ మోడల్‌కు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచాయి.

ఏ సేవలు అందిస్తుందంటే..: ఓపెన్‌ఏఐ వంటి కంపెనీలు అందించే భారీ స్థాయి సేవలు కాకుండా చిన్న వ్యాపారులు, ప్రభుత్వ విభాగాలకు అందుబాటులో ఉండే సరళతర మోడళ్లు ‘హనూమాన్‌’లో ఉంటాయి. దేశంలోనే తొలి ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంలో రానున్న ‘హనూమాన్‌’ ద్వారా మాటలను అక్షరాల్లోకి మార్చే సదుపాయం ఉంటుంది. 140 కోట్ల మంది భారతీయుల్లో లక్షల మందికి చదవడం, రాయడం రాదన్న విషయాన్ని గుర్తుంచుకుని.. ఈ తరహా నిర్దిష్ట అవసరాలకు తగ్గట్లుగా పలు కస్టమైజ్డ్‌ మోడళ్లను ఇది తీసుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని